Tuesday, April 30, 2024

‘కొడవలి’తో పొత్తు కుదిరేనా.?

తప్పక చదవండి
  • వామపక్షాలతో పొత్తు కాంగ్రెస్ కు ప్రమాదమా.!
  • తెలంగాణ రాష్ట్రమే అవసరం లేదని చట్టసభల్లో తీర్మానించిన సి.పి.ఎం పార్టీతో ఒరిగేదేముంది.?
  • మిర్యాలగూడలో ప్రజాబలం కలిగిన బి.ఎల్.ఆర్ ను కాదని సి.పి.ఎంకు కేటాయిస్తే సీటు గోవిందా!
  • సి.పి.ఐ ఆశించే స్థానాల్లో మునుగోడు మినహా అన్నింటా కష్టమే..
  • తమ్మినేని, కూనంనేనికి ఇవ్వడం కూడా అసాధ్యమేనా..!

( పెరుమాళ్ళ నర్సింహారావు, ప్రత్యేక ప్రతినిధి )

హైదరాబాద్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కొరకు నాడు జరిగిన ఉద్యమంలో ఇక్కడ ఉన్న సి.పి.ఎం, ఎం.ఐ.ఎం ఈ రెండు పార్టీలు అధికారికంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన విషయం అందరికీ తెలిసిందే. ఇందుకు భిన్నంగా సి.పి.ఐ పార్టీ మాత్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొరకు జాతీయస్థాయిలో కూడా తమ పూర్తి మద్దతును ప్రకటించి, రాష్ట్ర సాధన ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించింది. రాష్ట్రం సిద్ధించి పది సంవత్సరాలు పూర్తి కాకుండానే గతం మర్చిపోయి సి.పి.ఎం పార్టీ పొత్తుల పేరుతో కాంగ్రెస్తో జతకట్టి తెలంగాణ అసెంబ్లీలోకి చొరబడి, తిరిగి తమ పార్టీ అస్తిత్వాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

- Advertisement -

2013లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఉన్న అన్ని పార్టీలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కొరకు తీర్మానాలు చేసి ఢిల్లీకి, శ్రీకృష్ణ కమిటీకి పంపితే నాడు నిండు శాసనసభలో ఇదే సి.పి.ఎం పార్టీ ఫ్లోర్ లీడర్ అయిన జూలకంటి రంగారెడ్డి (నాడు మిర్యాలగూడ ఎమ్మెల్యే) తమ పార్టీ చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు వ్యతిరేకమని, అందువల్ల తాము తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉమ్మడి రాష్ట్రంగానే ఉంచవలసిందిగా కోరుతూ తమ పార్టీ స్టాండ్ ను చట్టసభలో అధికారికంగా ప్రకటించిన విషయం ఈ తెలంగాణ సమాజం ఎప్పటికీ మర్చిపోదు. నాడు ఈ పార్టీతో జతకట్టి ఎం.ఐ.ఎం పార్టీ కూడా తెలంగాణకు మద్దతు ఇవ్వలేదు. ఇది చరిత్ర. ఇక సి.పి.ఐ పార్టీకి మునుగోడు ప్రాంతంలో మంచి రాజకీయ బలమున్న సంగతి తెలిసిందే. ఒకవేళ మునుగోడు టికెట్ ఈ పార్టీకి ఇస్తే గెలిచే ఛాన్స్ లేకపోలేదు. కానీ చెన్నూరు నియోజవర్గంలో మాత్రం కష్టమేనని తెలుస్తోంది.

వామపక్షాలు పొద్దుతిరుగుడు రాజకీయాలు మానుకోవాలి..!
గడచిన మునుగోడు ఉప ఎన్నికల్లో బీ.ఆర్.ఎస్ పార్టీతో అంటకాగిన ఉభయ కమ్యూనిస్టు పార్టీలను జరగబోయే ఎన్నికల్లో తమతో కలుపుకోవడంపై కాంగ్రెస్ పార్టీ ఊగిసలాటలో ఉంది. సి.పి.ఐ, సి.పి.ఎంలతో కలిసి వెళ్లడంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెజారిటీ నేతలంతా పొత్తులు వద్దనే అభిప్రాయంతో ఉండగా, పార్టీ హైకమాండ్ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచన చేస్తోంది. జాతీయస్థాయిలో ఏర్పడిన ఇండియా కూటమిలో కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు భాగస్వాములు అయినందున తెలంగాణ రాష్ట్రంలో ఈ రెండు పార్టీలతో తప్పక దోస్తీ కొనసాగించే పరిస్థితి నెలకొంది. కానీ మెజారిటీ కాంగ్రెస్ నేతలంతా కూడా గతంలో లాగా ఓట్లు బదిలీ జరిగే అవకాశం లేనందున ఒంటరి పోటీయే మంచిదన్న భావనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా వామపక్ష పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సీజన్లో ఏదో ఒక పార్టీతో జతకట్టి రాజకీయ లబ్ధి పొందడం మినహాయించి, వారు సొంతంగా పోటీలో నిలబడి ఒక్క ఎమ్మెల్యే స్థానంలో కూడా గెలవలేని పరిస్థితులు దాపురించాయి. కాబట్టి వామపక్ష పార్టీలు పొద్దుతిరుగుడు రాజకీయాలు ఇకనైనా మానుకొని స్థిరమైన రాజకీయాలు, ప్రజా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకప్పటి ప్రజాధరణ నేడు వామపక్ష నేతలకు లేదనే వాదన ప్రజల్లో బలంగా వినిపిస్తోంది.

మిర్యాలగూడలో ఓట్ల బదిలీ కష్టమే..!
మిర్యాలగూడ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లబోతు భాస్కరరావు 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి, తదుపరి పరిణామాలలో బి.ఆర్.ఎస్ పార్టీలో చేరిపోయారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అయిన బీసీ సంఘం నాయకుడు ఆర్. కృష్ణయ్య పై మరోసారి గెలిచారు. అయితే ఈసారి మాత్రం మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత బత్తుల లక్ష్మారెడ్డి పేరు మాత్రం బాగా వినపడుతోంది. గడిచిన ఐదేళ్లలో లక్ష్మారెడ్డి స్థానికంగా ఉంటూ అనేక ప్రజా పోరాటాలు, క్రింది స్థాయి ప్రజలకు ఉపయోగపడే విధంగా పలు సంక్షేమ కార్యక్రమాలు తన సొంత నిధులతో ఖర్చు చేసుకొని ప్రజల్లో నిలబడిపోయినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఏ నోట విన్న బి.ఎల్.ఆర్ అనే మాటనే మారుమోగుతుంది. ఈయనకు గాని కాంగ్రెస్ టికెట్ ఇస్తే మాత్రం గెలుపు అతి సునాయాసంగా ఉంటుందని ఇక్కడి పబ్లిక్ టాక్. ఇంత ఈజీగా ఉన్న కాంగ్రెస్ గెలుపును కాదని పుత్తులో భాగంగా సిపిఎం పార్టీ జూలకంటి రంగారెడ్డికి టికెట్ కేటాయిస్తే మాత్రం మళ్లీ బి.ఆర్. ఎస్ తరఫున భాస్కరరావు గెలిచే అవకాశం ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. గతంలో లాగా కాంగ్రెస్ ఓట్ల బదిలీ అంతా ఈజీగా సిపిఎం పార్టీ వైపు ఒరిగే అవకాశాలు ఇప్పుడు లేవని తెలుస్తోంది.

తమ్మినేని, కూనంనేనిల సంగతేంటి.?
ఉభయ కమ్యూనిస్టు పార్టీల సారధులైన తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావులు పోటీ చేయాలని భావిస్తున్న పాలేరు, కొత్తగూడెం స్థానాలపై పీఠముడి వీడేలాలేదు. సదరు ఆ రెండు సీట్లు వదులుకోవడం కాంగ్రెస్ కు సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. స్థానిక ఎమ్మెల్యేలు బి.ఆర్.ఎస్ పార్టీలోకి వెళ్లిపోయినా, ఈ రెండు చోట్ల కాంగ్రెస్ పార్టీ 2018 ఎన్నికల్లో విజయభేరీ మ్రోగించిన విషయం తెలిసిందే. ఈసారి ఎన్నికల్లో ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో కాంగ్రెస్ అత్యధిక అన్ని స్థానాలు గెలిచే విధంగా అనుకూలంగా ఉన్న తరుణంలో పొత్తుల కుంపటిలో భాగంగా ఒకటి, రెండు స్థానాలు చేజార్చుకునే ప్రమాదం నెలకొందని సీనియర్ కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. తమ ఢిల్లీ హైకమాండ్ నిర్ణయం కొరకు వేచి చూస్తున్నారు. ఏది ఏమైనా గతంలో అనేక మార్లు ఎమ్మెల్యేలుగా పదవులు అనుభవించిన తమ్మినేని, కూనంనేనిలు గౌరవంగా పక్కకు నిలబడి, కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చినట్లయితే వారికి సముచిత స్థానం ఉంటుందని రాజకీయ నిపుణుల అభిప్రాయం. మరి ఏం జరగనుందో వేచి చూద్దాం..!

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు