- తెలంగాణలో కాక రేపుతున్న పవర్ పాలిటిక్స్
- కేటీఆర్ విసిరిన సవాల్ స్వీకరించిన రేవంత్..
- ఎక్కడికి రావాలో చెప్పాలంటూ ప్రతి సవాల్..
తెలంగాణలో పవర్ పాలిటిక్స్ మంటలు రేపుతున్నాయి. రాష్ట్రంలో 24 గంటల ఉచిత కరెంట్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రధానంగా.. ఈ వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మంత్రి కేటీఆర్ మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే.. రాష్ట్రంలో ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇవ్వట్లేదని మరోసాని ఉద్ఘాటించిన రేవంత్ రెడ్డి.. ఈ విషయాన్ని ఎక్కడైనా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్‌ను సింగిల్ ఫేజ్‌గా ఇస్తున్నట్లు ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు.. గతంలోనే చెప్పినట్టు రేవంత్ గుర్తు చేశారు. రైతులకు త్రీ ఫేజ్ కరెంట్‌పై నియంత్రణ పాటిస్తున్నట్టు.. 8 నుంచి 10 గంటలే ఇస్తున్నామని స్వయంగా అధికారులే చెప్పినట్టు తెలిపారు. ట్రాన్స్ కో లాగ్‌బుక్స్ ప్రకారం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ విషయాన్ని నిరూపించారని చెప్పుకొచ్చారు.
సాగు కోసం ఎవరూ సింగిల్ ఫేజ్ మోటార్లు వాడరని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంపై మాట్లాడేందుకు ప్రజావేదిక వద్ద చర్చకు రావాలని బీఆర్‌ఎస్ నేతలు విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నానన్న రేవంత్ రెడ్డి.. ఎక్కడికి రావాలో మంత్రి కేటీఆర్ చెప్పాలని రేవంత్ అన్నారు. గజ్వేల్, చింతమడక, సిద్దిపేట, సిరిసిల్ల ఎక్కడికైనా సరే వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని రేవంత్ స్పష్టం చేశారు. మరోవైపు.. విద్యుత్ కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 16 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు రికార్డుల్లో చూపిస్తున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాగా.. అందులో 8 వేల కోట్లు రూపాయలను బీఆర్ఎస్ నేతలే అప్పనంగా దోచుకుంటున్నారని ఆరోపించారు. ఎక్కువ గంటలు కరెంట్ ఇస్తున్నట్టు చూపించి.. కేసీఆర్ కుటుంబం కోట్లకు కోట్లు దోచుకుంటుందని చెప్పినట్టు స్పష్టం చేశారు. కేంద్రం తక్కువ ధరకే విద్యుత్ అమ్ముతానంటే.. కేసీఆర్ కొనటం లేదని చెప్పుకొచ్చారు. ఛత్తీస్‌గఢ్ నుంచి జరిగిన విద్యుత్ కొనుగోళ్లలో కూడా కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని రేవంత్ ఆరోపించారు.