Friday, May 10, 2024

నిర్లక్షపు నీడలో తెలంగాణ వైద్య శాఖ..

తప్పక చదవండి
  • ప్రజారోగ్యం పడకెక్కేసింది..
  • మెడికల్ మాఫియా రెచ్చిపోతోంది..
  • ఆర్.ఎం.పీ.లు మొదలుకుని, కార్పొరేట్
    డాక్టర్ల వరకు మెడికల్ మాఫియాలో భాగస్వాములే..
  • నియంత్రించడానికి ఎందుకు వెనుకంజ వేస్తున్నారు..
  • ప్రభుత్వ పెద్దలే మెడికల్ మాఫియాతో
    అంటకాగుతున్నారా..?
  • కాలుష్య నివారణలో ప్రభుత్వాలు ఫెయిల్యూర్..
  • బాధ్యతలు మరుస్తున్న బాధ్యతగల ప్రభుత్వ సంస్థలు..
  • అక్రమ సంపాదనే ధ్యేయంగా..
    బయోవార్ కు తెరతీస్తున్నారా..?
  • భవిష్యత్తులో జరుగబోయే అనర్ధాలను
    ఎవరు ఎదుర్కొంటారు..?

మెడికల్ మాఫియా.. కాలుష్య భూతం.. ప్రభుత్వాల నిర్లక్ష్యం.. అవినీతి అధికారుల పాపం.. వెరసి తెలంగాణ రాష్ట్రంలో బయోవార్ జరుగుతోంది.. భయపడుతూ బ్రతుకులు గడపాల్సిన గడ్డు పరిస్థితి నెలకొంది.. క్షణ క్షణం ప్రాణభయంతో గడిపే దుస్థితి ఎందుకు వచ్చింది..? కనీసం ఆరోగ్యంతో జీవించే హక్కును కోల్పోయిన రాష్ట్ర ప్రజలను ఆదుకునే నాధుడు అసలు ఉన్నాడా..? అనేది ప్రశ్నార్థకంగా మారింది.. కేవలం అక్రమ సంపాదనకు తెగబడుతూ.. ప్రజల ఓట్లతో గెలిచి, అధికారం చెలాయిస్తూ.. వారి బాగోగులు వదిలేసి పరిపాలన సాగుతున్న ప్రభుత్వాలకు ఎప్పుడు బుద్ధి వస్తుంది..? నడిచే దేవుళ్లుగా కీర్తించబడుతున్న డాక్టర్లు తాము ఎందుకు జన్మించారో..? అన్న విషయాన్ని పక్కనబెట్టి.. తమ వృత్తికి ద్రోహం చేస్తుండటం శోచనీయం.. అలాగే మందులు తయారుచేసే కంపెనీలు ప్రజల ఆరోగ్యాలు కాపాడటానికి, అవసరమైన విధంగా, వారికి అందుబాటులో ఉండేలా తయారీ ప్రక్రియను చేపట్టవలసి ఉంటుంది.. కానీ కేవలం స్వలాభం కోసం, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ.. నాశిరకం ఉత్పత్తులు చేయడం.. అధిక ధరలకు మందులు అమ్మడం గర్హనీయం.. ఇక వాతావరణాన్ని కలుషితం చేయకుండా ఉత్పత్తులు చేపట్టాల్సిన కెమికల్ కంపెనీలు విచ్చలవిడిగా ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా.. కాలుష్యాలను వెదజల్లే వ్యర్ధాలను.. ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తుండటం అత్యంత ప్రమాదకరంగా మారిందని చెప్పవచ్చు.. కాలుష్య నియంత్రణ మండలి ఉన్నాకూడా ఎందుకూ పనికిరాకుండా పోయింది.. అవినీతి కాలుష్యంతో అంటకాగుతోంది.. ఇక మార్పు వస్తుందనే నమ్మకం కూడా లేకుండా పోతోంది..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ ఫీవర్స్, సీజనల్ జ్వరాలు, తండాలలో విష జ్వరాలు.. ప్రభలుతున్నాయి.. ప్రభుత్వ ఆసుపత్రులు కిట కిటలాడి పోతున్నాయి.. కానీ ప్రభుత్వ దవాఖానాల్లో సౌకర్యాలు తగినంతగా లేకపోవడం దురదృష్టం.. తప్పని సరి పరిస్థితుల్లో రోగాలబారిన పడిన బాధితులు ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది.. దీనితో డబ్భుతో బాటు విలువైన సమయం వృధా అవుతోంది.. పోనీ ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించడం వల్ల జబ్బులు తగ్గుతాయా..? అంటే అనుమానమే.. కేవలం డబ్బులు దోచుకోవడానికే అలాంటి ఆసుపత్రులు పనిచేస్తున్నాయి అన్నది నిర్విదాంశం.. శవాలమీద పేలాలు ఏరుకునే విష సంస్కృతి అడుగడుగునా వేళ్లూనుకుని పోయింది.. ఈ దరిద్రం రూపు మాపాలి.. దానికి మనమే కంకణం కట్టుకోవాలి.. ప్రజా చైతన్యం వెలుగు చూసిన నాడే ఏదైనా సాధ్యం అవుతుంది అనే నిజాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి.. మనిషికి చదువు, ఆరోగ్యం, ఉపాధి అన్నవి కనీస అవసరాలు.. ఈ అవసరాలను తీర్చడానికే ప్రభుత్వాలు పనిచేయాల్సి ఉంటుంది.. ఒక నిబద్దతతో కూడిన ప్రణాళిక ఏర్పరచుకుని కాలుష్యాన్ని నివారిస్తూ.. మందుల తయారీ కంపెనీలను నియంత్రిస్తూ.. ఎక్కడా అవినీతికి తావులేకుండా.. ప్రజాసేవే పరమావధిగా పనిచేసే ప్రభుత్వాలు ఏర్పడినప్పుడే సమూలంగా మార్పు సాధ్యమవుతుంది.. అంతవరకూ షరా మామూలే అన్న చందంగా పరిస్థితులు ఉండక తప్పవు..

- Advertisement -

ఇక కెమికల్ కంపెనీల గురించి చెప్పుకోవాలంటేనే అసహ్యం వేస్తోంది.. వీరి పరిశ్రమలనుండి విడుదల అవుతున్న కాలుష్యం, వ్యర్ధాలు.. డబ్బాలలో దాచి ఉంచి నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారు.. వీరికి వర్షాకాలం వచ్చిందంటే పండుగే.. వర్షం నీటితో కలిపి వ్యర్ధాలను వదిలేస్తున్నారు.. మూసీ లాంటి నీటిలో నిర్లజ్జగా వదిలేస్తున్నారు.. అంతే కాకుండా కంపెనీలలోనే భూగర్భ బావులు త్రవ్వి నేరుగా వ్యర్ధాలను అందులో వదిలేస్తున్నారు.. దీంతో భూగర్భ జలాలు కలుషితం అయిపోతున్నాయి.. ఆ కలుషితం అయిన నీళ్లు ప్రజలు త్రాగే నీళ్లలో కలుస్తున్నాయి.. నేరుగా నల్లాల ద్వారా ప్రతి ఇంటిలోకి వస్తున్నాయి.. దీంతో ప్రతి ఇంటిలోనూ ప్రమాదకర జ్వరాలు వస్తున్నాయి.. సామాన్యులు జబ్బు పడితే కనీసం వైద్యం చేయించుకోవడానికి కూడా ఎంతో కష్టపడతారు.. వారి సంపాదన యావత్తూ వైద్యానికే సరిపోతుంది.. ఇక తినడానికి ఏమీ మిగలదు.. పస్తులతోనే గడపాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.. ఉన్న మహారాజులు ఎలాగైనా వైద్యం చేయించుకుంటారు.. ముఖ్యమంత్రి లాంటి వ్యక్తులకు కార్పొరేట్ వైద్యం ఇంటివద్దే లభిస్తుంది.. కానీ ఆయన పాలనలో జీవించే సామాన్యప్రజలకు మాత్రం నరకం కనిపిస్తోంది.. ఇటు ప్రభుత్వ దవాఖానలో సౌకర్యాలు లేక, అటు కార్పొరేట్ వైద్యం చేయించుకోలేక సతమతమవుతున్నారు.. అయ్యా ముఖ్యమంత్రి గారూ ఒక్కసారి దీనిపై దృష్టిపెట్టాలని సామాన్యులు వేడుకుంటున్నారు.. గాంధీ, ఉస్మానియా, పోలీస్, బస్తీ, ఒక్కటేమిటి అన్ని ఆసుపత్రుల్లో రోగులకు సరైన సౌకర్యాలు లేవు.. కనీస ఏర్పాట్లు లేవు.. రోగులకు తగినన్ని బెడ్స్ కూడా లేకుండా నేలమీదే వైద్యం జరుగుతోంది… వైద్యం కోసం గంటల తరబడి క్యూ లలో నిలుచోవాల్సిన దరిద్రం దాపురించింది.. చివరికి వైద్యం చేసే డాక్టర్లు సైతం రోగాల బారిన పడుతున్నారు.. తగిన మెడిసిన్ లేదని, వేడి నీటిలో పసుపు వేసుకుని తాగాలని, ఒక్కసారి జ్వరం వచ్చిందంటే కనీసం వారం రోజులు బాధపడక తప్పదని స్వయానా వైద్యులే చెబుతుండటం పరిస్థితులు ఎంతకు దారి తీశాయో అర్ధం చేసుకోవచ్చు..

ఇక ఒకవైపు వైద్యా శాఖ మంత్రి.. ప్రభుత్వ ఆసుపత్రులు అద్భుతంగా ఉన్నాయని, సౌకర్యాలకు కొదవేలేదని ప్రతి మీటింగ్ లోనూ చెప్పుకుంటున్నారు.. కానీ వాస్తవంలో అలాంటి పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు.. సౌకర్యాల లేమితో ఎందరో అమాయకులు ప్రభుత్వాసుపత్రుల్లో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు అనేకానేకం చూస్తున్నాం.. కనీస సౌకర్యం అయిన అంబులెన్సులు కూడా లేకపోవడం శోచనీయం… ఇక ఆసుపత్రుల సిబ్బంది కొందరు నిస్సిగ్గుగా పబ్లిక్ గా లంచాలు అడుగుతుండటం కూడా దయనీయ స్థితికి అద్దం పడుతోంది.. ఇక ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు ప్రభుత్వ పెద్దల కనుసన్నలలో ఉండటం కూడా మరో దారుణ పరిస్థితికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.. అందుకే ప్రభుత్వ వైద్యాన్ని అటకెక్కించి, ప్రైవేట్ ఆసుపత్రులకు పెద్దపీఠ వేస్తున్నట్లు కనిపిస్తూనే వుంది..

ఇక కాలుష్య నియంత్రణ మండలి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతోంది.. అర్హతలేకున్నా తమకు నచ్చిన కంపెనీలకు అనుమతులు ఇవ్వడం.. లక్షలాది రూపాయలు వెనుకేసుకోవడం జరుగుతోంది.. తద్వారా ప్రకృతి యావత్తు కలుషితమైపోతోంది.. గాలి, నీరు ఒక్కటేమిటి అణువణువూ కాలుష్యం బారిన పడుతున్నాయి.. ప్రజారోగ్యాలు నాశనం అయిపోతున్నాయి.. అసలు ఇలాంటి కంపెనీల యాజమాన్యం కానీ, పాలించే పాలకులు గానీ, అవినీతి అధికారులు గానీ వాస్తవాలను గ్రహించకపోవడం దారుణం.. రేపటి రోజున పూర్తిగా వాతావరం కలుషితమై పోయి… ఆక్సిజన్ సైతం కొనుక్కోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.. అప్పుడు వారు కూడా బాధితులు అవుతారు కదా..? ఇప్పటికే నీళ్లు కొంటున్నాం.. ఇది గ్రహించాలి.. అవినీతి చేసే ముందు అన్నీ బావుంటాయి.. కానీ మనం చేసే పనులు ప్రకృతితో బాటు.. కనిపించని దేవుడు కూడా చూస్తూ ఉంటాడని తెలుసుకోవడం అత్యవసరం.. ఈ నిజాలను గ్రహించగలికే ప్రభుత్వాలు, అధికారులు రావాలని కోరుకుంటోంది ‘ఆదాబ్ హైదరాబాద్’..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు