Wednesday, April 24, 2024

ప్రజాసేవ మరచి.. కబ్జాల యావలో సుధీర్‌రెడ్డి

తప్పక చదవండి
  • దక్కన్‌ క్రానికల్‌ స్థలాన్ని టీఎన్‌ఆర్‌ సంస్థకు కట్టబెట్టిన సుధీర్‌రెడ్డి
  • హట్‌ పర్మిషన్‌తో ఎక్సైజ్‌ స్థలం స్వాహా.. దళితుల భూమి గుంజుకుని లేఅవుట్‌
  • ప్రైవేటు భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు.. ఎమ్మెల్యే కబంధ హస్తాల్లో ప్రభుత్వ స్థలాలు

ఎల్బీనగర్ : కంచే చేను మేసిన విధంగా ప్రభుత్వ భూములను కాపాడాల్సిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వాటిని కొల్లగొట్టాడని ఎల్‌బీనగర్‌ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సామ రంగారెడ్డి ఆరోపించారు. సోమవారం ఎల్‌బీనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో సామ రంగారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సిరీస్‌ భూములను ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కబ్జా చేశాడు కాబట్టే తాను విసిరిన సవాల్‌కు ఆయన స్పందించలేదన్నారు. ఒక్క సిరీస్‌ భూములనే కాకుండా నియోజకవర్గంలోని ప్రభుత్వ భూములన్నింటినీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి చెర బట్టాడన్నారు. ప్రస్తుత చిత్రా లేవుట్‌ ప్రాంతంలో 2009లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దక్కన్‌ క్రానికల్‌ పత్రికా యాజమాన్యానికి 6,375 గజాల స్థలాన్ని కేటాయించిందన్నారు. అనివార్య కారణాల వల్ల సదరు సంస్థ ఆ స్థలాన్ని వినియోగించుకోలేక పోయింది. సదరు సంస్థ ఆస్తులను బ్యాంకులు అటాచ్‌ చేసుకున్నప్పటికీ, ప్రభుత్వ భూమి అయినందువల్ల ఈ స్థలాన్ని ఆర్థిక సంస్థలు స్వాధీనపరచుకోలేదన్నారు. ఆ సమయంలో హుడా ఛైర్మన్‌గా ఉన్న సుధీర్‌రెడ్డి తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని సదరు స్థలాన్ని టీఎన్‌ఆర్‌ అనే రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు ధారాదత్తం చేశాడు. ఈ విషయంలో తనకు సంబంధం లేదని చెప్పడానికి వీల్లేదన్నారు. ఈ తతంగంలో అతని పాత్ర ఉందనడానికి పలు మీడియా సంస్థలకు సుధీర్‌రెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూలే నిదర్శనమన్నారు. సదరు స్థలాన్ని టీఎన్‌ఆర్‌ సంస్థ కొనుగోలు చేస్తే తప్పేముందని సుధీర్‌రెడ్డి వితండవాదం చేస్తున్నాడన్నారు. తాను హుడా ఛైర్మన్‌గా ఉన్న సమయంలో ప్రభుత్వ భూమిని ఓ రియల్‌ ఎస్టేట్‌కు ఎలా కట్టబెడతారో సుధీర్‌రెడ్డి నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. సుధీర్‌రెడ్డి భూ దాహానికి అంతే లేదన్నారు.

హట్‌ పర్మిషన్‌తో కబ్జా…
మన్సూరాబాద్‌ డివిజన్‌లో సర్వే నెం.51/2లో గల సుమారు రూ.100 కోట్లకు పైగా విలువ గల ఎక్సైజ్‌ శాఖ స్థలాన్ని ఎమ్మెల్యే అనుచరులు స్వాహా చేసి షోరూంలను ఏర్పాటు కొరకు జీహెచ్‌ఎంసీకి దరఖాస్తు చేసుకున్నారన్నారు. కానీ, సదరు భూమి ప్రభుత్వ స్థలమని పేర్కొంటూ ఆ దరఖాస్తును జీహెచ్‌ఎంసీ తిరస్కరించిందన్నారు. దీంతో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి స్థానిక జోనల్‌ కమిషనర్‌పై ఒత్తిడి తెచ్చి ఆ స్థలానికి హట్‌ పర్మిషన్‌ ఇప్పించాడన్నారు. దీంతో ఆ స్థలంలో షోరూం వెలసిన మాట నిజమో కాదో ఎమ్మెల్యే ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. సదరు భూమి ఇప్పటికీ ధరణి పోర్టల్‌లో నిషేధిత జాబితాలోనే ఉందన్నారు. ఈ విధంగా ప్రజాసేవను మరచిన సుధీర్‌రెడ్డి కబ్జాల యావలో ఉన్నాడన్నారు.

- Advertisement -

దళితుల భూమి గుంజుకుని లేఅవుట్‌..
హయత్‌నగర్‌ డివిజన్‌లోని అన్మగల్‌ హయత్‌నగర్‌లో సర్వే నెం.255లో గతంలో దళితులకు ఇచ్చిన అసైన్డ్‌ భూమిని ఎమ్మెల్యే ప్రోద్బలంతో ప్రభుత్వం గుంజుకుని లేఅవుట్‌లు చేస్తోందన్నారు. పేదలకు గూడు సౌకర్యం కల్పించాల్సిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన భూములను లాక్కుని రియల్‌ ఎస్టేట్‌ సంస్థగా మారిందన్నారు. ఓ వైపు నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్లు అద్దె భవనాల్లో కొనసాగుతుండగా, ప్రభుత్వ భూములను మాత్రం ఎమ్మెల్యే స్వాహా చేశాడన్నారు. హయత్‌నగర్‌ డివిజన్‌లోని ఒక పార్కులో అపార్ట్‌మెంట్‌ నిర్మాణం కొరకు దరఖాస్తు చేసుకోగా సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదయింది. పార్కులో ఇంటి నిర్మాణం కోసం చేసుకున్న దరఖాస్తుకు ఎన్‌ఓసీ ఇప్పించిన ఘనత ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిదన్నారు.

లింగోజిగూడ డివిజన్‌లో అవేర్‌ సొసైటీ ఆధ్వర్యంలోని సర్వే నెం.37 నుంచి 45లలో గల హుడా అప్రూవ్డ్‌ లేఅవుట్‌లో 2,285 గజాల పార్కు స్థలం, దాని పక్కనే ఉన్నటువంటి అక్రమ లేఅవుట్‌లోని స్థలం కబ్జాకు గురవుతోందని కాలనీవాసులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎమ్మెల్యే ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఆ స్థలాన్ని ఎమ్మెల్యే తన అనుచరునికి కట్టబెట్టాడని ఆరోపించారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సుధీర్‌రెడ్డి కబ్జాలను ఒక వెబ్‌ సిరీస్‌ తీయవచ్చన్నారు. సుధీర్‌రెడ్డి భూకబ్జాలపై తాను న్యాయస్థానాలను ఆశ్రయిస్తానన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ భూములను చెరబట్టిన సుధీర్‌రెడ్డి గనుక మళ్లీ గెలిస్తే ప్రైవేటు భూములకు కూడా రక్షణ ఉండదన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే సుధీర్‌రెడ్డి భూ కబ్జాలన్నింటిపై చర్యలు తీసుకుంటామన్నారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బీజేపీని గెలిపించి, కబ్జాకోరు, చీటర్‌ అయిన సుధీర్‌రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వనిపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎల్‌బీనగర్‌ బీజేపీ కన్వీనర్‌ కత్తొ రవీందర్‌గౌడ్‌, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి నీల ఆనంద్ కుమార్,మన్సూరాబాద్‌ డివిజన్‌ బీజేపీ అధ్యక్షులు నాంపల్లి రామేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు