Wednesday, April 24, 2024

తమ్ముడి కోసం అన్న తాప‌త్రయం

తప్పక చదవండి
  • తమ్ముడిని కేసుల నుండి తప్పించడానికి ఎమ్మెల్యే మ‌హిపాల్ రెడ్డి మల్లగుల్లాలు
  • అక్రమాల సూపర్ స్టార్ గూడెం మధుసూదన్ రెడ్డి..
  • చక్రపురి కాలనీ లేఔట్ లో కూడా అక్రమాలు..
  • వందల కోట్ల విలువైన భూములను కొట్టేసిన వైనం..
  • 5035 గజాల ప్లాటును సృష్టించిన కేటుగాడు..
  • సంతోష్ గ్రానైట్స్ మైనింగ్ కంపెనీ తనదే అని చెప్పిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే
  • ఎమ్మెల్యే అరెస్ట్ ను అడ్డుకుంటున్న పెద్దమనిషి ఎవరు..?
  • అమీన్‌పూర్‌ లో భూ దందాలను ఎందుకు ఉపేక్షిస్తున్నారు..?
  • సీఎం దృష్టిసారించాలంటున్న స్థానికులు

లే అవుట్స్‌ మారిపోతాయి.. ఖాళీ భూములు మాయమైపోతాయి.. చట్టాలు సైతం తలొంచుతాయి.. అధికారులు మడుగులొత్తుతారు.. చెప్పిందే వేదం.. చేసిందే చట్టం.. కోట్ల రూపాయల అక్రమార్జన.. ఇవన్నీ సాధ్యమేనా..? అని సామాన్యుడు అనుమానం వ్యక్తం చేయవచ్చు.. నమ్మలేకపోవచ్చు.. కానీ అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసేస్తుంది అధికారం.. నిజానికి అధికారం అన్నది సామాన్యుడి బాగుకోసం వినియోగించాలి.. కానీ అధికారం అనే పదానికి అర్ధమే మార్చేశారు కొందరు రాజకీయ ముష్కరులు.. అధికారం అంటే దోచుకోవడం.. అధికారం అంటే దాచుకోవడం.. కోర్టులను తప్పుదోవ పట్టించడం.. చట్టాలను అవహేళన చేయడం.. సామాన్యులను సర్వనాశనం చేయడం.. ఇదే ట్రెండ్‌ ప్రస్తుతం నడుస్తోంది.. సమ సమాజం కన్నీరు పాలవుతోంది.. దుర్మార్గులదే రాజ్యం అవుతోంది.. ఇలాంటి కథ గత 10 సంవత్సరాలుగా అమీన్‌ పూర్‌ మున్సిపాలిటీలో అప్పటి అధికార ప్రభుత్వం సాక్షిగా చక్కర్లు కొడుతున్నా.. అక్రమార్కులు కాలర్‌ ఎగరేసుకుని తిరుగుతున్నారు.. సామాన్యుడు మాత్రం చతికిలబడి రోధిస్తూనే ఉన్నాడు.. అమీన్‌ పూర్‌ అక్రమాలకు నెలవుగా మారిన దుర్భర పరిస్థితులపై ఆదాబ్‌ హైదరాబాద్‌ ఎప్పటికప్పుడు కథనాలు ప్రచురిస్తున్నా.. న్యాయం అనే పదం అన్యాయం మాటున చేష్టలుడిగి చూస్తూనే ఉంది..
చరిత్రలో కొన్ని ప్రదేశాలు.. కొంతమంది వ్యక్తులు చోటు సంపాదించుకుంటారు.. అయితే వీరి చరిత్ర రెండు విధాలుగా ఉంటుంది.. ఒకటి నీతి, నిజాయితీలతో ముడివడి ఉంటుంది.. రెండోది అవినీతి దుప్పటి కప్పుకుని దర్శనం ఇస్తుంది.. అలాంటి చరిత్రే పఠాన్‌ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్‌ రెడ్డిలది.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు.. ఒక ప్రముఖ బీఆర్‌ఎస్‌ నాయకుడు.. మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన అతని అండతో.. ఎమ్మెల్యే గిరి నెరపిన గూడెం మహిపాల్‌ రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని మధుసూదన్‌ రెచ్చిపోయాడు.. అనేకానేక అక్రమాలకు పాల్పడ్డాడు.. ఒక్కటీ అని చెప్పలేము.. ఈయన అవినీతికి పరాకాష్టగా మారిపోయాడు.. సంతోష్‌ శాండ్‌ అండ్‌ గ్రానైట్స్‌ అనే కంపెనీ స్థాపించి అక్రమ మైనింగ్‌ చేయడం మొదలుపెట్టాడు.. ఈ కంపెనీకి సరైన అనుమతులు సైతం లేవంటే అతిశయోక్తి కాదు.. అసలు అనుమతులు ఎందుకు అని భావించాడు ఇతగాడు.. ఎందుకంటే తమ ప్రభుత్వం అధికారం లో ఉంది.. పైగా సోదరుడు ఎమ్మెల్యే.. ఇక ఒక మంత్రి అండ దండలు ఉన్నాయి.. ఇంకేముంది మనవాడు రెచ్చిపోయాడు.. అయితే 2023 లో కూడా తెలంగాణాలో తమ పార్టీ అయిన బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుందని భావించిన మధుసూదన్‌ రెడ్డి తన అక్రమాల పరంపరలో కొత్త తెర ఎత్తాడు..
ఇంత దారుణంగా ప్రభుత్వాన్ని, ప్రజలను, చట్టాలను గోల్‌ మాల్‌ చేశాడంటే మధుసూదన్‌ రెడ్డి ఇంతకు తెగించాడో అర్ధం చేసుకోవచ్చు.. నాటి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వంలో 1985 హుడా కార్యాలయం నుండి అనుమతి పొందిన లే అవుట్‌ చక్రపురి కాలనీ లే అవుట్‌.. ఈ లే అవుట్‌ లో కాసులకు కక్కుర్తి పడి పటాన్‌ చెరు ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్‌ రెడ్డి ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకొని హుడా లే అవుట్‌ లో పబ్లిక్‌ యుటిలిటీ ల్యాండ్స్‌ అంటే ఈ భూములు ప్రభుత్వ అధీనంలో ఉండాలి.. ఇలాంటి భూములకు బోగస్‌ పత్రాలను సృష్టించి, కొత్త లే అవుట్‌ మరోసారి చేసి యదేచ్ఛగా వందల కోట్ల రూపాయల విలువైన భూములను కొల్లగొట్టారు.. ఇలా ప్రజా ధనాన్ని లూటీ చేశారు..
అయితే సంతోష్‌ శాండ్‌ అండ్‌ గ్రానైట్స్‌ కంపెనీ తన కంపెనీయే అని, అది తన కుమారుడు రన్‌ చేస్తున్నాడని.. తన సోదరుడైన మధుసూదన్‌ రెడ్డి దగ్గరుండి చూసుకుంటున్నాడని పలుమార్లు ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి చెప్పడం జరిగింది.. మరి సంతోష్‌ శాండ్‌ అండ్‌ గ్రానైట్స్‌ ద్వారా ఇన్ని భూదందాలు, అక్రమ మైనింగ్‌, భూ ఆక్రమణలు, కోర్టు ధిక్కారాలు ఇలా ఎన్నెన్నో భయంకర అక్రమాలు జరుగుతుంటే దీనికి ఎమ్మెల్యే బాధ్యత వహించాలి కదా..? మారేందుకు ఆయన మీద చర్యలు తీసుకోవడానికి అధికారులు వెనుకాడుతున్నారు..? ఇప్పటికే అక్రమ మైనింగ్‌ కేసులో మధుసూదన్‌ రెడ్డి అరెస్ట్‌ అయిన సంగతి విదితమే.. గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన ఆదేశాలను పెడచెవిన పెట్టిన హెచ్‌ఎండీఏ అధికారుల మాటేమిటి..? ప్రత్యక్షంగా, పరోక్షంగా తనవంతు పాత్ర పోషించిన ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డిని ఎందుకు అరెస్ట్‌ చేయడం లేదు..? తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి.. ఈడీ, సీబీఐ, ఐటీ లాంటి సంస్థలు గూడెం బ్రదర్స్‌ అక్రమాలపై దృష్టి సారిస్తే.. కళ్ళు చెదిరే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.. వారి అక్రమ సంపాదనను రికవరీ చేయగలిగితే పఠాన్‌ చెరు నియోజకవర్గాన్ని ఊహించనంతగా అభివృద్ధి చేయవచ్చు.. నిజంగా కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గూడెం బ్రదర్స్‌ పై దృష్టి పెట్టండి.. వారి అక్రమాల చిట్టాలు ఆధారాలతో సహా ఆదాబ్‌ హైదరాబాద్‌ దగ్గర ఉన్నాయి.. వాటిని అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం.. అలా కాని యెడల న్యాయపోరాటం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నాం.. ‘‘ మా అక్షరం అవినీతిపై అస్త్రం ‘‘..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు