Saturday, May 11, 2024

జగన్‌ అహంకారంతో విర్రవీగుతున్నాడు

తప్పక చదవండి
  • కెసిఆర్‌ లాగే జగన్‌కుకూడా పరాభవం తప్పదు
  • తెలంగాణ ఫళితాలపై పెదవి విప్పిన చంద్రబాబు
  • తుపాన్‌ ప్రభావిత ప్రాంతంలో పర్యటన

గుంటూరు : ఏపీలో జగన్‌ ప్రభుత్వం అహంకారంతో ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నికల ఫలితాలపై తొలిసారి స్పందించారు. అహంకారంతో ఉంటే ఏమవుతుందో తెలంగాణలో చూశామని, మరో 3 నెలల్లో ఏపీలో కూడా చూస్తామని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం మిగ్‌ జాం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. నందివెలుగులో దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. పొలాల్లోకి దిగి స్వయంగా నీట మునిగిన పంటను పరిశీలించారు. చంద్రబాబు శుక్రవారం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా తెనాలి, వేమూరు, బాపట్ల నియోజకవర్గాల్లో ఆయన పర్యటన సాగుతోంది. ఈ సందర్భంగా తెనాలి వెళ్తూ మార్గమధ్యంలో రేవేంద్రపాడు వద్ద రైతులతో మాట్లాడారు. ’మిగ్‌ జాం’ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయామని, ప్రభుత్వం ఇంత వరకూ పంట నష్టం అంచనాకు రాలేదని బాధిత రైతులు ఆయన ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. రైతులతో మాట్లాడిన అనంతరం ఆయన నందివెలుగు వద్ద దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. తుపాను సాయం విషయంలో సీఎం జగన్‌ హడావుడి తప్ప ఏం లేదని చంద్రబాబు విమర్శించారు. తాను పర్యటనకు వెళ్తున్నానని తెలిసి, సీఎం హడావుడిగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతుల కష్టాలను దగ్గరుండి తెలుసుకోవాల్సిన మంత్రులు ఎక్కడ అని ప్రశ్నించారు. ’ప్రజల కష్టాలు ఇంకా 3 నెలలే. నేను పంట నష్ట పరిహారం పెంచుకుంటూ వెళ్తుంటే జగన్‌ తగ్గించుకుంటూ వస్తున్నారు. కనీసం పంట బీమా కూడా చెల్లించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది. రైతులు ధైర్యంగా ఉండాలి.’ అని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు రెండు రోజుల పాటు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అమృతలూరు, నగరం, కర్లపాలెం మండలాల్లో పర్యటన అనంతరం, రాత్రి బాపట్లలోనే బస చేయనున్న చంద్రబాబు శనివారం పర్చూరు, పత్తిపాడు నియోజకవర్గాల్లో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. అనంతరం అక్కడి రైతులతో నేరుగా మాట్లాడనున్నారు. స్కిల్‌ డెవలప్మెంట్‌ కేసులో అరెస్టైన చంద్రబాబుకు హైకోర్టు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన కంటికి శస్త్రచికిత్స అనంతరం వారం రోజులు విశ్రాంతి తీసుకున్నారు. తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల, బెజవాడ దుర్గమ్మ ఆలయం పుణ్యక్షేత్రాలను సందర్శించారు. దాదాపు 2 నెలల అనంతరం పూర్తి స్థాయి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ మేరకు పార్టీ వర్గాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. తుపాను కారణంగా బాధితులకు అందించే సాయంపై ప్రధానంగా కొన్ని డిమాండ్స్‌ ను చంద్రబాబు ప్రభుత్వం ముందుంచారు. వరి పంట నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ.30,000, ఆక్వా రైతులకు రూ.50,000, అరటికి రూ.40,000, చెరకు పంటకు రూ.30,000, పత్తి, వేరుశనగకు రూ.25,000, జొన్న, మొక్కజొన్న, అపరాలు, పొద్దు తిరుగుడుకు రూ.15 వేలు, జీడి పంటకు రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు టీడీపీ వర్గాలు వివరాలు వెల్లడించాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు