Sunday, June 23, 2024

ప్ర‌భుత్వ స్కూల్ యూనిఫామ్ కుడితే రూ.50

తప్పక చదవండి
 • సర్కార్ బడులంటే గింత చులకనా.!
 • పేదోడికి విద్యనందించేందుకు సవాలక్ష షరత్ లు
 • ఓ పోలిటీషియన్ అంగీ, ప్యాంట్ ఇస్త్రీ చేస్తే రూ.100లు
 • బిల్లుల చెల్లింపుల్లో కమీషన్
 • టెస్కో ద్వారా క్లాత్ లు సప్లై చేస్తున్న సర్వశిక్ష అభియాన్
 • క్లాత్ మినహా మిగతా ఖర్చు అంతా కాంట్రాక్టర్ దే
 • ఒక డ్రైస్సు కుట్టేందుకు టైలర్ కు పట్టేది కనీసం 3-4గంటలు
 • రోజులో కేవలం రెండు నుంచి మూడు జతలే పూర్తవుతాయి
 • ఉపాధి హామీ కూలికిపోతే కనీసం రూ.200లు
 • ప్రభుత్వాలు మారిన దర్జీల ఆర్థిక స్థితిగతులు మారట్లే
 • అదే కార్పోరేట్ స్కూల్లో 2 యూనిఫామ్లకు రూ.2500 నుంచి 3వేలు

‘నేను పోను తల్లో సర్కారు బడికి’ అన్న పదం నిజం చేస్తున్నారు పాలకులు. ఇన్నెండ్లు అయినా మనం మారట్లే.. రాష్ట్రం అభివృద్ధి కావ‌ట్లే.. సర్కారు సదువులు మంచిగలేవు వాటిని డెవలప్ చేయలె.. గవర్నమెంట్ దవాఖానాల్లో సౌవలత్ లు లేవు.. గ్రామాల్లో పేదలకు ఇండ్ల కట్టియట్లే.. పట్టణాలల్లా పనులు జరగట్లే ఇసొంటి ముచ్చట్లు ఎన్నికల ముందూ అందరూ చెప్పెటివె కానీ. అయిటంక ఆ గద్దె నెక్కినంక మొతెబరి ముచ్చట్లు బొచ్చడు చెప్పిన పనిమంతుల పని కూడా అంతే. ప్రభుత్వాలు మారుతున్న సర్కారు బడుల్లో విద్యావిధానాలు మారట్లేదు. పెచ్చులూడిపోయిన బిల్డింగ్ లు, విరిగిపోయిన బెంచీలు, నెర్రలుబారిన బ్లాక్ బోర్డులతో పేదోడికి విద్యనందిస్తున్న నాయకుల మాటలు ఆకాశాన్నంటుతున్నాయి. బాత్రూంలు, త్రాగునీళ్లు, తరగతి గదులలో ఫ్యాన్లు, కరెంట్ లేక పాడుపడిపోయిన గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లలు విద్యనభ్యసిస్తున్నారు. చెత్త చెదారం, పిచ్చి చెట్లు మొలిచి, అపరిశుభ్రంగా ఉన్న విద్యాలయాలు రేపటి భావిభారత పౌరుల తలరాతలు మార్చేందుకు స్వాగతం పలుకుతున్నాయి. పది, పదిహేను రోజులలో బడులు ప్రారంభం కానుండగా విద్య విధానాలలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. పేదోడి పిల్లలు చదువుకునే బడులు అభివృద్ధికి నోచుకోక శిథిలావస్థలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ విద్యా సంవత్సరం కొత్త విధానం అమలు అని చెప్పుకునే పాలకులు ఆఖరి నిమిషంలో చేతులెత్తేసి పాత పద్దతులనే కొనసాగిస్తున్నారు.

దేశ భవిష్యత్తును మార్చే విద్యార్థికీ సర్కారు బడుల్లో ఇచ్చే యూనిఫామ్ లు చూస్తే సిగ్గనిపిస్తోంది. ఖద్దరు చొక్కల నాయకుల కర్చిఫ్ విలువ చేయని దుస్తులు ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది. నాణ్యత లేని పాలిస్టర్ బట్టతో, పిల్లగాళ్లకు సరితూగని కొలతలతో, గుండీలు, కుట్లు సరిగ్గాలేని దుస్తువులు ఇస్తూ ఇదే మహా అద్భుతం అని ప్రచారం చేసుకునే ప్రభుత్వాలకు నాణ్యతా ప్రమాణాలు కనిపించడం లేదా. పేదోళ్లు సదువుకునే సర్కారు బడుల్లో రాజకీయ నాయకులను చదివించే దమ్ముందా. పేదోడికి ఒక న్యాయం.. పెద్దోళ్లకు ఒక న్యాయమా. 76ఏండ్ల స్వాతంత్య్ర భారతంలో సామాన్యుడికి ఇంకా చదువు అందనీ చందమామే అవుతుంది.

- Advertisement -

పేదోడికి విద్యనందించేందుకు ప్రభుత్వ పెద్దలు సవాలక్ష షరత్ లు విధిస్తున్నారు. బడి పిల్లల స్కూల్ యూనిఫామ్ కుట్టు కూలి రూ.50లు ఇవ్వడం ఎంత వరకు సమంజసం. ఓ పోలిటీషియన్ అంగీ, ప్యాంట్ డ్రైక్లీనింగ్, ఇస్త్రీ చేస్తే రూ.100 ఖర్చు అవుతుంది. అదే విధంగా ఓ కార్పోరేట్ స్కూల్లో విద్యార్థికి రెండు జతల యూనిఫామ్ లకు రూ.2500 నుంచి 3వేలు వసూలు చేస్తున్నారు. టెస్కో ద్వారా క్లాత్ లు సప్లై చేస్తున్న సర్వశిక్ష అభియాన్ అందులో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. విద్యార్థుల దుస్తువులు కుట్టించే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం టెండర్ల ద్వారా కాంట్రాక్ట్ దక్కించుకున్న వారికి ఒక జతకు రూ.50లు ఇవ్వడం శోచనీయం. క్లాత్ మినహా మిగతా ఖర్చు అంతా కాంట్రాక్టర్ దే కావడం.. బిల్లుల చెల్లింపుల కోసం పై అధికారులకు కమీషన్లు పోను దర్జీకి రూ.40లు మించి ఇవ్వరు. ఒక డ్రైస్సు కుట్టేందుకు టైలర్ కు కనీసం 2 నుంచి 3గంటల సమయం పడుతుంది. అనగా రోజులో కేవలం నాలుగు నుంచి ఐదు జతలే పూర్తవుతాయి. ఒక రోజుకు టైలర్ కు వచ్చే ఆదాయం రూ.150లు. ఊర్లో ఉపాధి హామీ కూలికిపోయే వ్యక్తి వచ్చే కూలి కనీసం రూ.200లు. ఆఖరికి ఆ కూలీ కూడా టైలర్ కు గిట్టుబాటు కావడంలేదు. ఈ నేపథ్యంలో దర్జీ ఎక్కువ డ్రెస్సులు కుట్టే ఆలోచనతో సింగిల్ స్టిచ్చింగ్ విధానమే అమలు చేస్తున్నారు. అలా కుట్టడం ద్వారా విద్యార్థికి ఇచ్చే యూనిఫామ్ లకు 1నెల రోజులకే ఎక్కడికక్కడ కుట్లు ఊడిపోతున్నాయి.

ముడి సరుకులు, నిత్యావసర ధరలు పెరగడం మూలంగా బతుకు భారమైన దర్జీకి అన్ని ఉన్నా అల్లుడినోట్లో శని అన్నట్లు తయారైంది టైలర్ దుస్థితి. ఈ నూతన విద్యాసంవత్సరం నుండైనా ప్రభుత్వాలు పెద్ద మనసుతో ఆలోచించి.. పేదోడి పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన యూనిఫామ్స్ లో నాణ్యత ప్రమాణాలు పాటించి.. బడి పిల్లల డ్రెస్సులకు కుట్టే దర్జీకి స్టిచ్చింగ్ ఛార్జీలు కనీసం రూ.100లకు పెంచి వాళ్లను ఆదుకోవాలని పలువురు మేధావులు డిమాండ్ చేస్తున్నారు. రేపటి బడ్జెట్ లో విద్య కోసం 20శాతం నిధులు కేటాయించి ఛిద్రమైపోతున్న ప్రభుత్వ బడుల స్థితి గతులు మార్చాలని కోరుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు