Tuesday, May 21, 2024

కొలువడిగేతే కుళ్ళబొడుస్తారా..?

తప్పక చదవండి
  • చదువురాని వ్యక్తి ఈ రాష్ట్రంలో మంత్రి కావచ్చు..
  • పీజీ పూర్తి చేసిన వ్యక్తి అటెండర్ కూడా కాలేకపోతున్నాడు..
  • మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు
    మనకే కావాలంటూ పోరాటాలు చేశాం.. లాఠీ దెబ్బలు తిన్నాం..
  • రోడ్లెక్కి ధర్నాలు చేశాం.. చదువులను, బతుకులను పాడు చేసుకున్నాం ..
  • తెలంగాణొచ్చి తొమ్మిండ్లయినా ఇంకా ధర్నాలు సేసుకుంటూ పోవాలా.. !
  • హక్కుల కోసం, అవకాశాల కోసం, ప్రభుత్వాలను చేతులెత్తి ప్రాధేయపడాలా.. !
  • ఎప్పుడు మారుతాయి మా రాతలు.. ఎప్పుడు ఆగుతాయి మా బతుల్లోని కన్నీళ్లు ..!
    ( మారని తెలంగాణ నిరుద్యోగుల తల రాతలపై ‘ఆదాబ్’ అందిస్తున్న ప్రత్యేక కథనం..)
    మన హక్కులు, మన నీళ్లు, మన నిధులు, మనవే నియామకాలంటూ నినదిస్తూ ఏర్పాటయిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయి తొమ్మిదేళ్లు కావొస్తున్నా మన హక్కులు ఇంకా అణగదొక్కబడుతూనే ఉన్నాయి.. )

    హైదరాబాద్ : మన నీళ్లు పెత్తందార్లకు, పాలకులకు ఆర్థికవనరులుగా మారిపోయాయి.. మన నిధులు అనేవి ఏమీ లేవు.. ఉన్నవన్నీ అప్పులే.. ఇక నియమాకాలంటారా రోడ్డెక్కి వెక్కి వెక్కి ఏడుస్తున్న నిరుద్యోగుల ఆర్తనాదాలు చూస్తుంటే ఇట్టే అర్థమయి పోతుంది. దాదాపు 80 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఏడాది కిందట ప్రగల్బాలు పలికి అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగాల ఎర తిరిగి తిరిగి రాష్త్ర ప్రభుత్వం మెడకే చుట్ట్టుకోనుంది. ఇప్పుడు ప్రతిపక్షాలకు ఎన్నికల నినాదంగా మారిపోయింది. నిరుద్యోగులకు ఇప్పటివరకు ప్రభుత్వం ఇచ్చిన కొలువుల సంగతేంటని ప్రభుత్వమే నోరువిప్పి చెప్పాలి.. తెలంగాణ తెచ్చుకుంటే మన ఉద్యోగాలు మనమే చేసుకోవచ్చని నిరుద్యోగులకు, వారి తల్లి దండ్రులకు లేని ఆశలను, భ్రమలను కల్పించిన పాలకులు రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యోగానికి కేవలం చదువు ఉంటే సరిపోదు స్కిల్ కూడా కావాలని చెప్పడం వినడానికి నిజంగా విడ్డూరంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, పొలిటికల్ పార్టీలకు అవసరమైన ఆర్టీసీ, ఉస్మానియా యూనివర్సిటీ, నిరుద్యోగులు, బడుగు బలహీన వర్గాలు, రాష్ట్రం ఏర్పడ్డాక ఎందుకు అక్కరకు రాకుండా పోయారో పాలకులే వివరణ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఎన్నికలు సమీస్తున్న వేళ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు వెక్కిరిస్తున్నా.. విలీనం అని ఆర్టీసీని నెత్తిన ఎత్తుకున్న ప్రభుత్వం ఆర్టీసీ భవిష్య్తతుపై తమ ఎజెండాను ఎందుకు ప్రకటించలేకపోయిందో కనీసం ఆర్టీసీ కార్మికులయినా అడగండి . నిరుద్యోగులకు ఆశలు కల్పిస్తూ.. వరుస నోటిఫికేషన్లను విడుదల చేస్తున్న టీఎస్పీఎస్సీ నిర్వహణ లోపాలతో అబాసుపాలవుతున్నా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో..? అర్ధం కావడంలేదు. రెండు నెలల కిందట వెలుగు చూసిన టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం నియామకాల ప్రక్రియను కీలక మలుపు తిప్పింది. చుదువుకోవడానికి డబ్బులు లేక, ఇంట్లో అడిగే పరిస్థితి లేక, ఆర్థిక పరిస్థితులు అనుకూలించక చేతికి దొరికిన పనిని చేసుకుంటూ.. ఒక పూట తిని మరో పూట పస్తులుండి ప్రభుత్వ ఉద్యోగం ఒక కలగా, ఆంబీషన్ గా మార్చుకుని పగలు, రాత్రి అని తేడాలు లేకుండా చదువుకుంటున్న నిరుద్యోగ యువతకు వ్యవస్థలో జరుగుతున్న లోపాలను నిరుద్యోగులకు జరుగుతున్నఅన్యాయాలను గంపెడాశ పెట్టుకున్నవాళ్ళ తల్లి దందండ్రులకు విడమర్చి అర్ధమయ్యేలా ఎలా చెప్పాలో ప్రభుత్వం సూటిగా సుత్తిలేకుండా చెప్పే దైర్యం ఉందా.. ?
    గ్రూప్-2 వాయిదా వేయాలని అభ్యర్థుల ఆందోళన :
    గ్రూప్ – 2 పరీక్షను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. గురువారం పెద్ద ఎత్తున అభ్యర్థులు తరలివచ్చారు. పరీక్షను వాయిదా వేయాల్సిందే అంటూ పెద్ద ఎత్తున నినదిస్తూ ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ – 2 ఎగ్జామ్ నిర్వహణపై తర్జన భర్జన పడుతోంది. అభ్యర్థులు విజ్ఞప్తి మేరకు రెండు లేదా మూడు నెలలు వాయిదా వేయాలా..? వద్దా…? అనే అంశంపై ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
    టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించిన నిరుద్యోగులు :
    గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని గురువారం వేలాది మంది నిరుద్యోగులు టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టించారు. టీఎస్పీఎస్సీ వద్ద ఆందోళన చేస్తున్న అభ్యర్థులకు తెలంగాణ జన సమితి, కాంగ్రెస్ నేతలు మద్దతుగా నిలిచారు. వారితో పాటు నిరసనలో ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్ తదితరులు పాల్గొన్నారు. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో టీఎస్పీఎస్సీ కార్యాలయం పక్కన ఉన్న ఖాళీ స్థలంలోకి ఆందోళనకారులను పోలీసులను పంపించారు. పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు టీఎస్పీఎస్సీ అధికారులకు వినతి పత్రం అందించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి అందుబాటులో లేకపోవటంతో అధికారులు రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పి తమను కలిసిన ప్రతినిధి బృందాన్ని పంపించి వేసినట్లు సమాచారం. మరో వైపు గ్రూప్-2 పరీక్ష వాయిదా పడిందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ స్పందించింది. పరీక్ష వాయిదాపై తాము ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదని స్పష్టం చేసింది. బంధువులు చనిపోవడంతో ఆ కార్యక్రమంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ ఉన్నారని తెలిపింది. అభ్యర్థులు అసత్య ప్రచారాలు నమ్మవద్దని కమిషన్ కోరింది.
    అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు.. పూటకో మాట, రోజుకో రాజకీయ ఆటతో క్షణ క్షణం మభ్యపెడుతున్న తీరును చూస్తూనే ఉన్నారు.. రాజకీయ ప్రయోజనాలకోసం కల్లబొల్లి మాటలు చెప్పడం.. అవసరం తీరాక అటకెక్కించడం సర్వ సాధారణమైపోయింది.. ఒకప్పుడు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినప్పుడు, ఖాతరు చేయని కేసీఆర్ ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతుండటంతో వారిని ప్రభుత్వంలో విలీనం చేశాడు.. అయితే అప్పుడు సాధ్యం కాదన్నది ఇప్పుడు ఎలా సాధ్యం అయ్యింది..? ఆర్టీసీ కి సంబంధించిన భూములను కైకర్యం చేయడానికేనని విమర్శలు వస్తున్నాయి.. దీనికి సమాధానం కేసీఆర్ చెప్పాలి.. కేసీఆర్ ఈ తొమ్మిది సంవత్సరాలలో చేసిన అభివృద్ధి ఏమిటో శ్వేతపత్రం విడుదల చేయగలడా అని మేధావులు ప్రశ్నిస్తున్నారు.. ఇచ్చిన హామీలు ఏమైపోయాయి.. కనీసం ఒక్కటైనా నెరవేరిందా..? అన్ని వర్గాలనూ అడ్డంగా మోసం చేసిన కేసీఆర్ తిరిగి అధికారంలోకి రావడానికి కనిపించిన అడ్డదారులన్నీ తొక్కుతున్నారు.. ప్రతీదీ ప్రజలు గమనిస్తున్నారని సోయి ఆయనకు లేకపోవడం శోచనీయం.. నీళ్లు పరాయి రాష్ట్రానికి కట్టబెట్టారు.. నియామకాలు అభూతకల్పనగానే మిగిలిపోయాయి.. నిధులు దిగమింగి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు.. ఇవన్నీ కాదనగలిగే శక్తి కేసీఆర్ కు ఉందా..? అని ప్రశ్నిస్తున్నారు మేధావులు.. ఇదంతా ఒకెత్తయితే ప్రతిపక్షాల పాత్రకూడా అనుమానాస్పదంగా గోచరిస్తోంది.. అన్ని ఆధారాలు కళ్ళముందు కనిపిస్తున్నా అధికార ప్రభుత్వాన్ని నిలువరించే ప్రయత్నాలు చిత్తశుద్ధితో చేయడం లేదన్నది నిర్విదాంశం.. ఒకవేళ వారికి ఇవన్నీ తెలియదు అనుకోవడానికి వీలులేదు.. తెలిసికూడా తెలియనట్లు నటిస్తున్నారని అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.. అదీకాకపోతే లోపాయికారిగా అధికార ప్రభుత్వానికి అమ్ముడుపోయారా..? అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.. వీటన్నింటికీ విపక్షాలు సమాధానం చెప్పగలరా..? తిరిగి అధికారం కైవసం చేసుకోవాలని కలలు గంటున్న బీ.ఆర్.ఎస్. ప్రభుత్వం తమ నిజాయితీని నిరూపించుకునే ధైర్యం ఉందా..? అన్నది రాజకీయ మేధావుల, విశ్లేషకుల వాదన..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు