Thursday, May 2, 2024

స్మార్ట్ సిటీల మిషన్‌లో స్మార్ట్‌గా స్కాం…!

తప్పక చదవండి
  • 2015లో కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీల మిషన్ లాంచ్
  • ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి
  • ఈ మిషన్ కింద వంద నగరాలు ఎంపిక చేసిన కేంద్రం
  • ఆల్ ఎబిలిటీ పార్క్ ఏర్పాటుకు 2022లో టెండ‌ర్లు..
  • టెండ‌ర్‌ను ద‌క్కించుకున్న ఎస్ఆర్‌విఎస్ ఇండస్ట్రీస్‌
  • ఏబుల్డ్ పార్క్ నిర్మాణం రద్దు చేసిన క‌రీంన‌గ‌ర్‌ స్మార్ట్ సిటీ కార్పొరేషన్
  • డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టును అందిచిన త‌ర్వాత ర‌ద్దు చేయ‌డం ఏంటి..?
  • ఆ నిధులు దారి మ‌ళ్లాయా.. లేక ఇత‌ర ప్ర‌యోజ‌నాల‌కు ఉప‌యోగించారా?

స్మార్ట్ సిటీల మిషన్‌ను కేంద్ర ప్రభుత్వం జూన్ 25న 2015లో లాంచ్ చేసింది. స్మార్ట్ సొల్యుషన్స్ అప్లికేషన్స్ ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం, సురక్షితమై, సుస్థిరమైన వాతావరణాన్ని, మౌలిక సదుపాయాలను అందజేస్తూ.. నగరాలను ప్రమోట్ చేయాలన్నది ఈ మిషన్ ప్రధాన ఉద్దేశ్యం. సామాజిక పరంగా, ఆర్థిక పరంగా, సంస్థాగతంగా ఒక నగరాన్ని అభివృద్ధి చేస్తూ.. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని, ఆర్థికాభివృద్ధికి సాయపడాలని ఈ మిషన్ లక్ష్యంగా పెట్టుకుంది. 2016 సంవత్సరంలో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కి స్మార్ట్ సిటీ హోదాను కల్పించింది. అప్పటి నుండి నిరంతరంగా కోట్లాది కేంద్ర నిధులు అందుతున్నాయి.

2020-21 ఆర్థిక సంవత్సరంలో అధికారులు స్మార్ట్ సిటీ మిషన్ కింద కరీంనగర్‌లో వికలాంగ పిల్లల కోసం ప్రత్యేక పార్క్ ను నిర్మించడం మరియు ప్రాజెక్ట్ పూర్తయిన 2 సంవత్సరాల పాటు పార్క్ ఆపరేషన్ & మెయింటెనెన్స్ కోసం అంచనాలు, వివరణాత్మక సర్వే, ప్రిపరేషన్ డిజైన్, డ్రాయింగ్‌లు, పర్యవేక్షణ, టెండర్‌లతో సహా వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక తయారీకి కన్సల్టెన్సీని నియమించాలని కోరుతూ ప్రతిపాదన కోసం అభ్యర్థన టెండర్ నోటీసును జారీ చేశారు. ప్రత్యేక వికలాంగుల ఉద్యానవనం అనేది వికలాంగ పిల్లల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉండే స్థానిక ప్లేగ్రౌండ్, ఇది వికలాంగుల పిల్లల అవసరాలను తీర్చడానికి శారీరకంగా, సామాజికంగా, మానసికంగా వారు ఎదగడానికి వీలు కల్పించే ఒక సమగ్ర సౌకర్యం.

- Advertisement -

స్మార్ట్ సిటీల మిషన్ కింద కరీంనగర్‌లో స్పెషల్లీ ఏబుల్డ్ పార్క్ నిర్మాణం కోసం తేదీ 14.03.2022 రోజున టెండర్ నోటీసు నంబర్: 38/కెఎస్‌సిసిఎల్‌/2021-22/1 ద్వారా కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పోరేషన్ లిమిటెడ్ రూ. 3,05,96,165/- అంచనా విలువతో ఒక టెండర్ నోటీసును ఆహ్వానించింది. ఆ టెండర్ పనిని ఎస్ఆర్‌విఎస్ ఇండస్ట్రీస్‌ అనే సంస్థ రూ. 2,99,62,824.38/- కు దక్కించుకుంది.

స్మార్ట్ సిటీస్ మిషన్ కింద కరీంనగర్‌లో ప్రత్యేకంగా ఆల్ ఎబిలిటీ పార్క్ నిర్మాణానికి టెండర్‌ను ఆహ్వానించిన తేదీ నుండి ఇప్పటివరకు 24 నెలలు పూర్తయ్యాయి, కానీ. పని పురోగతి శూన్యం. గతంలో సంబంధిత అధికారులను అడిగితే ఈ నెల, ఆ నెలలో నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. చివరగా కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ బోర్డు డైరెక్టర్ల సమావేశంలో స్పెషల్‌గా ఏబుల్డ్ పార్క్ నిర్మాణం రద్దు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. ఆ పనికి కేటాయించబడిన మూడు కోట్ల రూపాయలను రోడ్లు మరియు ఇతర సివిల్ పనుల కోసం మళ్లించిడం జరిగింది అని తెలిపారు. కానీ, విక‌లాంగుల కొర‌కు కేటాయించిన నిధులను ఏ విధంగా దారి మ‌ళ్లిస్తార‌ని విక‌లాంగుల సంఘ నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు.

స్మార్ట్ సిటీ హోదా పొందిన విశాఖపట్నం, స్మార్ట్ సిటీ మిషన్ కింద “ఆల్ ఎబిలిటీ పార్క్” నిర్మాణాన్ని పూర్తి చేసింది. స్మార్ట్ సిటీ హోదా పొందిన భువనేశ్వర్, స్మార్ట్ సిటీ మిషన్ కింద వికలాంగుల కోసం “సెన్సరీ పార్క్” నిర్మాణాన్ని పూర్తి చేసింది. చెన్నైకి స్మార్ట్ సిటీ హోదా కూడా లభించింది, స్మార్ట్ సిటీ మిషన్ కింద వికలాంగుల కోసం “ఇన్‌క్లూజివ్ పార్క్” నిర్మాణాన్ని పూర్తి చేసింది.. అదే తరహాలో అనేక స్మార్ట్ సిటీలు వికాలాంగ పిల్లల కోసం ప్రత్యేక పార్కుల నిర్మాణాలు పూర్తి చేశారు. కానీ కరీంనగర్ లో మాత్రం అది జరగలేదు.

డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టును తయారు చేసి, టెండర్ ప్రక్రియను పూర్తి చేసి, చాలా నెలల తర్వాత పార్కు పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించిన తర్వాత వికలాంగ పిల్లల ప్రత్యేక పార్క్ క్యాన్సిల్ చేయడం అనేది అనేక అనుమానాలకు గురి చేస్తుంది. పార్కు కోసం కేటాయించిన నిధులు వేరే అభివృద్ధి ప‌నుల‌కు ఉప‌యోగించారా… లేక ఆ నిధులు దిగ‌మింగారా.. అనే ప్ర‌శ్న‌లు స‌ర్వ‌త్రా ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి.

సాధారణంగా శారీరక వైకల్యం ఉన్న పిల్లలు పార్కుల్లో కూర్చుని వారి తోబుట్టువులు లేదా స్నేహితులతో ఆడుకోవడం చూస్తుంటాం.. ప్రత్యేక సామర్థ్యం ఉన్న పార్క్‌లో పిల్లవాడు స్లయిడ్‌ని ఆస్వాదించవచ్చు! క్లైంబింగ్ ఫ్రేమ్! ఊయల! ఇతర పిల్లలతో పాటు ఆడుకోవాల‌నే వెసులు బాటు ఉండాల‌ని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు వైక‌ల్యం ఉన్న పిల్ల‌ల కొర‌కు కోట్ల రూపాయ‌లు వెచ్చించి ఎబిలిటీ పార్కు ఏర్పాటుకు అనుమ‌తులు జారీ చేస్తే, ఎబిలిటీ పార్కు ఏర్పాటు కోసం టెండ‌ర్లు పిలిచి, లోయెస్ట్ టెండ‌ర‌ర్‌కు టెండ‌ర్ కేటాయించి రెండు సంవ‌త్స‌రాలు కావుస్తున్న, ఎలాంటి నిర్మాణం చేప‌ట్ట‌కుండా కాల‌యాప‌న చేయ‌డం కాకుండా ఇప్పుడు ఎబిలిటీ పార్క్ టెండ‌ర్‌ను ర‌ద్దు చేస్తున్నామ‌ని తెల‌ప‌డం గ‌మ‌నార్హం. ఈ విష‌యంపై స‌మ‌గ్రంగా విచారించి విక‌లాంగుల ప‌ట్ల చూపించిన అధికారుల‌పై వికలాంగుల హక్కుల చట్టం (ఆర్‌పిడ‌బ్ల్యూడి) – 2016 ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విక‌లాంగుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

కేంద్ర ప్ర‌భుత్వం నుండి స్మార్ట్ సిటీ అభివృద్ధి కొర‌కు కేటాయించిన నిధుల్లో జ‌రిగిన అవినీతిపై పూర్తి ఆధారాల‌తో మ‌రో క‌థ‌నం ద్వారా వెలుగులోకి తేనుంది ఆదాబ్ హైద‌రాబాద్‌.. మా అక్ష‌రం.. అవినీతిపై అస్త్రం…

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు