Wednesday, September 11, 2024
spot_img

తెలంగాణలో రాబోయేది ప్రజాప్రభుత్వం

తప్పక చదవండి
  • ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే బాధ్యత నాది
  • తెలంగాణ ఇచ్చి పదేళ్లయినా ప్రజలకు న్యాయం జరగలేదు
  • కెసిఆర్‌ దొరహంకారంతో ప్రజలకు తప్పని పాట్లు
  • ధరణితో ప్రజల భూములు లాగేసుకున్నారు
  • కాళేవ్వరంతో అవినీతి పరాకాష్టకు చేరింది
  • కెసిఆర్‌,మోడీ ఇద్దరూ ఒక్కేటేనన్న రాహుల్‌
  • పెద్దపల్లి సభలో కెసిఆర్‌ పాలనపై రాహుల్‌ విమర్శలు

పెద్దపల్లి : తెలంగాణ ఇచ్చి పదేళ్లయినా ఇక్కడి ప్రజల్లో మార్పు రాలేదని, దొరల పాలన కారణంగానే ప్రజల స్థితిగతులు మారలేదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని, ఇక్కడి భూములు ముంచి, ఇక్కడి భూములను లాక్కున్నారని మండిపడ్డారు. అయినా ఇక్కడి ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలగలేదు. ముఖ్యమంత్రికి, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రమే లాభం కలిగింది. ధరణి పోర్టల్‌తో పేదల భూములను సీఎం కెసిఆర్‌ లాకున్నారు. ధరణఙతో భూముల రికార్డులు మార్చేసి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. పెద్దపల్లిలో జరిగిన కాంగ్రెస్‌ సభలో కాంగ్రెస్‌ యువనేత రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్‌, ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ అబద్దాల కోరు, మోదీ మోసగాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ’ఇప్పుడు దొరల తెలంగాణ `ప్రజల తెలంగాణ మధ్య యుద్ధం జరుగుతోంది. కీలక శాఖలన్నీ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల ఆధీనంలో ఉన్నాయి. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ళు, రుణ మాఫీ అమలు కాలేదు. పెద్ద పెద్ద రైతులకే రైతుబంధు లాభం జరిగింది. తెలంగాణకు వస్తే నాకు ఎంతో సంతోషంగా ఉంది. నాకు తెలంగాణతో ఉన్న సంబంధం… రాజకీయ సంబంధం కాదు. కుటుంబంతో ఉన్న అనుబంధం నాది. 2004లోనే తెలంగాణ ఏర్పాటుకు సానుకూలంగా ప్రకటన చేసింది. ఆ తర్వాత రాష్ట్ర ఏర్పాటుకు సోనియా నిర్ణయం తీసుకున్నారు. సింగరేణి గనులను ప్రైవేటు పరం కానివ్వం. ఇక్కడి గనులను అదానికి అమ్మే ప్రయత్నాన్ని మేమే అడ్డుకున్నాం.దేశవ్యాప్తంగా అన్ని వనరులను అదానికే మోడీ అప్పగిస్తున్నారు. కార్మికులు, రైతులకు కాంగ్రెస్‌ అండగా ఉంటుంది. దళితులకు మూడేకరాలని కేసీఆర్‌, 15 లక్షలు ఖాతాల్లో వేస్తామని మోదీ మోసం చేశారు. కాంగ్రెస్‌ ఇచ్చిన మాట తప్పదు. కర్ణాటక, ఛత్తీస్‌గడ్‌లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం. కర్ణాటకలో మీరు ఎవరినైనా అడిగి తెలుసు కోండి.’ అని రాహుల్‌ గాంధీ అన్నారు.

తెలంగాణలోనూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాం. 6 గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తాం. ఎన్నికల తర్వాత మొదటి కేబినెట్‌ మీటింగ్‌ లోనే వీటిని అమలు చేస్తాం. అధికారంలోకి వచ్చిన మొదటి రోజే అమలు చేస్తాం అని హామీ ఇచ్చారు. కేసీఆర్‌ ఇక మీ ప్రభుత్వం ఉండదు. ప్రజల ప్రభుత్వం రాబోతోంది. బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం ఒక్కటే. ఈ మూడు పార్టీలు కలిసి పని చేస్తున్నాయి. బీజేపీకి ఓటు వేసినా, ఎంఐఎంకు వేసినా బీఆర్‌ఎస్‌ కు వేసినట్టే. నేను బీజేపీపై పోరాటం చేస్తున్నాను. నాపై 26 కేసులు పెట్టారు. లోక్‌సభ సభ్యత్వం రద్దు చేశారు. ఢల్లీిలో ఇంటిని లాక్కున్నారు. సభలో మాట్లాడితే మైక్‌ కట్‌ చేస్తున్నారు. అవినీతి కేసీఆర్‌పై మాత్రం ఎలాంటి కేసులు ఉండవు. అన్ని విషయాల్లో బీజేపీకి బీఆర్‌ఎస్‌ మద్దత్తు ఇచ్చింది. ఇక్కడ బీఆర్‌ఎస్‌ను, ఢిల్లీలో బీజేపీని ఓడిరచాలి. కాంగ్రెస్‌ తుఫాన్‌ రాబోతుంది. కాంగ్రెస్‌ కార్యకర్తలే మా పులులు. ఎవరికి భయపడొద్దు, రాబోయేది తెలంగాణ ప్రజల ప్రభుత్వం. కాంగ్రెస్‌ సర్కారులో కార్యకర్తల భాగస్వామ్యం ఉంటుందని రాహుల్‌ గాంధీ అన్నారు. రాజకీయంగా పార్టీకి నష్టమని తెలిసినా, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని, పదేళ్లు గడిచినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని అన్నారు. ఒక కుటుంబంతో ఉండే అనుబంధం తనకు తెలంగాణతో ఉందన్న రాహుల్‌, నెహ్రూ, రాజీవ్‌ గాంధీ, ఇందిరా గాంధీలకు తెలంగాణతో మంచి అనుబంధం ఉందని గుర్తు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ముఖ్యమంత్రిలా కాకుండా రాజులా వ్యవహరిస్తున్నారని రాహుల్‌ విమర్శించారు. రాష్ట్రంలో ముఖ్య శాఖలన్నీ తమ ఆధీనంలోనే ఉంచుకున్నారని మండిపడ్డారు. పదేళ్లలో కేసీఆర్‌ ఏ ఒక్క హామీనైనా నెరవేర్చారా అంటూ ప్రశ్నించారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఎంతమందికి ఇచ్చారని, రూ.లక్ష రుణ మాఫీ ఎంతమందికి చేశారో ప్రజలు ఆలోచించుకోవాలని అన్నారు. భూస్వాములు, ధనవంతులకు మేలు చేసేందుకే రైతు బంధు తెచ్చారని ధ్వజమెత్తారు. ’ధరణి’ పేరుతో భూములు కంప్యూటరైజ్డ్‌ చేస్తున్నామని చెప్పి పేదల భూములను లాక్కున్నారని రాహుల్‌ ఆరోపించారు. ఈ సభలో రాహుల్‌ గాంధీ, రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, మకాన్‌ సింగ్‌ రాజ్‌ ఠాకూర్‌, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి విజయ రమణారావు పాల్గొన్నారు.పెద్దపల్లి కాంగ్రెస్‌ సభలో రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. ’ఏమిచ్చినా, ఎంత చేసినా కాంగ్రెస్‌ కార్యకర్తల రుణం తీర్చు కోలేనిది. ప్రజలను నట్టేట ముంచిన కేసీఆర్‌. మూడో సారి ముఖ్యమంత్రి కావాలని చూస్తున్నారు. ఉద్యోగాలు రాక ఆడ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటే అవహేళన చేస్తున్నారు. కేసీఆర్‌ మరోసారి మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్‌ కుటుంబం నాంపల్లి దర్గా నో, బిర్లా మందిర్‌ వద్దో బిచ్చము అడుక్కునేదన్నారు. ఇవాళ లక్ష కోట్లు, వేలాది ఎకరాల భూములు ఎక్కడి నుంచి వచ్చాయో కేసీఆర్‌ చెప్పాలి. రాహుల్‌ గాంధీ ఎవరూ అడుగుతున్న సన్నాసి కేటీఆర్‌. ఆ కుటుంబ త్యాగం ఏమిటో తెలుసుకోవాలి. గాంధీ కుటుంబానికి ఉండటానికి ఇళ్ళు లేని పరిస్థితి ఉంటే, పదేళ్లలో ఫామ్‌ హౌజ్‌ లు కట్టుకున్న చరిత్ర..ఇంత బలుపు ఎందుకు కేటీఆర్‌, తెలంగాణ రాకుంటే అమెరికాలో బాత్‌ రూమ్‌లు కడుక్కుని బతికేవాడివి.’ అని రేవంత్‌ రెడ్డి విమర్శించారు. పెద్ద పల్లి కాంగ్రెస్‌ సభలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్‌ కట్టిన ప్రాజెక్టులతోనే కరీంనగర్‌ సస్యశ్యామలం అయిందని తెలిపారు. బీఆర్‌ఎస్‌ పాలనలో అభివృద్ధి కుంటుపడిరదని విమర్శించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు