Tuesday, May 21, 2024

దుబాయ్‌లో ఉద్యోగం వదలి వ్యవసాయం చేస్తూ..

తప్పక చదవండి
  • సిఎం కృషికి ఇంతకంటే నిదర్శనం ఏమిటి?

సిరిసిల్ల : సిరిసిల్ల నియోజకవర్గం చిప్పలపల్లికి చెందిన వీరవేని శ్రీకాంత్‌కు పదెకరాల భూమి ఉన్నది. ఎన్ని బోర్లు వేసినా ఫలితం శూన్యం. మరోవైపు కరెంట్‌ కోతలు, కరువు కోరలు వెరసి గల్ఫ్‌కు రెక్కలు కట్టాయి. నూనుగు విూసాల ప్రాయంలోనే బతుకు దెరువు లెంకుకొంటూ చిప్పలపల్లి టు దుబాయ్‌కి ఖండాలు దాటాడు శ్రీకాంత్‌. ఎడారి దేశంలో 2005 నుంచి 2011 వరకు డ్రైవింగ్‌లో కుదిరాడు. ఆరేండ్లకు తిరిగి ఊరొచ్చినా సాగు అనుకూలత కానరాక వచ్చిన తొవ్వలోనే తిరిగి వెళ్లాడు. మరో ఐదేండ్లు అక్కడే డ్రైవర్‌గా చేశాడు. మామూలుగా అయితే విదేశాలకు వెళ్లిన వాళ్లెవరైనా నాలుగు రాళ్లు పోగేసుకొని ఇల్లు చేరుతారు. పాపం శ్రీకాంత్‌ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పైసాపైసా కూడబెట్టిన రెకల కష్టం రూ.18 లక్షలు అకడ ఆర్థిక లావాదేవీల్లో మోసపోయి కోల్పోయాడు. అతడు 2016లో తిరిగి మాతృభూమికి వచ్చేసరికి తెలంగాణలో పరాయి పాలన అంతమైంది. సీఎం కేసీఆర్‌ సర్కారు ఎవుసానికి పెద్ద ఎత్తున మద్దతుగా నిలుస్తున్న తొలి రోజులు కావడం, గల్ఫ్‌లో ఉన్నప్పుడే పండ్ల తోటల పెంపకం గురించి దోస్తులతో చర్చించడం, ముఖ్యంగా డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు ఆసక్తి రేపడం శ్రీకాంత్‌ జీవితాన్ని మలుపు తిప్పింది. చిప్పలపల్లికి ఉత్తచేతులతో చేరిన కొద్దికాలానికే కేసీఆర్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు, ఉచిత విద్యుత్‌ వంటి రైతాంగ పథకాలు భవిష్యత్తుపై ఆశలు పెంచాయి. ఉపాధి జీవితాన్ని కొత్తగా జీరో నుంచి మొదలుపెట్టాడు. రైతుబంధు సొమ్మును ఒడుపుగా కాపాడుకొని సేద్యానికి పెట్టుబడిగా వినియోగించుకుని అద్భుతమైన పథకానికి సార్థకత చేకూర్చాడు. మరోవైపు మల్లన్నసాగర్‌ నీటితో చుట్టుముట్టు చెరువులు, కుంటలను నడినెత్తి ఎండల్లోనూ నింపడంతో భూగర్భజలాలు ఊపిరి అందుకున్నాయి. ఊహించని రీతిలో పడావు పడిన బోరు బావిలో నీరు ఉబికి రావడంతో యువ రైతు కుటుంబం ఆనందంతో ఉబ్బి తబ్బిబయ్యింది.

గంభీరావుపేట అంగడిలో డ్రాగన్‌ ఫ్రూట్‌ విక్రయిస్తున్న రైతు శ్రీకాంత్‌ తండ్రి బాలయ్య
ఈ క్రమంలో దుబాయిలో బీజం పడిన డ్రాగన్‌ ఫ్రూట్‌ను అర బిగడు (అర ఎకరం) పరిమిత విస్తీర్ణంలో గత ఫిబ్రవరిలో పంట వేశారు తండ్రీకొడుకులు బాలయ్య, శ్రీకాంత్‌. ఏపీ నుంచి 3 వేల తైవాన్‌ పింక్‌ రకం తెచ్చి నాటి పంటసాగులో జాగ్రత్తలు తీసుకున్నారు. పకడ్బందీ డ్రిప్‌ సిస్టం ఏర్పాటు చేశారు. ఇప్పుడిప్పుడే డ్రాగన్‌ ఫ్రూట్‌ పంట చేతికొస్తున్నది. ఒక్కసారి పెట్టుబడి రూ.4 లక్షలు పెడితే ఇప్పుడు రూ. వేలల్లో ఆదాయం షురువైంది. మరోవైపు ఎకరం బావులో ‘తెలంగాణ యాపిల్‌’గా పిలుచుకునే గంగరేనిపండు తోట ఎదుగు దశలో ఉన్నది. సిరిసిల్ల నియోజకవర్గంలోని అంగళ్లలో తండ్రీ కొడుకులు బాలయ్య, శ్రీకాంత్‌లు డ్రాగన్‌ ఫ్రూట్‌ను అమ్ముతుండడం తోటి రైతులను విశేషంగా ఆకర్షిస్తున్నది. ఊరి రైతులు, ఇరుగు పొరుగు గ్రామాల కర్షకులు పంట సంగతులను శ్రీకాంత్‌ను అడిగి తెలుసుకుంటున్నారు. సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు వ్యవసాయరంగానికి వెన్నెముకగా నిలుస్తుందనడానికి శ్రీకాంత్‌ సూపర్‌ విజయం ఒక నిదర్శనమని సిరిసిల్ల ప్రాంత రైతు నాయకుడు గాడిచెర్ల దేవయ్య అన్నారు. తండ్రీకొడుకుల సేద్యానికి రైతుబంధు, ఉచిత కరెంటు, భూగర్భ జలాలు వంటి బీఆర్‌ఎస్‌ సరారు ప్రయత్నాలు ఊతమయ్యాయని పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు