Saturday, April 27, 2024

పఠాన్‌ చెరు నియోజకవర్గంలో ‘ఆదాబ్‌’ కథనంతో అలజడి

తప్పక చదవండి
  • ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రభుత్వ యంత్రాంగం
  • బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందా?
  • కాంగ్రెస్‌ నాయకుడు కాట శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రశ్నించినా.. చలనం లేని ప్రభుత్వం..
  • కబ్జాతో సంబంధం ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యే, సోదరుడిపై క్రిమినల్‌ చర్యలు ఉంటాయా.?
  • కూల్చివేతల్లో వంట సామాగ్రిని సైతం కోల్పోయిన బాధితులు..
  • అమీన్‌ పూర్‌లో పేదలకు ఒక్క చట్టం.. ఛైర్మెన్‌కు మరో చట్టమా..
  • పంచాయితీ రాజ్‌ చట్టం సెక్షన్‌ 268ని వెంటనే అమలు చేయాలి..
  • ఐలాపూర్‌ గ్రామం, తండా పాలకవర్గాలపై, కార్యదర్శులపై చర్యలు ఎక్కడ.. ?
  • సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ కు చట్టం అమలు చేసే బాధ్యత లేదా..?
  • రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారూ ఈ బాధితులు కూడా మీ రాష్ట్రంలోని ఓటర్లే.. వీరికి న్యాయం చేయండి..

హైదరాబాద్‌ : సంగారెడ్డి జిల్లా, అమీన్‌ పూర్‌ మండల పరిధిలోని ఐలాపూర్‌, ఐలాపూర్‌ తండా గ్రామాల పరిధిలో పేద బిక్కి ప్రజలు, చిన్న చిన్న ప్రవేటు ఉద్యోగాలు చేసుకునే వారు పైసా పైసా కూడబెట్టుకొని స్థలం కొనుక్కొని సొంత ఇండ్లు నిర్మించుకున్నారు.. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి తమ్ముడు మధుసూదన్‌ రెడ్డి.. ఐలాపూర్‌ తండా గ్రామ పంచాయితీ శివారులోని పేదలకు మాయ మాటలు చెప్పడంతో, అయన మాటలు నమ్మి.. తాము కష్టపడి సంపాదించుకొని దాచుకున్న సొమ్ముతో అక్కడ ప్లాట్లు కొనుగోలు చేశామని కంటతడి పెట్టారు.. ఎమ్మెల్యే సోదరుడు మధు సుదన్‌ రెడ్డి, ఐలాపూర్‌ తండా లే అవుట్‌ లో విద్యుత్‌ శాఖ అధికారులు బిగించిన ట్రాన్స్‌ ఫార్మర్‌ ఓపెనింగ్‌ కు వచ్చిన స్థానికంగా ఉన్న పేదలకు, తనకు అందులో ఆరు ఎకరాల లే అవుట్‌ ఉందని.. మీరు కొనుగోలు చేసే ఇండ్లు కట్టుకుంటే ఏమి కాదని.. తాను ఎమ్మెల్యే సోదరుడినని భరోసా ఇచ్చాడని బాధితులు పేర్కొన్నారు.. ఎమ్మెల్యే సోదరుడు ప్లాట్లు చేసి పలువురికి 15 నుండి 20 లక్షల రూపాయల వరకు నోటరీ ద్వారా అమ్ముకొని సొమ్ము చేసుకున్నాడని ఆరోపించారు.. మధుసూదన్‌ రెడ్డి మాటలు విన్న పేదలు వారి బంధువులకు సైతం నచ్చజెప్పి ఒకే దగ్గర ఉంటామని సొంత ఇండ్లు కట్టుకోవచ్చని చెప్పడంతో.. వారి మాటలను నమ్మిన వారు సైతం.. గ్రామాల్లో ఉన్న పట్టా భూములను అమ్ముకొని వచ్చి అట్టి డబ్బులతో కొనుగోలు చేశామని తెలిపారు.. అధికారులు ఒక్కసారిగా వచ్చి మొత్తం కూల్చి వేయడంతో తాము ఒకవైపు డబ్బులు కోల్పోయి.. మరో వైపు ఇండ్లు కోల్పోయి.. ఏం చెయ్యాలో అర్ధంకాక దిక్కు తోచని స్థితిలో ఉన్నామని అన్నారు.. కనీసం ఇంటి సామాగ్రిని కూడా బయటకు తీసుకునే సమయం ఇవ్వలేదని, ఎలాంటి నోటిస్‌ లు ఇవ్వకుండా మొత్తం కూల్చివేశారని కంట తడి పెట్టారు..

మరీ విషాదకర విషయం ఏమిటంటే.. ఇంత జరిగి బాధితులు నిలువు నీడ కోల్పోయి.. మండుటెండలో నిద్రాహారాలు లేక బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతుంటే.. తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు అల్లాడుతుంటే స్థానిక ఎమ్మెల్యే గూడెం మహీపాల్‌ రెడ్డి కనీసం పరామర్శించడానికి కూడా రాకపోవడం దురదృష్టకరం.. ఒక ఎమ్మెల్యేగా ఆయన కనుసన్నలలోనే అధికార యంత్రాగము నడుస్తుంది.. మరి ఆయనకు తెలియకుండానే కూల్చివేతలు జరిగాయా..? అన్నది అర్ధంకాని విషయం.. తన నియోజకవర్గంలో ఆయనకు తెలియకుండా పూచికపుల్ల కూడా కదలదన్నది జగమెరిగిన సత్యం.. అలాంటిది పోలీసుల పహారాలో అధికారులు ఐలాపూర్‌, ఐలాపూర్‌ తండాలోని సర్వే నెంబర్‌ 119లో దాదాపు 500 ఇండ్లను దారుణంగా కూల్చివేస్తుంటే.. ఆయన ఎందుకు పట్టించుకోలేదన్నది ప్రశ్నార్థకంగా మారింది.. పైగా త్వరలోనే అంటే మరో ఆరు నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి.. ఈ దశలో ఇలాంటి ఘటన జరగడం ప్రభుత్వానికి అప్రతిష్ట కాదా..? ఈ విషయం స్థానిక ఎమ్మెల్యేకు గానీ అధికార పార్టీ నాయకులకు గానీ తెలియదా..? తెలిసే కావాలని మిన్నకుండి పోయారా..? లేక అధిష్టానం ఆదేశాలతోనే కూల్చివేతల కార్యక్రమం జరిగిందా..? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.. కోట్ల రూపాయల విలువజేసే భూములను సొంతం చేసుకుని వాటిని ఏదైనా కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టాలనే కుతంత్రం ఇందులో దాగుందా..? అసలు ఇక్కడ నివసించే ప్రజల ఓట్లు రేపు ఎన్నికల్లో అవసరం లేదనుకుంటున్నారా..? మరీ ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి సోదరుడు మధుసూదన్‌ రెడ్డి, స్థానిక సర్పంచ్‌ లు కలిసి ఇక్కడ స్థలాలను పేదలకు లక్షల రూపాయలు తీసుకుని, నోటరీమీద కట్టబెట్టిన మాట వాస్తవం కాదా..? మరి తన తమ్ముడు చేసిన నిర్వాకంపై ఎమ్మెల్యే ఇప్పటిదాకా స్పందించకపోవడానికి కారణం ఏమిటి..? కనీసం కాంగ్రెస్‌ నాయకుడు బాధితులను పరామర్శించి, వారికి భరోసా ఇచ్చిన తరువాత కూడా, అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ ఆయన బాధితులను కలిసి ధైర్యం చెప్పే బాధ్యత లేదా..? అని బాధితులు వాపోతున్నారు.. ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించుకుంటే.. గెలిపించిన నాయకుడే తమను రోడ్డుమీదకు తీసుకుని వస్తే ఇంకెవరికి చెప్పుకోవాలో అర్ధం కాక కన్నీరు మున్నీరు అవుతున్నారు.. ఇప్పటికైనా ఎమ్మెల్యే గూడెం మహీపాల్‌ రెడ్డి కల్పించుకుని తమకు న్యాయం చేయాలని వారు ప్రాధేయ పడుతున్నారు.. కాగా స్థానిక కాంగ్రెస్‌ నాయకుడు కాట శ్రీనివాస్‌ గౌడ్‌ ఇటీవలే బాధితులను పరామర్శించి, భరోసా ఇవ్వడంతో న్యాయం జరుగుతుందనే ఆశతో ఎదరు చూస్తున్నట్లు తెలిపారు.. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ నాయకుడు ప్రశ్నిస్తే తప్ప అధికారులకు, ప్రభుత్వానికి పేదల అంటే బాధ్యత లేదా..? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. కూల్చివేతల్లో వంట సామాగ్రిని సైతం కోల్పోయినా ప్రభుత్వానికి పేదలంటే పట్టింపు లేదా..? అంటూ ఈ ప్రాంతంలో బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి.. ఎనిమిది ఏండ్ల నుండి అధికారులు తమ విధులు నిర్వర్తించడం లేదా..? ఇన్ని రోజులు అధికారులు నిద్ర పోయారా..? ఇండ్లు కడుతుంటే ప్రాథమిక స్థాయిలో ఎందుకు నిలుపుదల చేయలేదు.. కరెంట్‌ మీటర్లు ఎలా ఇచ్చారు..? ట్రాన్స్‌ ఫార్మర్లు ఎలా బిగించారు..? ఇంటి నెంబర్లు ఎలా జారీ చేశారు..? ట్యాక్స్‌ ఎలా తీసుకున్నారు..? ఏ ఆధారంతో అంత మంది పేదల ఇండ్లను కూల్చివేశారంటు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, కాట శ్రీనివాస్‌ గౌడ్‌ బాధితులకు భరోసా నిచ్చిన విషయం విదితమే.. అయినా నేటికీ ప్రభుత్వం సైన్‌ బోర్డులు ఎందుకు ఏర్పాటు చేయలేదు…? ఇలాంటి విషయాలపై విచారణ జరిపి చర్యలు ఎందుకు తీసుకోలేదని అధికారుల తీరుపై పలువురు మండి పడుతున్నారు.. ఐలాపూర్‌ తండాలో జరిగిన 100ల కోట్ల లావాదేవీల్లో సంబంధం ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యే, సోదరుడిపై క్రిమినల్‌ చర్యలు ఉంటాయా అన్నది ప్రశ్నార్థకమే.. ? ఎమ్మెల్యే, ఎమ్మెల్యే తమ్ముడు మధుసూదన్‌ రెడ్డి ఆస్తులపై ఈడీ అధికారులు విచారణ జరిపితే.. వాస్తవాలు బట్టబయలు అవుతాయని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.. వందల కోట్ల భూస్కాంపై సీబీఐ, విజిలెన్స్‌ విచారణ చేపట్టాలంటూ పలువురు సామజిక కార్యకర్తలు డిమాండ్‌ చేస్తున్నారు.. ఈ అక్రమ వ్యహారాల్లో సంబంధిత అధికారుల పాత్ర కూడా ఉందని.. ఇది ముమ్మాటికీ మానవ హక్కుల ఉల్లంఘనే అని నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ కార్యాలయంలో పిర్యాదు చేయనున్నట్లు ఓ న్యాయవాది పేర్కొన్నాడు.. అక్రమ నిర్మాణాలు అయితే ప్రాథమిక స్థాయిలో నిలుపుదల చేయని అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోలేదు..? ఐలాపూర్‌, ఐలాపూర్‌ తండా గ్రామాల్లో నేటికీ పాలకవర్గాన్ని ఎందుకు రద్దు చేయలేదు..? సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ కు పంచాయితీ రాజ్‌ చట్టం 2018 లోని సెక్షన్‌ 268 అమలు చేసే బాధ్యత లేదా..? లేక విధులను యాది మరిచారా..? ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎమ్మెల్యే, ఎమ్మెల్యే సోదురుడు మధుసూదన్‌ రెడ్డి వ్యవహార శైలిపై విచారణ జరిపి, ప్రభుత్వ ఖజానాకు గండికొట్టి వందల కోట్లలో జరిగిన లావాదేవీల వ్యవహారంపై దృష్టి సారించాలని, అక్కడే పేద వారు కొనుగోలు చేసిన ప్లాట్లను వారికే చెందేలా నిర్ణయం తీసుకోని అండగా నిలువాలని.. పేదలకు భరోసా నివ్వాలని.. ప్రభుత్వ కూల్చివేతలో వంట సామగ్రితో పాటు ఇండ్లు కోల్పోయిన పేద ప్రజలు కోరుతున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు