Friday, November 1, 2024
spot_img

రాజీనామాల పర్వం

తప్పక చదవండి
  • తెలంగాణలో నామినేటెడ్‌ పదవులు ఖాళీ
  • రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు మూకుమ్మడి రిజైన్లు
  • అదే కోవలో పలువురు రిటైర్డ్‌ అధికారులు

తెలంగాణాలో బీఆర్‌ఎస్‌ ఓటమితో రాజీనామాల పర్వం మొదలైంది. పలువురు అధికారులు తమ పదవులకు రిజైన్‌ చేస్తున్నారు. తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌ కో చైర్మన్ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్ (సీఎండీ) దేవులపల్లి ప్రభాకర్‌ రావు తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల తాను రాజీనామా చేస్తున్నట్లుగా ప్రభాకర్‌ రావు వెల్లడిరచారు.కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభాకర్‌ రావు.. 25 అక్టోబర్‌ 2014 నుంచి టీఎస్‌ ట్రాన్‌కో, జెన్‌ కోకు సీఎండీ హోదాలో కొనసాగుతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడుతునన తరుణంలో నియామక పదవులకు రాజీనామా చేయడం ఆనవాయితీ. ఈ క్రమంలో ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ పదవికి దేవులపల్లి ప్రభాకర్‌ రావు తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్‌ అందించడంలో ప్రధాన పాత్ర పోషించిన ప్రభాకర్‌ రావు.. తొమ్మిదిన్నరేండ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. 22 ఏండ్ల వయస్సులోనే విద్యుత్‌ శాఖలో చేరిన ఆయన 2014, జూన్‌ 5న జెన్‌కో సీఎండీగా బాధ్యతలు చేపట్టారు. అదే ఏడాది అక్టోబర్‌ 25న ట్రాన్స్‌కో ఇన్‌చార్జిగా నియమితులయ్యారు. తొలుత ఆయన్ను రెండేండ్ల పదవీ కాలానికి సీఎండీగా ప్రభుత్వం నియమించి నప్పటికీ.. తర్వాత పదవీ కాలాన్ని పొడిగిస్తూ వస్తున్నది. తాజాగా ఆయన తన పదవికి రాజీనామా చేశారు. దీంతో 54 ఏండ్లపాటు సంస్థకు సేవలు అందించారు. తన పదవీ కాలంలో విద్యుత్‌ శాఖకే ఆయన వెలుగులు పంచి వన్నె తెచ్చారు. తెలంగాణ రాష్ట్రం వస్తే చీకట్లు కమ్ముకుంటాయని జరిగిన ప్రచారాన్ని తిప్పి కొట్టడానికి 2014లో సీఎం కేసీఆర్‌ 24 గంటల నిరంతరం కరెంటు ఇచ్చే పనికి శ్రీకారం చుట్టారు. చీకట్లను చీల్చుకుంటూ విద్యుత్‌ వెలుగులను పంచడానికి ముందుకు సాగిన కేసీఆర్‌కు ఆయన ఒక కార్యకర్తగా కృషిచేశారు. తనకు అప్పగించిన బాధ్యత ల మేరకు నిరంతర విద్యుత్‌ అందించడంలో నిరంతరాయంగా పనిచేశారు.
ఇక మరోవైపు.. సాంస్కృతిక సలహాదారుగా ఉన్న రిటైర్డ్‌ ఐఏఎస్‌ రమణాచారి కూడా రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను సీఎస్‌కు పంపించినట్టు తెలుస్తోంది. అటు ఇంటెలిజెన్స్‌ ఐజీ పదవికి ప్రభాకర్‌ రావు కూడా రాజీనామా చేసేశారు. తన రాజీనామాను ప్రభుత్వానికి పంపారాయన. మాజీ ఐపీఎస్‌ ప్రభాకర్‌ రావు స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ కు ఓఎస్డీగా ఉన్నారు. బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోవడంతో తన పదవిని ఆయన వదిలుకున్నారు. మూడేళ్ల క్రితమే ప్రభాకర్‌ రావు రిటైర్‌ అయ్యారు. అయితే కేసీఆర్‌ తో ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో ఆయనను యాంటీ నక్సల్‌ ఇంటెలిజెన్స్‌ వింగ్‌ అధికారిగా నియమించారు. కాగా, ప్రభాకర్‌ రావు ప్రతిపక్షాల ఫోన్లు ట్యాంపరింగ్‌ చేస్తున్నారని రేవంత్‌ రెడ్డి చాలాసార్లు ఆరోపించారు. ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్‌ చేసి ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చారని ఆరోపణలు చేశారు.
రాజీనామా చేసిన వారిలో చైర్మన్లు వరుసగా రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌- సోమ భరత్‌ కుమార్‌, తెలంగాణ సాహిత్య అకాడమీ – జూలూరి గౌరీ శంకర్‌, రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్‌- పల్లె రవి కుమార్‌ గౌడ్‌, స్పోర్ట్స్‌ అథారిటీ- డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌, తెలంగాణ ఫుడ్‌ కార్పొరేషన్‌- మేడే రాజీవ్‌ సాగర్‌, గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ- దూదిమెట్ల బాలరాజు యాదవ్‌, టెక్స్‌ టైల్‌ కార్పొరేషన్‌-గూడూరు ప్రవీణ్‌, బేవరేజెస్‌ కార్పొరేషన్‌ గజ్జెల నగేష్‌, ఫిలిం డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌-అనిల్‌ కూర్మాచలం, ట్రైకార్‌ రామచంద్ర నాయక్‌, గిరిజన ఆర్థిక సహకార సంస్థ వలియా నాయక్‌, రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ-డాక్టర్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, పౌర సరఫరాల సంస్థ- రవీందర్‌ సింగ్‌, రాష్ట్ర టెక్నాలజికల్‌ సర్వీసెస్‌- జగన్మోహన్‌ రావు తదితరులు రాజీనామా బాటపట్టారు. అయితే.. వీళ్ల పని తీరుపై గతంలో రేవంత్‌ రెడ్డి పలు మార్లు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. కాగా.. ఇప్పుడు రేవంత్‌ రెడ్డి సీఎం అయ్యే అవకాశాలు కన్పిస్తుండటంతో.. వాళ్లంతా రాజీనామాలు చేస్తున్నారు. సాయంత్రంలోపు మరికొంత మంది కూడా రాజీనామాలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు