Friday, May 17, 2024

ఉపాధ్యాయ దంపతుల బదిలీ కోసం.. మౌన దీక్ష..

తప్పక చదవండి
  • గాంధీ జయంతి రోజు ఉపాధ్యాయుల మౌన పోరాటం.
  • స్పౌజ్ బదిలీలు జరపాలని దంపతుల నిరసన
  • వందలాదిగా తరలివచ్చిన 13 జిల్లాల ఉపాధ్యాయ దంపతులు..
  • శోకసంద్రమైన మహిళా టీచర్లు..
  • అమ్మానాన్నలని కలపండని అభ్యర్థిస్తున్న చిన్నారులు….
  • ఎన్నికల నోటిఫికేషన్ లోపే మా సమస్యను తీర్చండి
  • ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వాళ్ళనే తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం
  • ప్రభుత్వం స్పందించకుంటే మరిన్ని నిరసన కార్యక్రమాలకు సిద్ధం
  • ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్న పోలీసులు….
  • స్టేషన్ లలోను కొనసాగిన మౌనదీక్ష

హైదరాబాద్ : భర్త ఒక జిల్లాలో భార్య మరొక జిల్లాలో విధులు నిర్వహిస్తున్న తమను ఇప్పటికైనా ఒకే జిల్లాకు బదిలీ చేయాలని … గాంధీ జయంతి సాక్షిగా ఉపాధ్యాయ దంపతులు మౌన దీక్ష చేపట్టారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయం ముందు 13 జిల్లాల నుంచి తరలివచ్చిన ఉపాధ్యాయ దంపతులు వారి పిల్లలతో మౌనంగా నిరసన తెలిపారు. గడిచిన 22 నెలలుగా తమ కుటుంబాలు చిన్నాభిన్నమై నరకయాతన అనుభవిస్తున్నామని ప్రభుత్వ పెద్దలకు అధికారులకు అనేక పర్యాయాలు మొరపెట్టుకున్నామని ఆయనా దంపతుల బదిలీల సమస్య ఇంకా సమస్యగా మిగిలి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.మానవతా దృక్పథంతో తమ సమస్యను పరిష్కరించాలని ఉపాధ్యాయ దంపతులు అభ్యర్థించారు.

గాంధీ జయంతి రోజు మౌన దీక్ష..:
గాంధీ జయంతి రోజు మౌన దీక్ష ద్వారా గాంధేయ మార్గంలో తమ బాధను ప్రభుత్వానికి వ్యక్తం చేయడం కోసం డీఎస్సీ కార్యాలయానికి వచ్చామని శాంతియుతంగా తమ నిరసనను ఆవేదనను వ్యక్తం చేస్తున్నామని ఉపాధ్యాయులు స్పష్టం చేశారు. మిగిలిపోయిన 13 జిల్లాల్లో ఉపాధ్యాయ దంపతులను ఒకే చోటుకి చేర్చాలని తమ గోడు వెళ్ళబోసుకున్నారు ఉపాధ్యాయ దంపతులతో పాటు వారి పిల్లలు కూడా భారీ సంఖ్యలో ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. 13 జిల్లాల నుంచి వందల సంఖ్యలో ఉపాధ్యాయ కుటుంబాలు మౌన దీక్షలో పాల్గొనేందుకు డీఎస్సీ కార్యాలయాన్ని చేరుకున్నారు.

- Advertisement -

శోకసంద్రమైన మహిళలు :
గడిచిన 22 నెలలుగా కుటుంబానికి పిల్లలకు దూరమై సుదూర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నామని మానసికంగా శారీరకంగా అలసిపోయామని ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించాలని మహిళా ఉపాధ్యాయులు కన్నీటిపర్యంతమయ్యారు. వందల కిలోమీటర్లు ప్రయాణాలు చేయలేక కుటుంబాన్ని చూసుకోలేక వయోధికమైన తల్లిదండ్రులకు ఆసరాగా నిలబడలేక మానసికంగా కృంగిపోతున్నామని ఆవేదన చెందారు. ప్రభుత్వం వారు అధికారులు సానుకూల దృక్పథంతో తమ సమస్యను పరిష్కరించాలని వేడుకున్నారు ఉపాధ్యాయ దంపతులతో పాటు వారి పిల్లలు కూడా ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తమ తల్లిదండ్రులు విడివిడిగా ఉండడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ముఖ్యమంత్రి గారు తమ తల్లిదండ్రులను కలపాలని చిన్నారులు వేడుకున్నారు.

ప్రత్యేక ప్లకార్డులతో :
ఉపాధ్యాయ దంపతుల బదిలీలు జరపాలని డిమాండ్లతో కూడిన న ప్రత్యేకంగా రూపొందించిన ప్లకార్డులు, మహాత్మా గాంధీ చిత్రపటం తో పాటు కెసిఆర్ ని కలిపి రూపొందించిన ప్లకార్డులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈడ్చుకెళ్లిన పోలీసులు :
శాంతియుతంగా డీఎస్సీ కార్యాలయం ముందు మౌన దీక్ష నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను పోలీసులు బలవంతంగా నిర్బంధంలోకి తీసుకున్నారు. అనేకమంది మహిళా ఉపాధ్యాయులను ఈడ్చుకెళ్ళి పోలీసు వాహనాలలో పడేశారు. అరెస్ట్ అయిన ఉపాధ్యాయులను చిక్కడపల్లి,గాంధీనగర్ , ముషీరాబాద్ , నాంపల్లి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు.

స్టేషన్లలో కొనసాగిన దీక్ష :
డీఎస్సీ కార్యాలయం వద్ద అరెస్ట్ చేసిన ఉపాధ్యాయులను నగరంలోని పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. గాంధీ జయంతి రోజు శాంతియుతంగా మౌన దీక్ష నిర్వహిస్తున్న తమను బలవంతంగా అరెస్ట్ చేశారని ఉపాధ్యాయులు వాపోయారు. పోలీస్ స్టేషన్లో సైతం మౌన దీక్షను కొనసాగించారు.
ప్రభుత్వం వారు సానుకూల దృక్పథంతో తమ సమస్యను పరిష్కరించి ఉపాధ్యాయ దంపతులను కలపాలని స్పౌజ్ ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు.

పెండింగ్ లో ఉన్న స్పౌస్ బదిలీలను చేపట్టండి-నరేష్, కో కన్వీనర్, స్పౌజ్ ఫోరమ్..
గత జనవరిలో కేవలం 615 స్కూల్ అసిస్టెంట్ స్పౌజ్ బదిలీలు మాత్రమే చేపట్టడం జరిగిందని కానీ ఇంకా 1500 ఎస్జీటీలు, భాషా పండితులు, పీఈటిలు మరియు స్కూల్ అసిస్టెంట్ స్పౌజ్ బదిలీలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి తక్షణమే స్పౌజ్ బదిలీలు చేపట్టాలని కోరారు. ఇప్పటికిప్పుడు బదిలీలు చేపట్టిన 80 శాతం వరకు చేపట్టే అవకాశం ఉందనీ ఖాళీలు లేనివారికి ప్రస్తుతానికి డిప్యుటేషన్ ఇచ్చి భవిష్యత్తులో ఏర్పడే ఖాళీలలో అడ్జస్ట్ చేసే అవకాశం ఉన్నా కూడా అధికారులు స్పందించకపోవడం ఆవేదనకు గురి చేస్తుందని వాపోయారు.

స్పౌజ్ బదిలీలను వెంటనే జరపాలి :
వివేక్ స్పౌజ్ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షులు
గత 22 నెలలుగా వేరు వేరు జిల్లాలకు కేటాయించబడిన ఉపాధ్యాయుల ఆవేదనను అర్థం చేసుకొని, గత 22 నెలలుగా పడుతున్న మానసిక క్షోభ ని అర్థం చేసుకొని,ప్రభుత్వం పెద్ద మనసుతో వీలయినంత త్వరగా ఉపాద్యాయ దంపతుల బదిలీలను చేపట్టి, ఒక్క జిల్లా కు చేర్చాలి అని spouse ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు వివేక్ డిమాండ్ చేశారు.

ఎన్నికల నోటిఫికేషన్ లోపు మా సమస్యకు పరిష్కారం మార్గం చూపకుంటే మరిన్ని నిరసన కార్యక్రమాలు చేయడానికి తాముసిద్ధం అంటూ ఆవేదన వ్యక్తం చేసిన మహిళా ఉపాధ్యాయులు. గత 22 నెలలుగా కుటుంబాలకు దూరమై మానసికంగా ఎంతో క్షోభకి గురి అవుతున్నామని, రోజూ వందల కిలోమీటర్లు ప్రయాణించలేక శారీరక సమస్యలతో బాధపడుతున్నామని, తమ ఆవేదనని అర్థం చేసుకొని, 13 జిల్లాల spouse బదిలీలను తక్షణమే పూర్తి చేయాలి అని మహిళా ఉపాద్యాయులు త్రివేణి, అర్చన,మమత, అజార్ సుల్తానా, సౌజన్య, రాజేశ్వరి, శ్రీవిద్య కోరారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు