Monday, October 2, 2023

రంజుగా తుంగతుర్తి రాజకీయం

తప్పక చదవండి
  • తుంగతుర్తి బరిలో దిగనున్న ఉద్యమనేత సతీమణి
  • మూడోసారి హ్యాట్రిక్‌ కొట్టాలని చూస్తున్న గాదరి
  • టికెట్‌ నాకే వస్తుందన్న ధీమాలో ఉన్న అద్దంకి
  • ఆశ చంపుకోలేక కసరత్తులు చేస్తున్న ఆశావాహులు
  • హీట్‌ పుట్టిస్తున్న తుంగతుర్తి రాజకీయంపై ప్రత్యేక కథనం

సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలోని, తుంగతుర్తి నియోజకవర్గం రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిగా మారిపోయాయి.. కొద్ది రోజులుగా అనేక రకాల మలుపులు తిరుగుతున్నతుంగతుర్తి రాజకీయాలఫై అందరి దృష్టి పడిరదనే చెప్పాలి. అధికార పార్టీతో పాటు కాంగ్రెస్‌ ఈ స్థానంపై గెలుపే లక్ష్యంగా గట్టి కసరత్తుతో ప్రణాళికలు సిద్దం చేసుకుని ముందుకు సాగుతోంది. ప్రస్తుత బీఅర్‌ఎస్‌ ఏమ్మెల్యే రెండు పర్యాయాలు గెలుపొంది, ముచ్చటగా మూడోసారి కూడా గెలవాలనే లక్ష్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ఏమ్మెల్యే వైఖరికి నిరసనగా నియోజకవర్గంలో ఆందోళన కార్యక్రమాలు చాలానే జరిగాయి. దళిత బంధు పథకంలో అవకతవకలు జరిగాయని విమర్శలు వచ్చాయి. దళితులపై దాడులు చేయిస్తున్నారని విపక్షాలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో అధికార బీఅర్‌ఎస్‌ పార్టీ ఈ సారి గాదరి కిషోర్‌ కు టిక్కెట్‌ ఇవ్వడం లేదని తనకే టిక్కెట్‌ వస్తుందనే నమ్మకంతో మాజీ గిడ్డంగుల చైర్మన్‌ మందుల సామెల్‌ నియోజకవర్గంలో ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే సర్వేల్లో కిషోర్‌ ఒడిపోతున్నరని కేసీఆర్‌ కొత్త వారికి అవకాశం ఇస్తారనే ప్రచారం జోరందుకుంది. తిరుమలగిరి ప్రగతి నివేదన సభలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ మరోమారు కిషోర్‌ ను గెలిపించాలని చెప్పడంతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గాదరి కిషోర్‌ ఖాయమని తేటతెల్లమయిపోయింది. దీంతో అసంతృప్తులు ఏం చేస్తారనే అంశం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యింది.

స్వల్ప తేడాతో సీటు చేజార్చుకున్న కాంగ్రెస్‌ :
ఇప్పటికే రెండు మార్లు స్వల్ప తేడాతో తుంగతుర్తి సీటును కోల్పోయిన కాంగ్రెస్‌ పార్టీ, ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ సీటును చేజార్చుకూడదనే గట్టి పట్ట్టుదలతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. అన్ని రకాలుగా అనుకూలతలు తమకే ఉన్నాయి కాబట్టి, తుంగతుర్తి విజయమే లక్ష్యంగా చేసుకుని పనిచేయాలనే పిలుపుతో క్యాడర్‌ ను అప్రమత్తం చేసింది. ఇక అభ్యర్థి ఎవరు.? అధిష్టానం ఎవరిని పంపుతుంది.? అన్న సస్పెన్స్‌ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. గతంలో రెండు పర్యాయాలు పోటీ చేసి కొద్దిపాటి తేడాతో ఓడిన అద్దంకి దయాకర్‌ మళ్లీ తనకే అవకాశం ఇవ్వాలని హైకమాండ్‌ ను కోరుతున్నారని తెలుస్తోంది. జనంలో ఉంటున్నాం మాకే ఇవ్వాలని కాంగ్రెస్‌ నేతలు జ్ఞాన సుందర్‌, వడ్డే పల్లి రవి, నర్సయ్య కోరుతుండగ, నగరి ప్రీతం తనకే అవకాశం ఉంది అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇక్కడి పరిస్థితులు గత ఫలితాల దృష్ట్యా తుంగతుర్తిలో కాంగ్రెస్‌ జెండా ఎగరాలంటే ఏ గ్రూపులు ఆరోపణలు లేని, కొత్త వారికి అవకాశం ఇవ్వాలని నూతన డిమాండ్‌ తెరమీదకు వచ్చింది.. సర్వేల ఆధారంగా కొత్త వాళ్ళను దించాలనే వ్యూహం కూడ అధిష్టానం పరిశీలిస్తున్నట్టు సమాచారం.

- Advertisement -

తెర మీదికి ఓ జర్నలిస్టు భార్య కృష్ణ వేణి పేరు :
తుంగతుర్తిలో రాజకీయాల్లో అనూహ్యంగా తెలంగాణ జర్నలిస్టు, ఉద్యమ నేత భార్య ఎస్‌ కృష్ణ వేణి పేరు తెరమీదకు వచ్చింది. ఇప్పటికే కృష్ణవేణి ఫౌండేషన్‌ పేరుతో పలు సేవా కార్య్రమాలు నిర్వహిస్తున్న ఆమె, ఈ సారి ఎన్నికల బరిలో నిలుస్తారని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉండి జర్నలిస్టు ఉద్యమాల్లో పాల్గొని, ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్ట్‌ గా, యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్న సయ్యద్‌ ఇస్మాయిల్‌ భార్య కృష్ణ వేణి కూడా జర్నలిస్ట్‌ గా, మీడియా సంస్థ నిర్వాహకురాలిగా, దళిత, గిరిజన మహిళా, పారిశ్రామిక వేత్తల సమన్వయ కర్తగా పనిచేస్తూ.. పేదలకు వైద్య ఆరోగ్య సేవలు అందిస్తూ వస్తున్నారు. కాగా ఈమెకు విద్యార్థి ఉద్యమాల నుంచి అనేక ప్రజా ఉద్యమాల వరకు అన్నిట్లో క్రియాశీలకంగా పనిచేసిన అనుభవం, జర్నలిస్టుగా నియోజవర్గ పరిధిలో ప్రముఖ పత్రికల్లో పనిచేయడం వల్ల క్షేత్ర స్థాయిలో పరిచయాలు ఆమె గెలుపుకు ఉపయోగ పడతాయని, ఆ విశ్వాసంతో ఇస్మాయిల్‌ తన సతీమణి కృష్ణ వేణి ని రంగంలోకి దించాలని చూస్తున్నారని చర్చ జరుగుతోంది.

కృష్ణవేణి సామాజికవర్గం ఓట్లు 60 వేల పైచిలుకు :
కృష్ణవేణి ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు.? ఏ వ్యూహంతో వస్తున్నారు.? అనే విషయాన్ని తెలుసుకునే ఆసక్తి నెలకొంది. కాగా ఇస్మాయిల్‌ ఉద్యమ నేపథ్యంతో పాటు కృష్ణవేణి సామాజికవర్గం ఓట్లు 60 వేల పైచిలుకు ఉండటంతో అవకాశం కల్పిస్తే, గెలుపు సునాయాసం అవుతుందని అభిప్రాయాన్ని కొందరు కాంగ్రెస్‌ నేతలు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెల్లే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. కాంగ్రెస్‌ ఢల్లీి పెద్దలు కొందరు కృష్ణవేణి దంపతులను పిలిచి మాట్లాడినట్టు ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా సామాజిక సమీకరణాలు, సేవా కార్యక్రమాలు, ఉద్యమ నేపథ్యంతో పాటు ముఖ్యంగా స్థానికత కూడా తమకు కలసి వస్తాయనే ఆశతో వీళ్ళు ఉన్నారు. అయితే కాంగ్రెస్‌ ఆశావహుల సంఖ్య పెరిగి కొత్తగా పిడమర్తి రవి పేరుతో పాటు బీజేపీ నుంచి రామచంద్రయ్య, వైయస్‌ ఆర్‌.టీ.పీ నుంచి ఏపూరి సోమన్న పేర్లు కూడా వినబడుతున్నాయి. ఈ సారి బీఎస్పీ అభ్యర్థి కూడా రంగంలో కి దిగే అవకాశముంది. ఇంకా కొందరు పేర్లు ప్రకటించాల్సి ఉంది. ఈ సారీ పాత వాళ్ళను దింపుతారా.. లేక కొత్త ప్రయోగం ద్వారా లాభం పొందుతారా..? అనేది వేచి చూడాలి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు