Sunday, May 19, 2024

సీఎం అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న..

తప్పక చదవండి
  • ప్రకటించిన అల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ..
  • రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు కసరత్తు
  • అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో తీన్మార్ మల్లన్న..
  • అన్ని సెగ్మెంట్లలో అభ్యర్థులను నిలబెట్టే యోచన..
  • పెండింగ్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ డెసిషన్..

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈసారి ఎన్నికల బరిలో ఉంటానని.. అది కూడా మేడ్చెల్ నియోజకవర్గం నుంచే బరిలో దిగుతానని ముందు నుంచి చెప్తూ వస్తున్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్.. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్నది ఇప్పటివరకు స్పష్టం చేయలేదు. అయితే.. ఆయన ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారని కొన్ని రోజులు.. లేదా కాంగ్రెస్ తరపున బరిలో దిగుతారంటూ మరికొన్ని రోజులు.. ప్రచారం జరిగింది.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగినా కాంగ్రెస్ మద్దతు ఉంటుదని కొన్ని రోజులు.. పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కట్ చేస్తే.. అవేవీ కాకుండా.. ఆయన ఆల్ ఇండియా ఫార్వర్ట్ బ్లాక్ పార్టీ తరఫున బరిలోకి దిగుతున్నారని ఓ క్లారిటీ వచ్చింది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. తెలంగాణలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున సీఎం అభ్యర్థి కూడా తీన్మార్ మల్లన్నే అని పార్టీ వర్గాలు ప్రకటించాయి. ఈ మేరకు మల్లన్నతో పార్టీ వర్గాలు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తీన్మార్ మల్లన్న ఇప్పటికే సర్వం సిద్ధం చేసుకున్నారు. అయితే.. ఇండిపెండెంట్‌గానే బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకున్న మల్లన్న.. కాంగ్రెస్ మద్దతు కోరినట్టు తెలుస్తోంది. ఈ మేరకు హస్తం నేతలతో చర్చలు కూడా జరిపారు. అయితే.. ఎలాంటి నిర్ణయం రాకపోవటంతో.. ఆ మ్యాటర్ అక్కడితోనే ఆగిపోయింది. ఇక ఈ క్రమంలోనే.. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని తీన్మార్ మల్లన్న సంప్రదించారు. ఏఐఎఫ్‌బీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్ రెడ్డితో సమావేశమైన మల్లన్న.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై లోతుగా చర్చించారు. అయితే.. తెలంగాణలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో ఫార్వర్డ్ బ్లాక్ తరఫున పోటీ చేసేందుకు మల్లన్న బృందానికి పార్టీ వర్గాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కాగా.. ఇదే అంశంపై పార్టీ తరపున మరిన్ని సమావేశాలు నిర్వహించి స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎంపిక చేసే పని తీన్మార్ మల్లన్న భుజస్కందాలపైనే పార్టీ పెట్టినట్టు తెలుస్తోంది.

- Advertisement -

అయితే, దీనిపై రానున్న రోజుల్లో మరిన్ని సమావేశాలు జరిపి స్పష్టమైన నిర్ణయం జరగాల్సి ఉన్నది. తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలోనే అన్ని సెగ్మెంట్లలో అభ్యర్థుల ఎంపిక జరగనున్నట్లు సమాచారం. అలాంటి పరిస్థితుల్లో తీన్మార్ మల్లన్నను ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసే అవకాశమున్నది. తీన్మార్ మల్లన్న సొంతంగా ఒక పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ చేసుకున్నా కొన్ని లీగల్, టెక్నికల్ అంశాలు కంప్లీట్ కావాల్సి ఉన్నందున ఇప్పటికిప్పుడు ఆ పార్టీ తరపున పోటీ చేయడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ కారణంగానే ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున బరిలోకి దిగడంపై కసరత్తు మొదలైంది.

స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడంపై గతంలో ఆ పార్టీ నేతలతో సంప్రదింపులు జరిగాయి. గుజరాత్‌లో జిగ్నేశ్ మెవానీ స్వతంత్రంగా పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన తరహాలో మేడ్చల్ విషయంలోనూ తీన్మార్ మల్లన్నకు సపోర్టు ఇవ్వాలనేది అప్పట్లో జరిగిన చర్చల సారాంశం. కానీ ఇంకా అది పెండింగ్‌లోనే ఉండడంతో ఫార్వర్డ్ బ్లాక్‌తో రిలేషన్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఒకవేళ కాంగ్రెస్ నుంచి నైతిక మద్దతు లేని పక్షంలో ఆ పార్టీకి కూడా తీన్మార్ మల్లన్న నుంచి ఎలాంటి సహకారం ఉండదని ఆయన సన్నిహితుల సమాచారం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి అది కాంగ్రెస్ పార్టీకే ఇబ్బందిగా మారుతుందన్నది వారి వాదన.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు