Monday, April 29, 2024

సీలింగ్ భూమి రియల్టర్లకు ధారాదత్తం..

తప్పక చదవండి
  • రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో అక్రమ రిజిస్ట్రేషన్లు..
  • కాసుల వర్షం కురిపించిన చర్లపల్లి సర్వే నెంబర్ – 70 సీలింగ్ భూమి..
  • ప్రజా ప్రతినిధుల అండదండలతో గ్రేటర్ కమ్యూనిటీగా రూపాంతం…
  • అధికారుల సమన్వయ లోపంతో మాయమైన కోట్ల విలువ చేసే సర్కార్ భూమి..

తెలంగాణ రాష్ట్రం అనగానే అభివృద్ధిలో అగ్రభాగాన ఉంటూ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది అని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నప్పటికీ.. వాస్తవంలో మాత్రం పరిస్థితులు దీనికి భిన్నంగా కనిపిస్తున్నాయి.. తెలంగాణ రాష్ట్రం అనగానే, కబ్జాలు, అవినీతి, దురాక్రమణలే కనిపిస్తున్నాయి.. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, చివరికి ప్రైవేట్ భూములు సైతం రాజకీయ ముష్కరుల చేతిలో చిక్కుకుని మాయం అవుతున్నాయి.. దీనికి అధికారులు కూడా సహకరిస్తుండటంతో.. ప్రభుత్వ భూముల్లో, సార్ ప్లస్ భూముల్లో సైతం అక్రమ వెంచర్లు వెలుస్తున్నాయి.. నానా కష్టాలుపడి, చెమటోడ్చి దాచుకున్న డబ్బులతో ఈ వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేస్తున్న అమాయకులు మాత్రం చివరికి రోడ్లపాలు అవ్వాల్సి వస్తుంది.. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా, కాప్రా మండలంలో ఇలాంటి పరిస్థితులే దర్శనం ఇస్తున్నాయి.. కంచే చేను మేసే చందంగా సీలింగ్ భూములను కాపాడవలసిన రెవెన్యూ అధికారులే రియాల్టర్ల కాసుల కక్కుర్తికి దాసోహం అయిపోయారు. ప్రజా ప్రతినిధి అండదండలతో రెవెన్యూ అధికారుల అవినీతి ధన దాహానికి కోట్లాది రూపాయల విలువచేసే సీలింగ్ భూములు మాయమైపోతున్నాయి.

హైదరాబాద్ : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, కాప్రా మండల పరిధిలోని, చర్లపల్లి సర్వేనెంబర్ – 70 లో 6.19 గుంటల సర్ ప్లస్ భూమి రియల్టర్ల కబంధ హస్తాల్లోకి వెళ్లిపోయింది. సర్ ప్లస్ సీలింగ్ భూములను కాపాడవలసిన రెవెన్యూ అధికారులే మామూళ్లకు అలవాటుపడి రియల్టర్లకు అప్పనంగా అప్పజెప్పారు.

- Advertisement -

రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం :
చర్లపల్లి సర్వేనెంబర్ – 70లో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం స్పష్టంగా కన్పిస్తోంది.. 2018 లో డబుల్ బెడ్ రూమ్ ల కోసమని సర్వే నిర్వహించిన రెవెన్యూ అధికారులు రియల్ కబ్జాదారులకు లైన్ క్లియర్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

యదేచ్ఛగా అక్రమ రిజిస్ట్రేషన్లు :
చర్లపల్లి సర్వే నెంబర్ – 70 లోని 6.19 గుంటల భూమిని సర్ ప్లస్ సీలింగ్ భూమిగా నిర్ధారణ చేసినా యదేచ్చగా రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు రాత్రికి రాత్రి పూర్తి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ శాఖ రికార్డుల్లో సీలింగ్ భూమి అని నిర్ధారణ చేసినా రిజిస్ట్రేషన్లు చేయడంలో భారీగా అక్రమాలకు పాల్పడినట్లు అపవాదులున్నాయి.

ప్రజా ప్రతినిధి అండదండలతోనే అక్రమ వెంచర్ :
చర్లపల్లి సర్వేనెంబర్ – 70లో ఓ ప్రజా ప్రతినిధి చక్రం తిప్పినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ ప్రజా ప్రతినిధి అండదండలతోనే సర్ ప్లస్ సీలింగ్ భూమిని వెంచర్ భూమిగా చిత్రీకరించి కోట్లు దండుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అసలు మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా, కాప్రా మండలం, చర్లపల్లిలోని సర్వే నెంబర్ – 70 లోని 6.19 గుంటల భూమి అన్యాక్రాంతం అయిన విషయంపై, సర్ ప్లస్ భూమి ఏవిధంగా రియల్ ఎస్టేట్ దొంగల పాలైంది..? దీనివెనుక చక్రం తిప్పుతున్న రాజకీయ నాయకుడెవరు..? అతగాడికి సహకరించిన అధికారులెవ్వరు..? కోట్ల విలువచేసే సర్ ప్లస్ ల్యాండ్ ఏవిధంగా కబ్జాకు గురైంది..? ఆ ల్యాండ్ లో వెంచర్ వేయడానికి రియల్టర్ ఎలా సాహసించాడు..? అన్న విషయాలపై పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా వెలుగులోకి తీసుకుని రానుంది ‘ఆదాబ్ హైదరాబాద్’.. ‘మా అక్షరం అవినీతిపై అస్త్రం’..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు