Saturday, April 27, 2024

డిపార్ట్ మెంట్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ విభాగంలో అవినీతి కంపు..!

తప్పక చదవండి
  • బంగారం, వజ్ర వైఢూర్యాలు, పెట్రోల్ పంపుల ప్రముఖ నాసిరకం వ్యాపారులతో దోస్తీ..
  • కోట్లకు పడగలెత్తిన తూనికలు, కొలతల శాఖ ఉద్యోగులు…
  • నిబంధనలు అతిక్రమించిన వ్యాపారులపై కేసులు పెట్టి పన్నులు వసూలు..
  • సేకరించిన సొమ్మును ప్రభుత్వ ఖజానాకు చేర్చకుండా తప్పుడు
    లెక్కలు చూపిస్తూ ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి..
  • నిబంధనలు తూచ్…అవినీతి అధికారుల కండకావరం..
  • అవినీతికి కొమ్ముకాస్తున్న వైనం… వినియోగదారులకు ఇక్కట్లు…

హైదరాబాద్ : ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తున్న డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ విభాగంలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. వినియోగదారులకు నూటికి నూరు శాతం స్వచ్ఛమైన సేవలు అందించాల్సిన శాఖలో అవినీతి కంపు కొడుతోంది. అవినీతిని పర్యవేక్షించాల్సిన అధికారులే అక్రమార్కులకు అండగా నిలవడం గమనార్హం. నిబంధనలు అందరికీ సమానంగా ఉంటాయని మనకు తెలుసు. కానీ ఇక్కడ కీలకమైన కొందరు అధికారులు పైఅధికారులను మచ్చిక చేసుకొని చట్టంలోని లొసుగులను తమకు అనుకూలంగా మార్చుకుంటూ తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు.. ఇందుకు ఉదాహరణగా సూర్యాపేట జిల్లాలో లీగల్ మెట్రాలజీ ఇన్స్ పెక్టర్…కె. వెంకటేశ్వర్లు నిబంధనలకు విరుద్ధంగా శాఖలో రద్దు చేసిన మాన్యువల్ విధానానికి వ్యతిరేకంగా ఆన్ లైన్ విధానం కాదని మ్యాన్యువల్ గా రసీదులు సృష్టించి లైసెన్స్ స్టాంపింగ్, రెన్యువల్ అంటూ నగదు కాజేసి ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న ఘటన ప్రత్యక్ష సాక్షంగా నిలుస్తోంది. ఈ విషయమై సదరు ఇన్స్పెక్టర్ పై పక్కా ఆధారాలతో సహా నివేదిక పంపిన ఉన్నత స్థాయి అధికారిని బదిలీ చేసి, వెంకటేశ్వర్లును అక్కడే కొనసాగించడం అవినీతి అధికారుల చతురతకు పరాకాష్టగా నిలుస్తోంది. తాజాగా సదరు ఇన్స్పెక్టర్ వ్యవహారంపై నివేదికలు పంపమని కోర్టు ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం. ఇంకా తూనికలు, కొలతల శాఖలో నిజాయితీగా ఉండే కింది స్థాయి ఉద్యోగులను వేధిస్తూ.. ఇంకా వినియోగదారులకు సంకటంగా మారిన ఈ వ్యవహారం ఆగమ్య గోచరం. అది ఒక ప్రధాన శాఖకు అనుబంధంగా నడుస్తున్న మరొక శాఖ. అ శాఖలో పరిపాలనా పరంగా కొందరు అధికారులు తిష్టవేసి అవినీతి తిమింగలాలుగా మారారు. ఈ అధికారులు తమ శాఖలోని తమకు అనుకూలంగా ఉండే కొందరు ఉద్యోగులపై విపరీత ఆరోపణలున్నా ఏసీబీ, విజిలెన్స్ కేసులన్నా దర్యాప్తులను ముందుకు సాగనివ్వకుండా అడ్డుపడుతూ.. తమ నేర్పరితనాన్ని ప్రదర్శిస్తున్నారని, నిజాయితీపరులైన ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.

అవినీతిపరులపై సి.ఎం. ఆదేశాలు, సంబంధిత మంత్రి ఆదేశాలను సైతం వీరు లెక్కె చేయరు. సుప్రీంకోర్ట్ ఆదేశాలు, జాతీయ బీసీ, ఎస్సీ కమీషన్లు ఆదేశాలు ధిక్కరణ ఇక్కడ అతి సర్వ సాధారణం. ఈ శాఖకు అధిపతిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని నియమించిన రాష్ట్ర ప్రభుత్వ పాలనాపరమైన విధానపరమైన, ఉద్యోగాలకు సంబంధించి అవినీతికి సంబంధించిన ఇతర క్రమ శిక్షణ ఉల్లంఘనలపై ఏమాత్రం చర్యలుండవని పలువురు కుండబద్దలు కొట్టి చెబుతున్న వైనం. ఇది ఎక్కడో కాదు, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో అత్యంత కీలకమైన సివిల్ సప్లై శాఖకు అనుబంధంగా ఉన్న లీగల్ మెట్రాలజీ విభాగంలో జరుగుతున్న పరిణామం. రాష్ట్రంలో వివిధ వస్తువులను పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి ఇంధనాలను బంగారం, వజ్ర వైడూర్యాలు, రత్నాలు ఇతర నిత్యవసర సరుకులు వినియోగదారులను మోసం చేయకుండా.. ఎప్పటికప్పుడు తూనికలు కొలతల్లో కూడా ఖచ్చితంగా ఉండే విధంగా వీరు తనిఖీలు చేయాలి. వారి పరిధిలో వినియోగదారులకు తూనికలు, కొలతలలో ఎలాంటి మోసం జరగకుండా బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలి. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వర్తిస్తూ వినియోగదారులను మోసం చేస్తున్న వ్యాపారస్తులపై కేసులు నమోదు చేయాల్సిన పరిస్థితుల్లో, బేరసారాలతో వ్యవస్థను బ్రష్టు పట్టిస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. వినియోగదారులకు అండగా నిలవాల్సిన అధికారులు, అవినీతి పరుల వ్యాపారస్తులకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారనే అప్రతిష్టను మూట కట్టుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలకు సంబంధించి సేవల విభాగంలో అత్యవసరమైంది ఈ తూనికలు, కొలతల శాఖ.. ఈ శాఖలో కొందరు అధికారులు హైదరాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో తిష్ట వేశారు. వారు తమకు లంచం ఇచ్చే ఉద్యోగులకు తమకు అనుకూలంగా ఉంటే చాలు వారికి అనుకూలంగా సెక్రటేరియట్ మొదలు శాఖాధిపతుల వరకు మేనేజ్ చేసుకుంటూ.. వారిపై ఈగ వాలన్విరని నిజాయితీపరులైన ఉద్యోగులు మన స్థాపన చెందుతున్న తీరు ఇది. డిపార్ట్మెంట్ పరీక్షలలో పాస్ కాని వారికి, పాస్ కాకున్నా ప్రమోషన్లు ఇచ్చి, తమ చెప్పు చేతలలో పెట్టుకుంటున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక వారికి వ్యతిరేకంగా ఉంటే అంతే సంగతులు.. ! శాఖలో నిజాయితీగా తమ పనులు తాము చేసుకునే ఉద్యోగులు వారికి వ్యతిరేకంగా ఉంటే వారికి ప్రమోషన్లు ఉండవు.. పోస్టింగ్ లు రావు. ఇందుకు ఉదాహరణగా ఇలా వేధింపులకు గురి చేస్తే, తట్టుకోలేక వేణుగోపాల్ అనే ఉద్యోగి చనిపోయాడని వారు చెబుతున్నారు. ఈయన కుటుంబానికి రావాల్సిన బెనిఫిట్స్ కూడా రాకుండా అడ్డుకుంటున్నారని కుటుంబీకులు ఆవేదన చెందుతున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మొదలు రాష్ట్ర రా పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ల ఆదేశాలున్నా, వారిపై శాఖాపరమైన చర్యలు ఉండవు.. పైగా ఈ అవినీతిపరులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లాల స్థాయి అధికారులు నివేదికలు పంపితే.. నివేదికలు పంపిన అధికారులే బదీలి అవుతారు అని బహిరంగంగా విమర్శలు వినిపిస్తున్నాయి. అవినీతి అధికారులకు పూర్తి స్థాయిలో రక్షణ ఉంటుందని అంటున్నారు. ఈ ప్రధాన కార్యాలయంలో తిష్ట వేసిన ఈ అధికారులు కింది స్థాయిలో తమకు వ్యతిరేకంగా, తమ సమకాలంగా పని చేసి రిటైరైన ఉద్యోగులను విపరీతంగా తిప్పలు పెడుతున్నారు. ఉద్యోగం చేసిన సమయంలో తమకు అనుకూలంగా పని చేయలేదన్న కక్షతో ఐదుగురు ఉద్యోగుల పెన్షన్, ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్లు ఆపేశారు. తమకు అనుకూలంగా పని చేయడం లేదంటూ కొందరికి ప్రమోషన్లు పూర్తిగా నిలిపేసారు. వారికి అనుకూలంగా ఉన్న వారిని మాత్రం అవినీతి కేసులన్నా, ఏసిబి కేసులన్నా, విజిలెన్స్ దర్యాప్తు నడుస్తున్న కూడా.. ఇవేవీ లెక్క చేయకుండ ప్రమోషన్లు ఇచ్చారు. జాతీయ ఎస్సీ కమీషన్ స్వయంగా విచారించి ప్రమోషన్ ఇవ్వాలని ఆదేశించింది.. కానీ వీరికి ప్రమోషన్ ఇవ్వడం ఇష్ట లేని అధికారులు కోర్ట్ కు వెళ్ళి స్టే తెచ్చారు. కానీ ప్రమోషన్లు ఇవ్వలేదు. తమకు అన్యాయం జరుగుతోందని సుప్రీం కోర్టు, జాతీయ బీసీ కమీషన్, జాతీయ ఎస్సీ కమీషన్ లను కొందరు ఉద్యోగులు అశ్రయించారు. కమీషన్ల ఆదేశాలకు సైతం వారు స్పందిచకుండా కోర్టు కెళ్ళి ‘స్టే’ లు తెచ్చుకున్నారు తప్ప అమలు చేయడం లేదు. ఐదుగురు బీసీ ఉద్యోగులు తమకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆపేశారని బీసీ కమీషన్ లో ఫిర్యాదు చేయగా.. బీసీ కమీషన్ రాసిన లేఖకు ఇప్పటి వరకు జవాబు రాయలేదు అని తెలిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా జ్యోక్యం చేసుకొని, ఈ శాఖలో జరుగుతున్న తతాంగాలపై ప్రత్యేక దర్యాప్తు చేయించాలని బాధితులు కోరుతున్నారు.

- Advertisement -

ఒక్కొ అధికారిది – ఒక్కో అవినీతి కథ.. ఎవరా అధికారులు వచ్చే సంచికలో…

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు