- ఎవడైనా ప్రభుత్వాన్ని పడగొడతామంటే చీరి చింతకు కడతాం
- పడగొడతామన్న వారిని పండబెట్టి తొక్కుతాం
- పడగొడతామన్న వారి పళ్లు రాలగొడతాం
- అలాంటి వాళ్లను ఊళ్లో యేపచెట్టుకు కట్టి కోదండం ఎక్కిస్తాం
- అలాంటి ఆలోచన వచ్చినోళ్లను ఊర్ల నుంచి తరిమి కొట్టాలి
- ఇంద్రవెల్లి సభ వేదికగా బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ నిప్పులు
- ఇచ్చిన హామీల మేరకు అమలుకు కట్టుబడి ఉన్నాం
- త్వరలోనే 500 కే గ్యాస్.. ప్రియాంక చేతుల మీదుగా ప్రారంభం
- పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌నే గెలిపించాలని పిలుపు
ఇంద్రవెల్లి : తమ ప్రభుత్వం రెండుమూడు నెలల్లో కూలిపోతుందని.. పగడొడతామ న్నోళ్లను యాపచెట్టుకు కట్టి ఏలాడదీస్తామని, ప్రభుత్వాన్ని పడగొడతామన్న వారిపై సిఎం రేవంత్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పండబెట్టి తొక్కుతామని ఇంద్రవెల్లి తెలంగాణ పునర్నిర్మాణ సభలో హెచ్చరించారు. ఆరు నెలలే ప్రభుత్వం ఉంటుందంటున్న బీఆర్‌ఎస్ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. మూడు నెలలకో, ఆరు నెలలకో కేసీఆర్ సీఎం అవుతారని ఎవడైనా అంటే పళ్లు రాలగోడతామని హెచ్చరించారు. ఆ ఇంటి మీద పిట్టే ఈ ఇంటి మీద వాలితే కాల్చి పడేస్తామని బీఆర్‌ఎస్ జంపింగ్ జిలానీలను ఉద్దేశించి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇంద్రవెల్లి సభలో బీఆర్‌ఎస్ పార్టీపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. మూడు, ఆరు నెలల్లో ప్రభుత్వం పడిపోతుందంటూ ప్రచారం చేస్తున్నారని.. అలాంటి వాళ్లను ఊర్లలో వేప చెట్టుకు కట్టి కోదండం వేసి కొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఆలోచన వచ్చినోళ్లను గ్రామాల్లో తరిమి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం.. ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం అని.. ప్రభుత్వాన్ని పడగొడతాం అంటూ ఎవరైనా మాట్లాడితే పళ్లు రాలకొట్టండని పిలుపునిచ్చారు. తెలంగాణలో త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో సత్తా చాటి.. ప్రజలు తమవైపే ఉన్నారని చాటుకోవడానికి బీఆర్‌ఎస్ భగీరథ ప్రయత్నాలు చేస్తోంది. ఇక కాంగ్రెస్ మాత్రం.. ’అసెంబ్లీ మాదే.. పార్లమెంట్ కూడా మాదే..’ అని నిరూపించుకోవడానికి వ్యూహ రచన చేస్తోంది. ఇందులో భాగంగా.. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి నుంచి కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల శంఖారావం మోగించింది. పార్లమెంట్ నియోజకవర్గాల పర్యటనలో తొలి సభ ఇంద్రవెల్లి నుంచే రేవంత్ ప్రారంభించారు. పోరుగడ్డ ఆదిలాబాద్ నుంచి ప్రచార హోరు మొదలు పెట్టారు. ఇంద్రవెల్లి నుంచే పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని సిఎం రేవంత్ పూరించారు. ఈ సభావేదికగా.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు ప్రకటనలు చేసారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ ..మూడు నెలల్లో భారాస అధినేత కేసీఆర్ సీఎం అవుతారని కొందరు అంటున్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే దమ్ము ఎవరికీ లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అన్ని వర్గాలను నట్టేట ముంచిన కేసీఆర్‌కు ముఖ్యమంత్రి పదవి కాదు కదా.. మంత్రి పదవి కూడా రాదన్నారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. శుక్రవారం ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేసిన ’తెలంగాణ పునర్నిర్మాణ సభ’లో రేవంత్‌రెడ్డి పాల్గొని సమర శంఖం పూరించారు. ‘ఇంద్రవెల్లి మట్టికి గొప్పదనం ఉంది. ఇక్కడ వేసే ప్రతి అడుగులో పోరాట పటిమ ఉంది. చరిత్ర పుటలో పౌరుషం గురించి చర్చించాలంటే రాంజీగోండ్ గురించి ప్రస్తావించాలి. ఆయన పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకున్నాం. అమరవీరుల స్తూపం సాక్షిగా కేసీఆర్ పాలనను అంతం చేశాం. ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటాం. గూడేలకు రోడ్లు, నాగోబా ఆలయ అభివృద్ధి పనులను ప్రారంభించాం. ఆదివాసీ ప్రాంతాన్ని అభివృద్ధి వైపు నడిపించే బాధ్యత తీసుకుంటామని అన్నారు. 1981లో కాంగ్రెస్ వాళ్లే ఇంద్రవెల్లిలో అడవి బిడ్డలను పొట్టనపెట్టుకున్నారని కొందరు విమర్శించారు. ఇంద్రవెల్లి దారుణంపై నేను ఆనాడే క్షమాపణ చెప్పాం. సీమాంధ్ర పాలకుల హయాంలో ఆ తప్పు జరిగింది. అప్పుడు జరిగిన తప్పులు సరిచేసేందుకే సోనియా తెలంగాణ ఇచ్చారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణను విధ్వంస రాష్ట్రంగా మార్చారు. భారాస ప్రభుత్వం రూ.7లక్షల కోట్లు అప్పు తెచ్చింది. కేసీఆర్ కుటుంబం కోసమే రాష్ట్రం వచ్చిందా? పదేళ్లలో ఏనాడైనా ఇంద్రవెల్లి అడవిబిడ్డల గురించి ఆలోచించారా? సమస్యల పరిష్కారం కోసం ప్రజాగాయకుడు గద్దర్ ప్రగతి భవన్‌కు వెళ్తే గేటు బయట నిలబెట్టారు. కేసీఆర్‌కు గద్దర్ ఉసురు తగిలింది. కోటి ఎకరాలకు నీళ్లిస్తామని చెప్పి రూ.వేలకోట్లు దోచుకున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కాలేదు.. అప్పుడే భారాస నేతలు శాపనార్థాలు పెడుతున్నారు. కేసీఆర్ పదేళ్లలో ఏమీ చేయలేదు.. మేము 2 నెలల్లో ఎలా చేయగలం? 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత మంత్రివర్గం తీసుకుం టుందని హామీ ఇస్తున్నా. త్వరలో రూ.500 గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రియాంక గాంధీ ప్రారంభిస్తారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్నీ అమలు చేస్తాం. రాష్ట్రంలో 2లక్షల పోస్టులు భర్తీ చేసే బాధ్యత మాది. ఇప్పటికే 7వేల ఉద్యోగాలు ఇచ్చాం. తెలంగాణ ఎవరి చేతుల్లో భద్రంగా ఉంటుందో, ఎవరు అభివృద్ధి పథంలో నడిపిస్తారో ప్రజలు ఆలోచించాలి. ఈ దేశంలో ఉన్నది రెండే కూటములు.. ఒకటి ఎన్డీఏ, రెండోది ఇండియా కూటమి. భారాస ఎంపీలు గెలిస్తే మోదీ దగ్గర తాకట్టుపెట్టి కేసీఆర్ గులాంగిరి చేస్తారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే ఆదిలాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలి‘ అని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. లక్ష కోట్ల దోపిడీతో.. గాలికి కొట్టుకుపోయే కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదని.. ఇది ప్రజా ప్రభుత్వం అని.. ప్రజల కోసం పని చేస్తున్న ప్రభుత్వం అన్నారు.. ప్రభుత్వం కూలిపోతుందని భ్రమల్లో, కలలో కేసీఆర్ ఉన్నారని.. కేసీఆర్ ఖాందాన్ మొత్తం వచ్చినా.. పండబెట్టి కొడతాం అంటూ హెచ్చరించారు. కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని.. ఎవడైనా చెప్పాడంటే మూతి పళ్లు రాలకొడతాం అంటూ వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ అక్రమ సంపాదనతో.. తన ఫాంహౌస్ కు సీఎం అవుతాడేమో కానీ.. కేసీఆర్ ఈ జన్మలో ఇక ముఖ్యమంత్రి కాడని.. కనీసం మంత్రి కూడా కాడన్నారాయన. ప్రజలకు కేసీఆర్ చేసిన పాపాలకు అనుభవించాల్సిందే అని.. అన్ని వర్గాలను నిట్టనిలువునా మోసం చేసి.. మళ్లీ సిగ్గు లేకుండా పదవి కావాలని కోరుకోవటం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణలో ఎంపీలను ఢల్లీిలోని మోదీకి తాకట్టు పెట్టాడంటూ చురకలు అంటించారు. కాంగ్రెస్ పార్టీ గాలి కూడా కేసీఆర్ ను తాకదన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందంటూ బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడిన రేవంత్ రెడ్డి.. అదే స్థాయిలో రెచ్చిపోయి వార్నింగ్ ఇచ్చారు.దేశంలో రెండే రెండు కూటములు ఉంటాయని.. ఒకటి మోడీ కూటమి అని, మరొకటి ఇండియా కూటమి అని రేవంత్ వ్యాఖ్యానించారు. కానీ తమ కూటమిలోకి మాత్రం కేసీఆర్‌ను రానివ్వమని తేల్చి చెప్పారు. బీజేపీకి గానీ, బీఆర్‌ఎస్ గానీ 6 నుంచి 7 ఎంపీ సీట్లు వస్తే రాష్ట్రాన్ని మళ్లీ మోడీకి అమ్ముకుంటారని రేవంత్ జోస్యం చెప్పారు. మోదీ ఎవరి ఖాతాలోనైనా 15 లక్షలు వేశారా అని రేవంత్ ప్రశ్నించారు.గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనక్కు తగ్గలేదన్నారు. అడవి బిడ్డల ప్రాంతాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తామని చెప్పారు. ఇక్కడి నుంచే కేసీఆర్ ప్రభుత్వాన్ని దించేస్తామని సమర శంఖారావాన్ని పూరించామని చెప్పారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కొందరి చేతుల్లో బందీ అయిందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆదివాసీల బిడ్డలను ఆదుకుంటామని తెలిపారు. ఆదివాసీలను ఆదుకునేందుకు గత ప్రభుత్వం ప్రయత్నించింది లేదన్నారు. తన కుటుంబానికి ఉద్యోగాలు తప్ప అమరవీరులను, ఈ రాష్ట్ర యువతను కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పట్టించుకోలేదన్నారు.ఈ తెలంగాణ రాష్ట్రం ఎవరి చేతుల్లో భద్రంగా ఉంటుందో ఇప్పటికైనా ఆలోచించమని రేవంత్ రెడ్డి కోరారు. పదిహేను రోజుల్లో పదిహేను వేల కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు వేల స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేశామని చెప్పారు. ఆదిలాబాద్‌ను దత్తత తీసుకుని అన్ని రకాలుగా అభివృద్థి చేస్తామని తెలిపారు. హెలికాప్టర్ నుంచి చూస్తే ఎడారిలా కనిపిస్తుందన్నారు. సాగునీటి ప్రాజెక్టులు కట్టే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు.10 సంవత్సరాలుగా స్టాఫ్ నర్సు పోస్టులనే భర్తీ చేశారా. బిల్లా రంగాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. కవిత ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీని చేసినప్పుడు అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్డులో విద్యార్థులు గుర్తురాలేదా అని మండిపడ్డారు. త్వరలోనే లక్ష మంది మహిళలకు రూ. 500 కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తాం. ఇది ప్రజలకోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వం. గద్దర్ ఉసురుతగిలి పోయారు. ‘దళిత గిరిజన దండోరా సభ’ను ఇక్కడే నిర్వహించుకున్నామని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రలు భట్టి విక్రమార్క, సీతక్క, కోమటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.