చెన్నై : వారిద్దరిది ప్రేమ వివాహం. 15 ఏండ్ల వయసు ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నారు. కానీ భర్తకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని తెలిసి, భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో అతను జైలు పాలయ్యాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్లీ ఒక్కటయ్యారు. కానీ అతను ఇతర మహిళలతో సన్నిహితంగా ఉంటున్నాడు. దీనిపై భర్తను ప్రశ్నించినందుకు ఆమెను గొంతు నులిమి చంపాడు. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన ఫౌసియా(20) చెన్నైలోని క్రోమ్‌పేట్‌లో ఉన్న నర్సింగ్ కాలేజీలో సెకండియర్ చదువుతోంది. న్యూ కాలనీలోని ఓ ప్రయివేటు హాస్టల్‌లో ఉంటుంది. కేరళలోని కొల్లాంకు చెందిన ఆషిక్(20) గత కొన్నేండ్ల నుంచి ఫౌసియాను ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో ఐదేండ్ల క్రితం వివాహం చేసుకున్నారు. మూడేండ్ల వరకు కలిసిమెలిసి ఉన్నారు. అయితే ఆషిక్ ఇతర అమ్మాయిలతో సన్నిహితంగా ఉంటున్నట్లు ఫౌసియా గ్రహించింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, జైలుకు తరలించారు. గత కొంతకాలం క్రితం ఆషిక్ జైలు నుంచి విడుదలయ్యాడు. ఫౌసియాను క్షమాపణలు కోరాడు. మళ్లీ పొరపాటు జరగనివ్వని ప్రాధేయపడ్డాడు. దీంతో ఇద్దరు అప్పుడప్పుడు కలుసుకునేవారు. ఇక మూడో రోజుల క్రితం క్రోమ్‌పేట్‌లోని ఓ హోటల్‌లో దిగారు. అతని ఫోన్‌ను పరిశీలించగా, ఇతర అమ్మాయిలతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు కనిపించాయి. ఆ ఫోటోలపై నిలదీయగా, ఆవేశంలో ఫౌసియా గొంతు నులిమి చంపాడు. ఆమె డెడ్‌బాడీ ఫోటోలను వాట్సాప్ స్టాటస్‌గా పెట్టుకున్నాడు. దీంతో ఫౌసియా, ఆషిక్ ఫ్రెండ్స్ కలిసి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ద్వారా కేసు దర్యాప్తు చేశారు. క్రోమ్‌పేట్‌లోని హోటల్‌లో ఫౌసియా డెడ్‌బాడీ గుర్తించారు. ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం క్రోమ్‌పేట్ గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఫౌసియా, ఆషిక్‌కు ఒక పాప ఉందని, ఆమెను చిక్‌మగళూరులో దత్తత ఇచ్చారని పోలీసుల దర్యాప్తులో తేలింది.