- ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దానిపై రాని స్పష్టత
- రాజ్ భవన్‌కు సామాగ్రి తరలింపు
- రాజ్ భవన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు
తెలంగాణ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకు ఉండనుందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి ఎవరు? అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతను అప్పగించారు. ఈ రోజే సీఎం ప్రమాణ స్వీకారం నేపథ్యంలో రాజ్ భవన్‌కు ప్రమాణ స్వీకార సామాగ్రిని తరలిస్తున్నారు. మూడు డీసీఎంలలో టెంట్లు, సౌండ్ సిస్టమ్స్, కుర్చీలు, రెడ్ కార్పెట్లు, ఫర్నీచర్‌ను తరలించారు. రాజ్ భవన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కాగా, తెలంగాణలో కొత్త సీఎం ఎంపిక బాధ్యతను కాంగ్రెస్ అధినాయకత్వానికి అప్పగిస్తూ కాంగ్రెస్ శాసనసభా పక్షం తీర్మానం చేసింది. ఈ మేరకు నిర్ణయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అప్పగించారు. తీర్మానంపై కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చించి ఆయన తెలియచేస్తారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో జరిగిన సమావేశంలో ఈ మేరకు గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారు.ఈ సమావేశానికి గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్ అధినాయకత్వం తరఫున డీకేశివకుమార్,మాణిగం ఠాక్రే సహా ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. అందరూ చర్చించి సీఎం ఎంపిక బాధ్యతను అధినాయకత్వానికి ఇచ్చింది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లీడ్‌లోకి వచ్చినప్పటి నుంచి సీఎం అభ్యర్థిగా ఎవరు ఎంపిక అవుతారనే ఉత్కంఠ అందరిలో కనిపిస్తోంది. తెలంగాణలో నోటిఫికేషన్ రాక ముందు నుంచే చాలా మంది సీనియర్లు తాము సీఎం అభ్యర్థి అంతే తాము సీఎం అభ్యర్థి అంటూ ప్రకటనలు చేశారు. అయితే ముందు పార్టీని అధికారంలోకి తీసుకురావాలని తర్వాత అందరి సమ్మతితో సీఎంగా ఎవరు ఉండాలనే విషయం చర్చిద్దామని కాంగ్రెస్ అధినాయకత్వం చెప్పింది. దీంతో సీనియర్లంతా సైలెంట్ అయిపోయారు. విభేదాలు పక్కన పెట్టి పార్టీ విజయం కోసం కాంగ్రెస్ సీనియర్లు అంతా కష్టపడ్డారు. వారి వారి నియోజకవర్గాలతోపాటు పక్క నియోజక వర్గాల విజయం కోసం శ్రమించారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నీ తానై అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. మిగతా వాళ్లు మాత్రం తమకు కేటాయించిన ప్రాంతాలకే పరిమితమై ప్రచారం చేశారు. అందరూ ఐక్యంగాఉంటూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం పదవి కోసం చాలా మంది పోటీకి వస్తారనే సందేహం చాలా మందిలో కనిపించింది. అయితే సీఎల్పీ భేటీకి ముందు చాలా మంది సీనియర్లతో డీకే శివకుమార్‌తోపాటు ఢల్లీి నుంచి వచ్చిన సీనియర్లు తెలంగాణ కాంగ్రెస్ నేతలతో మాట్లాడారు. ఇకపోతే తెలంగాణ ఎన్నికల ఫలితాలు ముగిశాయి. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఇక తెలంగాణ సీఎం ఎవరనే ప్రశ్న మొదలైంది. కాంగ్రెస్ సీఎం అభ్యర్థిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం సీఎల్పీ సమావేశం జరుగగా.. సీఎల్పీ నేతగా ఎవరు ఉండాలని దానిపై అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. ఈ మేరకు ఏకగ్రీవంగా ఎమ్మెల్యేలు ఆమోదం తెలిపారు. ఇప్పటికే సీఎల్పీ తీర్మానం ఢల్లీికి కూడా చేరుకుంది. అయితే తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి వైపు అధిష్టానం మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ఏఐసీసీ నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. సీఎల్పీ ఎంపిక బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అప్పగించిన నేపథ్యంలో పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ , రాహుల్ గాంధీలను సంప్రదించి ఈ విషయంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సంప్రదింపుల తరువాత సీఎం అభ్యర్థిని ఖర్గే ప్రకటించనున్నారు. సాయంత్రమే సీఎంగా రేవంత్, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క ప్రమాణం స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం.