Friday, May 17, 2024

పారదర్శకంగా ఇళ్ల పంపిణీ

తప్పక చదవండి
  • హైదరాబాద్‌లో 30వేల డబుల్‌ ఇళ్ల పంపిణీ
  • త్వరలోనే మరో 70వేల ఇళ్ల పంపీణీ చేస్తాం
  • ఒక్కపైసా ఖర్చు లేకుండా ఇళ్ల అప్పగింత
  • అనేక సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు
  • మళ్లీ ఆశీర్వదిస్తే మరిన్ని కార్యక్రమాలు చేస్తాం
  • దుండిగల్‌లో డబుల్‌ ఇండ్ల పంపిణీలో కేటీఆర్‌

హైదరాబాద్‌ : డబుల్‌ బెడ్రూం ఇండ్ల పంపిణీ అత్యంత పారదర్శకంగా జరుగుతున్న దని.. ఏ ఒక్కరికీ ఒక్క పైసా ఇవ్వవద్దని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అని పెద్దలు చెబుతుంటారు. సొంతంగా ఇల్లు కట్టాలన్నా.. ఇంట్లో ఆడబిడ్డ పెండ్లి చేయాలన్నా కష్టమని పాతకాలంలో ఈ సామెత చెప్పేవారు. కానీ ఇవాళ తెలంగాణలో అద్భుతమైన అనుభూతి కలుగుతోంది. ఇల్లు నేనే కట్టిస్తా.. పెళ్లి నేనే చేస్తా.. ఆడబిడ్డకు మేనమామగా సీఎం కేసీఆర్‌ అండగా ఉంటున్నారని అన్నారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని దుండిగల్‌లో రెండో విడత డబుల్‌ బెడ్రూం ఇండ్ల పంపిణీని కేటీఆర్‌ ప్రారంభించారు. లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో కట్టిన లక్ష డబుల్‌ బెడ్రూం ఇండ్లలో 30 వేల ఇండ్ల పంపిణీ ఇవాల్టితో పూర్తవుతుందని అన్నారు. మిగిలిన 70 వేల డబుల్‌ బెడ్రూం ఇండ్లను కూడా అత్యంత పారదర్శకంగా రాబోయే నెల, నెలన్నర కాలంలో పేదల చేతిలో పెడతామని తెలిపారు. దుండిగల్‌లోని 4వేల ఇండ్లు కట్టేందుకు ఒక్కో ఇంటికి రూ.10 లక్షల చొప్పున ఖర్చయ్యింది. లక్ష ఇండ్లు హైదరాబాద్‌లో కడితే 9,718 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఒక్కో డబుల్‌ బెడ్రూం ఇల్లు కట్టేందుకు ప్రభుత్వానికి అయిన ఖర్చు పది లక్షలు. కానీ లక్ష ఇండ్ల మొత్తానికి మార్కెట్‌ విలువ 50వేల నుంచి 60 వేల కోట్ల వరకు ఉన్నది.

ఆ ఆస్తులను కేసీఆర్‌ ప్రభుత్వం పేదల చేతిలో పెడుతున్నది. ఒక్క రూపాయి లంచం చెల్లించాల్సిన అవసరం లేకుండా పారదర్శకంగా ఈ ఇండ్ల కేటాయింపులు చేశామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఈ సందర్భంగా మొదటి విడత డబుల్‌ బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో జరిగిన ఆసక్తికర విషయాన్ని వివరించారు. జగద్గిరిగుట్ట డివిజన్‌ 126వ డివిజన్‌ కాంగ్రెస్‌ మహిళా అధ్యక్షురాలు కౌసల్యకు మొదటి విడతలో డబుల్‌ బెడ్రూం ఇల్లు వచ్చిందని.. అదే డివిజన్‌లోనే బీజేపీ నాయకురాలు సునీతకు కూడా మొదటి విడతలోనే ఇల్లు వచ్చిందని తెలిపారు. ఇవాళ దాదాపు 13,300 డబుల్‌ బెడ్రూం ఇండ్లు పంపిణీ చేస్తున్నాం. ఇవాల్టితో హైదరాబాద్‌లో కట్టిన లక్ష ఇండ్లలో 30వేల ఇండ్ల పంపిణీ ఇవాళ పూర్తవుతుంది. మిగతావి కూడా రాబోయే నెల, నెలన్నర కాలంలో ఇదే పద్ధతిలో.. ఇంతే పారదర్శకంగా మీ చేతులో పెడతాం. ’ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. డబుల్‌ బెడ్రూం ఇండ్ల కోసం ఏ ఒక్కరికీ ఒక్క పైసా ఇవ్వకండి అని ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు. కేసీఆర్‌ ఆలోచన మేరకు ఈ ఒక్క రోజు 8 ప్రాంతాల్లో పంపిణీ చేసిన 13300 ఇండ్లలో దివ్యాంగులకు 470, దళితులకు 1,923.. గిరిజనులకు 655, మిగిలినవారికి 8652 పంపిణీ చేశామని తెలిపారు. ఇవాళ వచ్చేటప్పుడు పేపర్‌లో ఒక వార్త చూసిన. అర్హులేమో పెద్ద సంఖ్యలో ఉన్నరు. ఇస్తున్నవి సరిపోతలేవని అంటున్నరు. మీ అందర్నీ ఒక్కటే ఆలోచించమని చెబుతున్న. ఈ ప్రభుత్వం వచ్చి తొమ్మిదేండ్లు అయ్యింది. ఈ ప్రభుత్వం వచ్చినంక నీళ్ల వసతి బాగు చేసుకున్నం. రోడ్లు బాగు చేసుకున్నం. కరెంటు బాగు చేసుకున్నం. శాంతిభద్రతలను పటిష్టం చేసుకుని.. పెట్టుబడులను ఆకర్షిస్తూ దేశంలో నంబర్‌వన్‌ స్థానానికి వచ్చినం. పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనలో నంబర్‌వన్‌ స్థానంలో ఉన్నాం. హైదరాబాద్‌ నగరం శరవేగంగా విస్తరిస్తున్నం. కొత్త లింక్‌ రోడ్లు వేసుకుంటున్నం.. బ్రహ్మాండమైన నాలాలు ఏర్పాటు చేసుకుంటున్నం. ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటున్నం. లక్ష డబుల్‌ బెడ్రూంల కోసం దాదాపు 9,718 కోట్లు ఖర్చు పెట్టినం. మా మీద విమర్శలు చేసే నాయకులను అడుగుతున్న. భారతదేశంలో ఇంకో 27 రాష్ట్రాలు ఉన్నాయి కదా ఎక్కడైనా ఒక్క రాష్ట్రంలో ఇంత అద్భుతమైన డబుల్‌ బెడ్రూం ఇండ్లు చూపిస్తారా అని మంత్రి కేటీఆర్‌ సవాలు విసిరారు. ఎక్కడైనా 560 చదరపు అడుగుల్లో రెండు పడక గదులు, రెండు బాత్‌రూంలు, ఒక హాలు, ఒక కిచెన్‌తో కూడిన డబుల్‌ బెడ్రూం ఇండ్లు ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్‌ కానీ, బీజేపీలో కానీ ఎక్కడైనా ఉన్నదా? అని ప్రశ్నించారు. భారతదేశంలో ఏ నగరంలో కూడా ఇంత పెద్ద ఎత్తున బస్తీల రూపురేఖలు మార్చిన దాఖలాలు లేవన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మన జీవన ప్రమాణాలు బాగుపడుతున్నాయని.. కేసీఆర్‌ నాయకత్వంలోనే పేదలకు న్యాయం జరుగుతుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. అర్హులైన వారందరికీ ఇండ్లు ఇచ్చే బాధ్యత మాదేనని తెలిపారు. తప్పకుండా భవిష్యత్తులో వారందరికీ ఇచ్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఒకేసారి అందరికీ ఇవ్వాలని మాకు కూడా ఉన్నది. కానీ ఇన్ని కార్యక్రమాలు, మధ్యలో రెండేండ్లు కరోనాలాంటి సంక్షోభం. దానివల్ల ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతిన్నది. అయినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులకు రెండుసార్లు రుణమాఫీ చేసుకున్నం. రైతుబంధు కింద 73వేల కోట్లు రైతుల ఖాతాలో వేస్తున్నాం. దళితబంధు వంటి విప్లవాత్మక పథకం తెచ్చి దళితోద్ధరణలో భారతదేశానికే ఆదర్శంగా నిలిచాం. పారిశ్రామికీకరణ, కొత్త పరిశ్రమలు ఆకర్షించడంలోనూ ముందున్నాం. దుండిగల్‌కు కూడా కొత్త పరిశ్రమను తీసుకురాబోతున్నాం. ఈ ప్రాంతం రూపురేఖలు తప్పకుండా మారుస్తాం. అని మంత్రి కేటీఆర్‌ చెప్పారు.వాళ నగర వ్యాప్తంగా 9 ప్రాంతాల్లో మేయర్‌ ఆధ్వర్యంలో మంత్రులు రెండో విడతగా 13,300 ఇళ్లను పంపిణీ చేస్తున్నారని కేటీఆర్‌ పేర్కొన్నారు.ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గానికి 500, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నియోజకవర్గానికి 300, సనత్‌నగర్‌ నియోజకవర్గానికి 500, కూకట్‌పల్లి నియోజకవర్గానికి చెందిన 500 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. దుండిగల్‌కు త్వరలోనే కొత్త పరిశ్రమ రాబోతోందని కేటీఆర్‌ తెలిపారు. పనిచేసే ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు