- ఇక టెంట్లో ఉండాల్సిన పనిలేదు
- శతాబ్దాల నిరీక్షణకు తెర
- సహనం, కృషి, త్యాగాల ఫలితమే ఈ ఉజ్వల ఘట్టం
- ఎక్కడో లోపం వల్ల్నే ఇన్నాళ నిరీక్షణ
- అందుకు రాముడిని క్షమాపణలు కోరుకుంటున్నా
- మన ఆస్తి..అస్తిత్వం..సత్యం అంతా రాముడే
- కొత్త కాలచక్రం మొదలయ్యింది
- ఉద్వేగపూరతి ప్రసంగంలో ప్రధాని మోడీ
అయోధ్య : రాముడు వచ్చేశాడు.. మన రాముడు వచ్చేశాడు.. ఇక టెంటులో ఉండాల్సిన ఖర్మ రాముడికి లేదు… నభూతో నభవిష్యతి అనే రీతిలో అయోధ్యలో బాల రాముని ప్రాణప్రతిష్ట అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉద్వేగభరితమైన ప్రసంగం చేశారు. ‘సియావర్ రామ్ చంద్ర కీ జై, హమారే రామ్ ఆ గయా హై‘ అంటూ అతిథులు, రామభక్తుల హర్షాతిరాకాలు మధ్య తన ప్రసంగాన్ని ప్రారంభించారు. వేలాది సంవత్సరాల తర్వాత కూడా రామప్రతిష్ఠ జరిగిన ఈరోజును ప్రజలు కలకాలం గుర్తుంచుకుంటారని అన్నారు. రాముని దివ్యాశీస్సులు ఈరోజు మనం అంతా చవిచూస్తున్నామని అన్నారు. శతాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ శ్రీరాముడు ఎట్టకేలకు మనముందుకు వచ్చారని అన్నారు. శతాబ్దాల సహనం, కృషి, త్యాగాల ఫలితమే ఈరోజు రాముడు తిరిగి వచ్చారని అన్నారు. దశాబ్దాల పాటు న్యాయపోరాటం జరిగిందని, న్యాయాన్ని గెలిపించిన భారతదేశ న్యాయవ్యవస్థకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని అన్నారు. ఈరోజు రాముడికి క్షమాపణ చెప్పుకుంటున్నానని, మన ప్రయత్నాలో, త్యాగాల్లో ఎక్కడో లోపం జరిగి శతాబ్దాలుగా ఈరోజు కోసం నిరీక్షించాల్సి వచ్చిందని మోడీ అన్నారు. ఈరోజు అందరి కల సంపూర్ణమైందని, శ్రీరామచంద్రుడు అందర్నీ తప్పనిసరిగా క్షమిస్తారని తాను నమ్ముతున్నానని చెప్పారు. జనవరి 22వ తేదీన సూర్యుడు అత్యద్భుతమైన మెరుపులతో కాంతులు వెదజల్లారని, 2024 జనవరి 22వ తేదీ కేవలం క్యాలెండర్ మీద రాసిన రాత కాదని, సరికొత్త కాలచక్రానికి కేంద్రస్థానమని అన్నారు. రామ్‌లల్లా ఇంకెంతమాత్రం టెంట్‌లో కాలం గడపాల్సిన అవసరం లేదని, ఆయన భవ్యమైన రామాలయంలోనే కొలువుతీరుతారని చెప్పారు. రామాలయం జాతీయ ప్రజ్ఞకు సంకేతమని, విశ్వాసాలకు ప్రతీక అని, రాముడు దేశానికి పునాది అనిది, భారతదేశ ఆలోచనా విధానానికి, న్యాయానికి రాముడు ప్రతీక అని కొనియాడారు. దేశ కీర్తిపతాకం శ్రీరాముడని, రాముడిని గౌరవించుకుంటే ఆ ప్రభావం శతాబ్దాలు, వేలాది సంవత్సరాల పాటు ప్రజలపై ఉంటుందని అన్నారు. రామాలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైన ప్రజలందరికీ పేరుపేరునా ప్రధాని అభినందనలు తెలిపారు. దీనికి ముందు, అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనతో యావద్దేశం పులకించింది. నభూతో నభవిష్యతి అనే రీతిలో నిర్వహించిన బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం మధ్యాహ్నం 2 గంటలతో ముగియడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ఉపవాస దీక్షను విరమించారు. ప్రధాన అర్చకుల నుంచి పవిత్ర తీర్దాన్ని స్వీకరించి వారి ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అయోధ్య రామాలయ జ్ఞాపికను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధానికి బహూకరించారు. ‘పవిత్రమైన అయోధ్యాపురికి శిరసు వంచి నమస్కరిస్తున్నా. ఈ రోజు రామ భక్తులంతా ఆనంద పరవశంలో ఉన్నారు. ఎన్నో బలిదానాలు, పోరాటాలు, త్యాగాల తర్వాత మన రాముడు మళ్లీ అయోధ్యకు వచ్చాడు. ఈ శుభ గడియల్లో ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఈ కార్యం ఆలస్యమైనందుకు క్షమించమని రాముడిని వేడుకుంటున్నా. కొన్ని వందల ఏళ్ల తర్వాత కూడా ఈ తేదీని ప్రజలు గుర్తుంచుకుంటారు. ఈ క్షణం కోసం అయోధ్య ప్రజలు వందల ఏళ్లుగా నిరీక్షించారు. స్వాతంత్యర్ర వచ్చాక కూడా దశాబ్దాల పాటు న్యాయపోరాటం చేశాం. ఇన్నేళ్లకు మన స్వప్నం సాకారమైంది. శ్రీరాముడి ఆశీస్సులతో ఈ అద్భుత ఘట్టంలో పాల్గొనే అవకాశం దక్కింది. ఈ రోజు దేశమంతా దీపావళి జరుపు కుంటోంది. ఈ రాత్రికి ప్రతి ఇంటా రామజ్యోతి వెలగాలని మోడీ పిలుపునిచ్చారు. రామాలయ నిర్మాణంలో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయని, కానీ, చివరకు న్యాయమే గెలిచించిందని ప్రధాని ఈ సందర్భంగా తెలిపారు. ఇందుకు న్యాయవ్యవస్థకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ‘ఈ శుభ గడియల కోసం 11 రోజుల దీక్ష వహించా. రాముడితో అనుబంధం ఉన్న క్షేత్రాలన్నీ సందర్శించా. ఏపీలోని లేపాక్షి ఆలయం, తమిళనాడులోని రామేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నా. సాగర్ నుంచి సరయూ వరకు రామనామం జపించా. ఈ క్షణం దేశ ప్రజల సహనం, పరిపక్వతకు నిదర్శనం. ఇది మన విజయానికే కాదు.. వినయానికి కూడా సూచిక. కొందరు వ్యక్తులు మన సమాజ ఆత్మను అర్థం చేసుకోలేకపోయారు. రామనామం ఈ దేశ ప్రజల కణకణంలో నిండి ఉంది. మన దేశ సంస్కృతి కట్టుబాట్లకు రాముడే మూలం. ఆయన ఆదర్శం, విలువలు, క్రమశిక్షణ మనకు శిరోధార్యం. ఇది విగ్రహ ప్రాణ ప్రతిష్ఠే కాదు.. మన విశ్వాసాలకు ప్రాణప్రతిష్ఠ. రాముడు వివాదం కాదు సమాధానం. రాముడు అగ్ని కాదు.. వెలుగు. రాముడే భారత్ ఆధారం. ఆయనే భారత్ విధానం. రాముడే నిత్యం.. ఆయనే నిరంతరం. రాముడే విశ్వం.. ఆయనే విశ్వాత్మ‘ అని మోడీ కొనియాడారు. త్రేతా యుగంలో ప్రజలు రాముడు 14 ఏళ్ళు ఎదురు చూస్తే.. అయోధ్య వాసులు 500 ఏళ్ల నుంచి ఈ సమయం కోసం ఎదురు చూశారని అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అనంతరం అయోధ్యలో జరిగిన సభలో మోడీ తెలిపారు. వెయ్యేళ్ల తరువాత కూడా ఈ రోజును గుర్తుంచుకుంటారు..సరయూ నదికి… అయోధ్యపురికి నాప్రణామాలు.. రాముడు ఉన్న చోట హనుమంతుడు ఉంటాడు. ఎన్నో ఏళ్లు.. పోరాటాలు.. బలిదానాల తరువాత అద్భతమైన ఘట్టం ఆవిష్కృతమైందన్నారు. యూపి సిఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. అనుకున్న చోటే రామాలయం నిర్మించాం. ఎన్నో ఏళ్ల పోరాటాల తర్వాత ఈ అద్భుత ఘట్టం సాకారమైంది. ఈ ఆనందాన్ని నేను మాటల్లో వర్ణించలేను. ఈ క్షణం కోసం దేశమంతా ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసింది. ప్రాణప్రతిష్ఠతో దేశమంతా రామమయంగా మారింది. త్రేతాయుగంలో ఉన్నట్లుగా అనిపిస్తోంది. అయోధ్య ప్రపంచ సాంస్కృతిక రాజధానిగా వర్ధిల్లుతుంది. మోడీ దూరదృష్టి, అంకితభావంతోనే ఇదంతా సాధ్యమైంది. అయోధ్యకు పూర్వవైభవం తెచ్చేందుకు రూ. వందల కోట్లు కేటాయించారు. రాముడు మనకు ఓర్పు బోధించారు. ఈ ప్రాణప్రతిష్ఠ వేడుకను తిలకించిన ఈ తరం ఎంతో అదృష్టవంతులు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ రామరాజ్యాన్ని సాకారం చేస్తుంది. ఇందులో భాగస్వాములైన అందరికీ ధన్యవాదాలు‘ అని సీఎం ఆనందం వ్యక్తం చేశారు.