Thursday, May 16, 2024

పర్యావరణ ఆరోగ్యం – మనపాలిట మహా భాగ్యం

తప్పక చదవండి

ఇటీవల కాలంలో హవాయ్‌ అడవులలో కార్చిచ్చు, లిబియాలో వరదలుకు ప్రధాన కారణం పర్యావరణ అసమతుల్యతని ఒప్పుకోకతప్పదు. జీవం ఉన్న మనుష్యులు, జంతువులు, మొక్కలతో పాటుగా, జీవం లేని గాలి, నీరు, నేల , వాతావరణాల సమాహారాన్నే పర్యావరణం అని అంటారు. మన చుట్టూ ఉండే పర్యావరణం ఎంత ఆరోగ్యంగా ఉంటే మనం శారీరకంగా , మానసికంగా అంత ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటాం. ఒక నిర్దిష్ట ప్రాంతం యొక్క రసాయన, భౌతిక, సాంస్కృతిక వాతావరణాన్ని ఆ ప్రాంతం యొక్క పర్యావరణ ఆరోగ్యం అని అంటారు. ఇది ఆ ప్రాంతం యొక్క కాలుష్య స్థాయి, జీవావరణంలో వైవిధ్యం, పరిశుభ్రమైన త్రాగునీరు అందుబాటు , పారిశుధ్యం యొక్క పరిస్థితులు, వ్యవసాయ ఉత్పాదకత మీద ఆధారపడి ఉంటుంది. మానవాళి జీవనానికి పర్యావరణానికి దగ్గర సంబంధం ఉంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పర్యావరణ ఆరోగ్యం గురించి ప్రజలకు అవగాహన కల్గించే లక్ష్యంతో ప్రతీ సంవత్సరం సెప్టెంబర్‌ 26వ తేదీన ఒక్కో సంవత్సరం ఒక్కో నినాదంతో అన్ని దేశాలు ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటాయి. అంతర్జాతీయ పర్యావరణ ఆరోగ్య సమాఖ్య ( ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఎన్విరాన్మెంటల్‌ హెల్త్‌ – ఐ.ఎఫ్‌.ఇ.హెచ్‌ ) ఆధ్వర్యంలో 2011వ సంవత్సరం నుండి ఈ దినాన్ని పాటిస్తున్నారు.’’ ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని ప్రతీ రోజు రక్షించడానికి ప్రతీ ఒక్కరూ పాటుపడాలి ‘‘ అనేది ఈ సంవత్సరం థీమ్‌. పర్యావరణ ఆరోగ్యం అనేది ప్రజారోగ్యంలోని అతిపెద్ద రంగాలలో ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ సమస్యల కారణంగా ప్రతి సంవత్సరం ఒక కోటి అరవై లక్షలకు పైగా మరణాలు సంభవించడమే గాక, 100 కంటే ఎక్కువ అనారోగ్యాలు నేరుగా పర్యావరణ ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉంటాయని మరియు కనీసం 155 దేశాలు తమ పౌరులకు జాతీయ చట్టం లేదా అంతర్జాతీయ ఒప్పందాల ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించే హక్కును కలిగి ఉన్నా కూడా భూమి , వాయు, జల మరియు రసాయనిక కాలుష్యం వంటి ‘‘పర్యావరణ ప్రమాదాల’’తో ముడిపడి ఉన్న సమస్యలతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం మరణాలలో 23 శాతం మరణాలు సంభవిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలో నివేదించింది. పర్యావరణంలో మార్పులు ప్రజల జీవనోపాధి మరియు ఆహార భద్రతకు ముప్పు తెస్తుంది. గత పది సంవత్సరాలు నుండి చూస్తే వాతావరణం వేడి పెరుగుతూ వస్తుంది. శిలాజ ఇంధనాల వాడకం పెరిగిన కారణంగా భూతాపం పెరుగుతోంది. ఈ యేడు ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 1.15 డిగ్రీల సెంటీ గ్రేడ్‌ పెరిగింది. అడవులు తగలబడడం, అకాల వరదలు , తుఫానులు సాధారణం అయిపోయాయి. పర్యావరణంలో మార్పులు సూక్ష్మజీవుల మనుగడను ప్రభావితం చేయడమే కాకుండా వైరస్‌ ల వ్యాప్తిని సులభతరం చేస్తుంది. 180 దేశాల పర్యావరణ పనితీరుకు సంబంధించి యేల్‌, కొలంబియా విశ్వ విద్యాలయాలు 40 సూచీల ప్రామాణికంగా ఆయా దేశాల యొక్క ర్యాంకులను ప్రపంచ పర్యావరణ పనితీరు సూచీ ( ఎన్విరాన్మెంటల్‌ పెర్ఫార్మెన్స్‌ ఇండెక్స్‌ – ఇ.పి.ఐ ) 2022 ను ప్రకటించాయి. ఈ నివేదికలో మొదటి ఐదు స్థానాలలో డెన్మార్క్‌ 77.90 స్కోరుతో మొదటి స్థానంలో నిలువగా యునైటెడ్‌ కింగ్‌డమ్‌, ఫిన్లాండ్‌, మాల్టా మరియు స్వీడన్‌ దేశాలు తరువాత వరుస నాలుగు స్థానాలలో నిలిచాయి. ఆయా దేశాల స్కోరులు 72.70 నుండి 77.90 మధ్యలో ఉన్నాయి. ఇండియా 18.9 స్వల్ప స్కోరుతో చిట్ట చివర స్థానాన్ని పొందింది. మన ముందు మయన్మార్‌ 179 , వియత్నాం 178 , బంగ్లాదేశ్‌ 177 పాకిస్థాన్‌ 176 వ స్థానాలలో ఉన్నాయి.
మనముందున్న సవాళ్లు:మే 2023 నాటికి వాతావరణములో కార్బన్డైఆక్సైడ్‌ 420 పార్ట్స్‌ పర్‌ మిలియన్‌ ఉంది. ఇది గ్లోబల్‌ వార్మింగ్‌కు దారి తీస్తుంది. అంటార్కిటికాలో ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెంటీగ్రేడ్‌ కంటే ఎక్కువ పెరిగాయి. ఆర్కిటిక్‌ ప్రాంతాలలో మంచు కరుగుతుంది. క్షీరదాలు, చేపలు, పక్షులు, సరీసృపాలు మరియు ఉభయచరాల సంఖ్య 1970 మరియు 2016 మధ్య సగటున 68 శాతం క్షీణించాయని ప్రపంచ వణ్యప్రాణి నిధి ( వరల్డ్‌ వైల్డ్‌ లైఫ్‌ ఫండ్‌ ) ఇటీవల ఒక నివేదికలో తెలిపింది.వీటి తగ్గుదల వలన జీవ వైవిద్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. పట్టణీకరణ, పంటలు, పశువుల పెంపకానికి , కాగితాలు తయారు చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ సంవత్సరం 1 కోటి హెక్టార్లకు పైగా చెట్లను నరకడం వలన అటవీ ప్రాంతం తగ్గుతుంది. ప్రతి గంటకు, 300 ఫుట్‌బాల్‌ మైదానాల పరిమాణంలో అడవులు నరికివేయబడుతున్నాయి. ఇది ఇలా కొనసాగితే 2030 నాటికి, ఇప్పుడున్న అడవులలో 10% మాత్రమే కలిగి ఉండవచ్చు. ఇది ఇలా కొనసాగితే రాబోయే 100 సంవత్సరాలలోపు అడవులన్నీ నాశనమయ్యే ప్రమాదం ఉంది. పర్యావరణ సమస్యలలో వాయు కాలుష్యం ఒకటి. దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 42 లక్షల నుండి 70 లక్షలు మంది మరణిస్తున్నారు. ప్రతీ 10మందిలో తొమ్మిది మంది అధిక స్థాయి కాలుష్య కారకాలను కలిగి ఉన్న గాలిని పీల్చుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. సముద్రాలు ఇప్పుడు సంవత్సరానికి సగటున 3.2 మిమీ మట్టం పెరుగుతున్నాయి. ఈ శతాబ్దం చివరి నాటికి వీటి మట్టం దాదాపు 0.7 మీటర్ల వరకు పెరిగే అవకాశం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పెరుగుదల తీరప్రాంత ముంపునకు కారణమై అక్కడ నివాసముండే 34 నుండి 48 కోట్ల ప్రజలు సురక్షితమైన ప్రాంతాలుకు వలస వెళ్ళడం జరుగుతున్నది. దీని కారణాన వీరు వెళ్ళే ప్రాంతాలలో జనాభా పెరగడమే కాకుండా, అక్కడ ఉండే వనరులు అధిక వినియోగానికి గురవుతు న్నాయి. మహాసముద్రాలు భూమి యొక్క వాతావరణంలోకి విడుదలయ్యే కార్బన్‌ డయాక్సైడ్‌లో 30 శాతాన్ని గ్రహిస్తున్నాయి. వాతావరణంలోని అధిక కార్బన్‌ డయాక్సైడ్‌ వలన సముద్ర జలాలు ఆమ్లీకరణ అవడం వలన జలచరాలకు ముప్పుతో పాటుగా 2050 నాటికి పగడపు దిబ్బలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు పరిశోధనలలో తేల్చారు. దీనివలన సముద్రాలలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యకరమైన నేలలో కనీసం 3-6% సేంద్రీయ పదార్థం ఉంటుంది. అయితే ప్రపంచంలో దాదాపు ప్రతిచోటా ఉండవలసిన దాని కంటే చాలా తక్కువగా ఈ పదార్థం ఉంది. ఇది నేల కోతకు సంకేతం. నేల కోత వలన నేల కాలుష్యం ఏర్పడుతుంది.పరిష్కారాలు: వాహనాలకు వాడే పెట్రోలులో ఇథనాల్‌ శాతం పెంచాలి. విద్యుత్‌ ఆధారిత వాహనాలను విరివిగా వాడాలి. హరిత వాయువుల విడుదలకు కారణమయ్యే పరిశ్రమలను మూసివేయాలి. పరిశ్రమలనుండి వచ్చే వాయు కాలుష్య కారకాలను తగ్గించేటట్లు చూడాలి. పరిశ్రమలపై కార్బన్‌ పన్నులు విధించాలి. రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి. పరిమితికి మించి గనులు త్రవ్వకూడదు. మొక్కలను పెంచాలి. అడవుల నిర్మూలను అడ్డుకోవాలి. కాగితం వాడకం తగ్గించి డిజిటల్‌ రంగానికి మారాలి. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్లను నిషేధించాలి. నీటి కాలుష్యాన్ని ఆపాలి. నదులు అనుసంధానం చేయడం వలన వరదలు తగ్గించవచ్చు. ఘన వ్యర్థాల నిర్వహణపై ప్రజలలో చైతన్యం కలిగించాలి. పర్యావరణ పరిరక్షణ పై విస్తృత ప్రచారం కొనసాగించాలి. మనమందరం సామాజిక బాధ్యతగా పర్యావరణాన్ని ఆరోగ్యంగా ఉంచుదాం.
జనక మోహన రావు దుంగ
యం.యస్సీ, బి.యడ్‌ అధ్యాపకుడు
ఆమదాలవలస శ్రీకాకుళం జిల్లా
ఆంధ్రప్రదేశ్‌ 8247045230

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు