- రెవెన్యూలోటు రూ.9,335 కోట్లు
- రాష్ట్ర రుణాలు రూ.3,14,662 కోట్లు
- శాసన సభలో కాగ్ నివేదిక..
- కాగ్ రిపోర్ట్ ను ప్రవేశ పెట్టిన మంత్రి హరీష్ రావు..
తెలంగాణ స్థితిగతులపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రూపొందించిన నివేదకను రాష్ట్ర ప్రభుత్వం శాసన సభలో ప్రవేశపెట్టింది. ఆదివారం తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నాలుగోరోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది. 2021-22 ఆర్థిక సంవత్సరం అకౌంట్స్, ఫైనాన్స్ అకౌంట్స్‌పై కాగ్ నివేదికలు ఇచ్చింది. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కాగ్ రిపోర్టును అసెంబ్లీ ప్రవేశపెట్టారు. 11 గ్రాంట్లకు రూ.75 వేల కోట్లు అధికంగా ప్రభుత్వం వ్యయం చేసిందని కాగ్ తన నివేదికలో పేర్కొంది. రాష్ట్ర ఆదాయం అంచనా రూ. 2,21,687 కోట్లు కాగా.. వచ్చిన ఆదాయం రూ. 1,74,154 కోట్లుగా తెలిపింది.
రెవెన్యూలోటు రూ.9,335 కోట్లకు పెరిగిందని కాగ్ వెల్లడించింది. పన్నుల రూపంలో వచ్చిన ఆదాయం రూ. 1,09,992 కోట్లు కాగా.. కేంద్రం నుండి వచ్చిన గ్రాంట్స్ రూ. 8, 619 కోట్లని తెలిపింది. ప్రాణాళికేతర వ్యయం రూ. 32, 979 కోట్లు.. జీతాలకు రూ.30,951 కోట్లు.. వడ్డీ చెల్లింపులు రూ.19.161 కోట్లు.. మౌలిక వసతులకు రూ.28,308 కోట్లని కాగ్ పేర్కొంది. నీటిపారుదల, వైద్యం, పంచాయతీరాజ్ శాఖలకు 34 శాతం అధికంగా ప్రభుత్వం ఖర్చు చేసిందని కాగ్ తెలిపింది. 100 రోజలపాటు రూ.22,669 కోట్ల ఓవర్ డ్రాప్ట్‌కు ప్రభుత్వం వెళ్లిందని తెలిపింది. గృహ నిర్మాణం, పరిశ్రమల శాఖల కేటాయింపు కంటే తక్కువగా ఖర్చు పెట్టిందని, 289 రోజల పాటు స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీని వినియోగించిదని, 259 రోజులపాటు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ సౌకర్యం వినియోగించిందని కాగ్ తన నివేదికలో పేర్కొంది. రెవెన్యూ రాబడుల్లో 50 శాతం వేతనాలు, వడ్డీ చెల్లింపులకే సరిపోతోందని, రాష్ట్రం అప్పు జీఎస్టీ లో 27.40 శాతమని కాగ్ నివేదికలో పేర్కొంది. 2021-22లో రాష్ట్రంలో పన్ను ఆదాయం 37 శాతం కాగా, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు 44 శాతం తగ్గాయంది. జీఎస్టీకి అనుగుణంగా పెట్టుబడి వ్యయం పెరగడం లేదని కాగ్ తన నివేదికలో పేర్కొంది. 2021-22 వరకు రాష్ట్ర రుణాలు రూ.3,14,662 కోట్లకు చేరుకుందని వెల్లడించింది.