Sunday, April 28, 2024

పొంగులేటికి దెబ్బ మీద దెబ్బ…

తప్పక చదవండి
  • 10 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జా కేసు..
  • హైకోర్టుకు వెళ్లినా తప్పని చుక్కెదురు..
  • అధికారులు, పొంగులేటి వర్గీయుల మధ్య వాగ్వివాదం..
  • సర్వేలో తేలిన 22 కుంటల ప్రభుత్వ భూమి..
  • భూమి స్వాధీనం చేసుకున్న అదికారులు..
  • పార్టీ గొడవలలో ప్రదాన అనుచరులపై కేసులు..
  • ముప్పేట ఉచ్చు బిగిస్తున్న ప్రభుత్వం..

కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ప్రభుత్వం నుంచి దెబ్బ మీద దెబ్బ పడుతోంది.. కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన పొంగులేటి చెర నుండి భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రధాన అనుచరులుగా ఉన్న కొందరు నాయకులుపై పలు కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ముప్పేట దాడి ఎదురవుతుండడంతో పొంగులేటి వర్గీయులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. తన స్వాధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని కాపాడుకునేందుకు పొంగులేటి హైకోర్టును ఆశ్రయించినప్పటికీ అక్కడ కూడా చేదు వార్తే వినాల్సి వచ్చింది. ప్రభుత్వ సర్వేకు సహకరించాల్సిందేనని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఎస్ ఆర్ గార్డెన్ పక్కన ఉన్న సుమారు 10 కోట్ల రూపాయల విలువ చేసే 22 కుంటల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం నాడు హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఎస్ ఆర్ గార్డెన్ పక్కన ఉన్న ఎన్ఎస్పి స్థలాన్ని సర్వే నిర్వహించారు. సర్వే నిర్వహించే సమయంలో పొంగులేటి వర్గీయులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో, రెవెన్యూ అధికారులకు పొంగులేటి వర్గీయుల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇటు అధికారులకు అటు పొంగులేటి వర్గీయులకు మధ్య అనేక ప్రశ్నలు, సమాధానాలు చోటు చేసుకున్నాయి. ఇన్ని సంవత్సరాలు లేని సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చిందంటూ పొంగులేటి వర్గీయులు ప్రశ్నించినప్పటికీ అధికారులు మాత్రం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సర్వే నిర్వహిస్తున్నామని తంతు పూర్తి చేశారు. సర్వే నిర్వహించే క్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

రెవెన్యూ అధికారుల సర్వేలో ఎస్ఆర్ గార్డెన్ పక్కన 22 కుంటల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు నిర్ధారించి, అట్టి భూమికి సరిహద్దులు నిర్మించి ఆ స్థలాన్ని అధికారులు స్వాధీనపరుచుకున్నారు. గతంలో రెవెన్యూ అధికారులు ఎస్ఆర్ గార్డెన్ పక్కన సాగర్ కాల్వ భూమి 22 కుంటలు ఉన్నదని గతంలో సరిహద్దులు నిర్వహించి స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. తాజాగా రెండు రోజుల క్రితం రెవెన్యూ యంత్రాంగం ఆ ప్రాంతానికి చేరుకొని సర్వే చేపట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో పొంగులేటి సోదరుడు హైకోర్టు నుంచి ఆశ్రయించారు.

- Advertisement -

ఆ ప్రాంతంలో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించొద్దని హైకోర్టు కోరడంతో అందుకు నిరాకరించిన కోర్టు ఉమ్మడి సర్వేకు సహకరించాలని ఆదేశాలు ఇచ్చింది. ఎస్ ఆర్ గార్డెన్ పక్కన 140 సర్వే నెంబల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 2012 వ సంవత్సరంలో పసుపులేటి సైదులు దగ్గరనుంచి రెండు ఎకల భూమిని కొనుగోలు చేశారు. అనంతరం ఆ ప్రాంతంలో ఎస్సార్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ను నిర్మించారు. ఫంక్షన్ హాల్ పక్కనే ఎన్ఎస్పీ కాలువ వెళ్తుండడంతో కాలువకు, గార్డెన్ కు పక్కన ఉన్న స్థలం కబ్జాకు గురైంది. ఎన్ఎస్పి కాల్వ భూమి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎస్ఆర్ గార్డెన్ పక్కనే ఉన్నప్పటికీ ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ అధికారులు సాహసించలేదు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికార పార్టీలో ఉండడంతో అధికార యంత్రాంగం ఆ వైపు కూడా కన్నెత్తి చూడలేదు. అయితే ఈ నెల రెండో తేదీన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో అధికార పార్టీ పొంగులేటిని ఉక్కిరిబిక్కిరి చేసే పనిలో నిమగ్నమైంది. ఇందులో భాగంగానే పొంగులేటి స్వాధీనంలో ఉన్న 22 కుంటల భూమిని స్వాధీనం చేసుకుంది.

ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 58, 59 జీవోల ప్రకారం ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్న వారు ఈ సమయంలో వాటిని క్రమబద్ధీకరణ చేసుకోవాలని కోరింది. జిల్లాలో వేలాదిమంది 58, 59 జీఓల ప్రకారం ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి దరఖాస్తు అందలేదని రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా కారేపల్లి మండలం పండితాపురం గ్రామంలో జరిగిన కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్గాల మధ్య జరిగిన పార్టీ గొడవల్లో పొంగులేటి ప్రధాన అనుచరుడు మేకల మల్లిబాబు యాదవ్ పై కేసు నమోదు చేశారు. అదే విధంగా ప్రధాన అనుచరుడిగా చెప్పుకొనే తాళ్లూరి బ్రహ్మయ్య, మువ్వ విజయబాబులపై కూడా కేసులు నమోదయ్యాయి. అధికార బారాస ప్రభుత్వం ముప్పేట దాడి చేయడంతో పొంగులేటి వర్గీయులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు