Saturday, May 11, 2024

సూర్యాపేటలో రాజకీయ రగడ..

తప్పక చదవండి
  • వట్టే జానయ్య వర్సెస్ మంత్రి జగదీష్ రెడ్డి..
  • బి.ఆర్.ఎస్ రెబల్ గా మారిన డి.సి.ఎం.ఎస్ చైర్మన్
  • బీఎస్పీ సూర్యాపేట అభ్యర్థిగా పోటీకి రెడీ అవుతున్న జానయ్య యాదవ్
  • ఒక్కరోజులోనే జానయ్యపై 42 కేసులు నమోదు.!
  • నా భర్తకు ఏం జరిగినా జగదీష్ రెడ్డిదే బాధ్యత : జానయ్య భార్య రేణుక
  • కేసులకు నిరసనగా మంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేసిన జానయ్య మద్దతుదారులు
  • బిసీ వర్సెస్ రెడ్డి రాజకీయంగా మారుతున్న సూర్యాపేట

( తెలంగాణ బ్యూరో )
హైదరాబాద్ : సూర్యాపేట జిల్లా రాజకీయాల్లో పెను మార్పులు రానున్నాయా అంటే.. అవుననే సమాధానమే వినిపిస్తోంది. గడచిన తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎదురులేని రాజకీయాలను ఒంటి చేత్తో నడిపిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. నిన్న మొన్నటి వరకు మంత్రికి కుడి భుజంగా పేరున్న జిల్లా డి.సి.ఎం.ఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ ఉన్నట్టుండి ఒక్కసారిగా మంత్రికి రెబల్ గా మారాడు. వీరిద్దరి మధ్య ఏం జరిగిందనే చర్చ సూర్యాపేటలో ఏ నోట చూసినా, సోషల్ మీడియా వేదికగా మారుమోగుతోంది.

మంత్రి జగదీశ్ రెడ్డి వద్ద బహుజనులకు అవమానాలు ఎదురవుతున్నందునే తాను బి.ఆర్.ఎస్ పార్టీని వీడి, రానున్న ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గం నుండి బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా మంత్రిపైనే పోటీకి నిలవాలని జానయ్య తలచినట్లు తెలుస్తోంది. పార్టీ ఏది అనేది ప్రకటించకున్నా, జానయ్య యాదవ్ మాత్రం సూర్యాపేటలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి దిగుతానని మాత్రం తేల్చి పారేశారు. గడచిన రెండు రోజులుగా ఈయన పలు ఇంటర్వ్యూలలో ఈ విషయాన్ని బహిరంగంగానే ప్రకటించారు. మంత్రి జగదీశ్ రెడ్డి పైనే పోటీ చేస్తానని జానయ్య ప్రకటన వెలువడిన 48 గంటల్లోనే జానయ్య పై పలువురు పోలీసులకు ఫిర్యాదులు చేయడం, ఆయనపై ఆదివారం నాటికే సుమారు 42 కేసులు నమోదైనట్లు జానయ్య సతీమణి రేణుక పేర్కొన్నారు.

- Advertisement -

ఒక బహుజనుడు తనపై పోటీకి నిలబడతానని ప్రకటించినందుకే మంత్రి జగదీశ్ రెడ్డి కక్షగట్టి తన భర్తపై అక్రమ కేసుల బాగోతం మొదలు పెట్టాడని, దీనికి నిరసిస్తూ ఆమె ఆదివారం నాడు తమ అనుచరులతో జనగామ-సూర్యాపేట హైవేపై భారీ రాస్తారోకో నిర్వహించారు. జానయ్య అనుచరులు మంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నిన్న మొన్నటి వరకు మంత్రి జగదీశ్ రెడ్డికి జిందాబాద్ లు, జేజేలు పలికిన వారే ఊహించని రీతిలో ధర్నా నిర్వహించి మంత్రి డౌన్ డౌన్ అనే నినాదాలు సూర్యాపేటలో మారు మ్రోగడంతో జరుగుతున్న పరిణామాలపై ఉమ్మడి జిల్లా మొత్తం జోరుగా చర్చించుకుంటున్నారు.

మంత్రి జగదీష్ రెడ్డి బాగోతం మొత్తం బయటపెడతా : డి.సి.ఎం.ఎస్. చైర్మన్ వట్టే జానయ్య సంచలన ప్రకటన
ఒక బహుజన బిడ్డగా రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేస్తే తప్పేందని బిఆర్ఎస్ రెబల్ నాయకుడు, డిసిఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నాడు. మంత్రి జగదీష్ రెడ్డి రాజకీయ బలాన్ని ఉపయోగించి, నాపై అక్రమ కేసులు బనాయిస్తే ఊరుకోబోనని మంత్రి అవినీతి చిట్టా మొత్తం ప్రజల ముందు పెడతానని ,ప్రజలే రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని జానయ్య సోషల్ మీడియా ఇంటర్వ్యూలో సంచలన ప్రకటన చేశారు. ఇదిలా ఉండగా, కొద్దిమంది తాము జానయ్య బాధితులమని తమ భూములను అక్రమంగా ఆయన కబ్జా చేశాడని ఆరోపిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. అయితే జానయ్య వర్గీయులను అడ్డుకున్న పోలీసులు మాత్రం జానయ్య బాధితుల నిరసనలను అడ్డుకునే ప్రయత్నం చేయలేదని తెలుస్తోంది. ఇన్నాళ్లు సూర్యాపేటలో తనకు ఎదురులేదని భావించిన మంత్రి జగదీశ్ రెడ్డి మూడోసారి గెలిచి, హ్యాట్రిక్ సాధించాలనే రాజకీయ ప్రణాళికలు రచిస్తున్న తరుణంలో ఎవరు ఊహించని విధంగా వట్టే జానయ్య ఎదురు తిరగడం, బహుజన వాదాన్ని ఎత్తుకోవడంతో సూర్యాపేట నియోజకవర్గంలో రాజకీయ రగడ మొదలైంది. ఒకవేళ బీఎస్పీ పార్టీ నుండి వట్టే జానయ్య యాదవ్ పోటీకి దిగితే ఎమ్మెల్యేగా గెలవకపోయినా, జగదీశ్ రెడ్డి ఓటమికి మాత్రం నిర్ణయ శక్తిగా మారే ప్రమాదం లేకపోలేదని స్థానికులంతా జోరుగా చర్చించుకుంటున్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో బీసీ వర్సెస్ రెడ్డి అనే నినాదాన్ని లేవనెత్తేందుకు జానయ్య పగడ్బందీ రాజకీయా వ్యూహాన్ని రచిస్తున్నట్లు తెలుస్తోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు