Saturday, April 27, 2024

నైన్‌ నయవంచన..!(జాయినింగ్‌ కాలేజ్‌ ల్లో.. కోచింగ్‌ అకాడమీలో)

తప్పక చదవండి
  • అనధికారికంగా క్లాస్‌ లు
  • ఒక్కో విద్యార్థి నుంచి రూ.1.60-2.60 లక్షలు వసూల్‌
  • ప్రతీఏటా కోట్ల రూపాయల్లో వ్యాపారం
  • జీఎస్టీని ఎగవేస్తున్న నైన్‌ ఎడ్యుకేషన్‌
  • శివానుజ, శ్రీ ఆకాష్‌ కళాశాలల విద్యార్థులకు నైన్‌ లో కోచింగ్‌
  • ప్రతీఏటా వందమంది స్టూడెంట్స్‌ తరలింపు
  • ఆమ్యామ్యాలు దిగమింగి సైలెంట్‌ అవుతున్న రంగారెడ్డి, హైదరాబాద్‌ డీఐఈవోలు

అవినీతి అంబోతులకు శాఖతో పనేముంది అన్నట్లుంది యవ్వారం. అందుకేనేమో ఇంటర్‌ బోర్డులో అవినీతి తిమింగలాలు ఇచ్చిన అండతో రంగారెడ్డి, హైదరాబాద్‌ లోని నైన్‌ ఎడ్యుకేషన్‌ అకాడమీ నిర్వాహకులు అడ్డగోలుగా రెచ్చిపోతున్నారు. ఈ రెండు జిల్లాల పరిధిలో పలు కళాశాలలతో కుమ్ముక్కై అందిన కాడికి దండుకుంటున్నారు. వీరి అక్రమ సంపాదనకు జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారులు రెండు చేతుల తమవంతు సహకారాన్ని అందజేస్తున్నారు. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గన్నట్లు.. చేసేది పూర్తిగా ఇజ్జత్‌ తక్కువ పనే అయినా.. అందరు తోడు దొంగలు కలిసి జరిగే అక్రమ వ్యాపారంలో ఎవరి వాటాలను వారు దర్జాగా పంచేసుకుంటున్నారు.

హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో నైన్‌ ఎడ్యుకేషన్‌ అకాడమీ మూడు కోచింగ్‌ సెంటర్లను నడిపిస్తోంది. ఇంటర్‌ చదివే విద్యార్థులకు ఈ అకాడమీ ద్వారా ఐఐటీ, జేఈఈ మెయిన్స్‌ కోసం కోచింగ్‌ ఇస్తుంటుంది. ఇందుకోసం ఒక్కో విద్యార్థి నుంచి రూ.1.60 నుంచి 2.60 లక్షలు వసూలు చేస్తోంది. అయితే ఇంత వరకూ ఒకే.. కానీ, ఈ అకాడమీ కోచింగ్‌ ఇస్తున్న విద్యార్థులు ఎక్కడి వారనేదే చర్చనీయాంశంగా మారింది. అకాడమీలో విద్యానభ్యసించే విద్యార్థుల కోసం నైన్‌ ఎడ్యుకేషన్‌ అకాడమీ ఒక వ్యవస్థనే క్రియేట్‌ చేసుకుంది. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో నైన్‌ ఎడ్యుకేషన్‌ కు కొత్తపేట, నారాయణగూడ, కూకట్‌ పల్లిల్లో మొత్తం మూడు కోచింగ్‌ సెంటర్లున్నాయి.
వీటి ద్వారానే నైన్‌ యాజమాన్యం అక్రమంగా ప్రతీఏటా కోట్లాది రూపాయాలను సంపాదిస్తోంది. రంగారెడ్డి జిల్లా సరూర్‌ నగర్‌ మండలం కొత్తపేట నైన్‌ ఎడ్యుకేషన్‌ అకాడమీకి అదే ప్రాంతంలోని శివానుజ జూనియర్‌ కళాశాల (58486) నుంచి విద్యార్థులు ఫార్వార్డ్‌ అవుతున్నారు. వీరంతా వాస్తవానికి శివానుజ ఇంటర్‌ కళాశాలలో అడ్మిషన్లు తీసుకున్నప్పటికీ.. ఎలాంటి కాలేజ్‌ అనుమతులు లేని నైన్‌ అకాడమీలో కోచింగ్‌ తీసుకుంటుండడం గమనార్హం. అంటే ప్రతీ ఏటా విద్యార్థులు కొత్తపేటలోని శివానుజ ఇంటర్‌ కళాశాలలో అడ్మిషన్లు పొంది.. అక్రమంగా నైన్‌ అకాడమీలో ఐఐటీ, జేఈఈ మెయిన్స్‌ కోసం కోచింగ్‌ తీసుకుంటున్నారన్న మాట. ఇది పూర్తిగా చట్ట విరుద్ధం.

- Advertisement -


అలాగే హైదరాబాద్‌ జిల్లా నారాయణగూడలోని శ్రీ ఆకాష్‌ జూనియర్‌ కళాశాల (61212) నుంచి కూడా నల్లకుంటలోని నైన్‌ ఎడ్యుకేషన్‌ అకాడమీకి అడ్మిషన్లు ఫార్వార్డ్‌ చేయబడుతున్నాయి. ఈ రెండు కోచింగ్‌ సెంటర్లలో కలిపి ప్రతీఏటా పై రెండు కళాశాలల నుంచి కలిపి రెండు వందల మంది విద్యార్థుల చొప్పున ఫార్వార్డ్‌ చేయబడుతున్నారు. అయితే నిబంధనల ప్రకారం వీరు అడ్మిషన్లు సంబంధిత కాలేజేస్‌ లోనే ఉంటాయి. కానీ, వీరు ఇంటర్‌ బోర్డు నుంచి ఎలాంటి అనుమతులు లేని నైన్‌ అకాడమీలో లక్షలు ధారపోసి చదువుకుంటున్నారన్న మాట. ఒక్కో స్టూడెంట్‌ కు తక్కువలో తక్కువ రూ.1.60 లక్షల నుంచి రూ.2.60 లక్షల వరకూ నైన్‌ ఎడ్యుకేషన్‌ సోసైటీ వసూలు చేస్తోంది. అంటే ప్రతీఏటా నైన్‌ యాజమాన్యానికి అక్రమ పద్ధతుల్లో రూ.కోట్లల్లో ఆదాయం సమకూరుతోంది.

పట్టించుకోని జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారులు
వాస్తవానికి తెలంగాణ ఎడ్యుకేషన్‌ యాక్ట్‌ ప్రకారం అకాడమీలో కేవలం కోచింగ్‌ మాత్రమే నిర్వహించుకోవాలి. అంతేకాక అకాడమీ అనే దానికి ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి క్లియరెన్స్‌ లేదు. కానీ, ఇక్కడ ఇతర కళాశాలల్లో అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులకు అక్రమంగా నైన్‌ ఎడ్యుకేషన్‌ అకాడమీలో తప్పుడు మార్గాల్లో కోచింగ్‌ ఇస్తున్నప్పటికీ.. రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లా అధికారులు పట్టించుకోకపోవడం గమ్మత్తుగా ఉంది. నిజానికి ఏదైనా ఇంటర్‌ కాలేజ్‌ యాజమాన్యం అక్రమంగా అకాడమీలాంటి వ్యవహారాలు నడిపిస్తే.. అంటే ఐఐటీ, జేఈఈ మెయిన్స్‌ వంటి పనులను కొనసాగించినా.. విద్యార్థులకు ఇతర ప్రాంతాల్లో క్లాసులు.. కోచింగ్‌ వంటి కార్యక్రమాలు చేసినా.. బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ రూల్‌ 14(14) ప్రకారం ఆ కళాశాల గుర్తింపును రద్దు చేయడంతో పాటు రూ.10 లక్షల జరిమానాను బోర్డ్‌ విధిస్తుంది. అయితే శివానుజ జూనియర్‌ కళాశాల (58486), శ్రీ ఆకాష్‌ జూనియర్‌ కళాశాల (61212)లు ఆన్‌ అథరైజ్డ్‌ వ్యవహారాలకు పాల్పడుతున్న ఆయా జిల్లాల ఇంటర్మీడియట్‌ విద్యాధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.

జీఎస్టీని ఎగ్గొడుతున్న అకాడమీలపై కఠిన చర్యలు తీసుకోవాలి : సీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మాసారం ప్రేమ్‌ కుమార్‌
హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలో జీఎస్టీని ఎగ్గొడుతున్న ప్రయివేట్‌ అకాడమీలపై కఠిన చర్యలు తీసుకోవాలని సీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మాసారం ప్రేమ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఆయా జూనియర్‌ కళాశాలాలు, నైన్‌ ఎడ్యుకేషన్‌ అకాడమీ చేసేదే దొంగ పనంటే.. విద్యార్థుల ద్వారా వచ్చిన ఆదాయం నుంచి నైన్‌ అకాడమీ ప్రభుత్వానికి కట్టాల్సిన జీఎస్టీని కూడా ఎగ్గొడుతున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి పెద్ద ఎత్తున గండి పడుతోంది. అలాగే ప్రైవేట్‌ కళాశాలలకు ఉండాల్సిన గ్రౌండ్‌, లైబ్రరీ, ఫైర్‌ సెఫ్టీ వంటి క్లియరెన్స్‌ లు కూడా నైన్‌ అకాడమీకి లేకపోవడం చిత్రంగా ఉంది. అందువల్ల ఇప్పటికైనా రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లో నైన్‌ ఎడ్యుకేషన్‌ అకాడమీ, శివానుజ, శ్రీ ఆకాష్‌ కళాశాలలు అక్రమ పద్ధతుల్లో సాగిస్తున్న దందాపై ఇంటర్‌ బోర్డు అధికారులు నజర్‌ పెడితే విద్యార్థులకు, ప్రభుత్వానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇప్పటికైనా ఇంటర్మీడియేట్‌ ఎడ్యుకేషన్‌ కమీషనర్‌ అకాడమీ ల యాజమాన్య దోపిడీకి పరోక్షంగా సహకరిస్తున్న జిల్లాల ఇంటర్మీడియేట్‌ విద్యాశాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు