Thursday, April 25, 2024

బీసీ ఉద్యమాల చరిత్రలో ఎ.ఎల్. మల్లయ్య స్థానం సుస్థిరం..

తప్పక చదవండి
  • ఎ.ఎల్. మల్లయ్య విగ్రహ ఆవిష్కరణ సభలో డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు

హైదరాబాద్: దశాబ్దాల పాటుగా బీసీ వర్గాల, ప్రధానంగా మత్స్యకారుల కుటుంబాల అభ్యున్నతికి ఎ.ఎల్.మల్లయ్య చేసిన సేవలు మరువలేనివని రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు అన్నారు. ఆయన మరణించేంతవరకు అవిశ్రాంతంగా ఉద్యమ జీవితం గడిపారని, ఎ.ఎల్.మల్లయ్య ఆ వర్గాల ప్రజల హృదయాలలో చెరగని స్థానం సంపాదించుకున్నారని ఆయన కొనియాడారు. సుదీర్ఘంగా 60 ఏళ్ళ పాటుగా మత్స్యకారుల అభివృద్ధికి, ఆయన చేసిన నిరంతర కృషి కారణంగా ఎన్నో ప్రభుత్వ ఉత్తర్వులు అమలులోకి వచ్చాయని డాక్టర్ వకుళాభరణం పేర్కొన్నారు.

ఇటీవల మరణించిన సర్దార్ ఎ.ఎల్.మల్లయ్య 86 వ జయంతి సందర్భంగా గురువారం నాడు నగరంలోని ఇందిరా పార్క్ సమీపంలో గల బండ మైసమ్మ నగర్ లో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహంను డాక్టర్ వకుళాభరణం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి, గాయని విమలక్క, కామ్రేడ్ అమర్, తెలంగాణ ప్రదేశ్ గంగ పుత్ర సంఘం అధ్యక్షుడు శ్రీహరి, మల్కాజ్‌గిరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీధర్, గంగ తెప్పోత్సవ కమిటీ అధ్యక్షుడు ఎం.మహేందర్, ప్రతినిధులు బర్రీ ప్రసాద్, చంద్ర ప్రకాశ్, మల్లేశం, శివ రత్నం, పెరిక సంగీత లతో పాటుగా స్వర్గీయ ఎ.ఎల్.మల్లయ్య సతీమణి శ్రీమతి లక్ష్మి, కుమార్తె జ్యోతి, కుమారులు సత్యనారాయణ, శ్రీనివాస్, సుధాకర్, సంతోష్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కామ్రేడ్ అమర్, విమలక్క దంపతులకు, జె.ఎన్.టి.యు. ఫైన్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ గంగాధర్ కు ఎ.ఎల్. మల్లయ్య స్మారక పురస్కారం, జ్ఞాపికలను అందజేసి, శాలువా, పూలదండలతో సన్మానించారు.సంస్మరణ సభలో డాక్టర్ వకుళాభరణం ప్రసంగిస్తూ…. స్వర్గీయ మల్లయ్య సేవలు అమూల్యమైనవని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తొలి అనంతరామన్ బీసీ కమిషన్ నుండి మొదలు తన నేతృత్వంలోని ఇప్పటి బీసీ కమిషన్ వరకు ఆయన అనేక సమస్యలను నివేదించి బీసీ వర్గాల ప్రజలకు అండగా నిలిచారని గుర్తు చేశారు. నేటి రెండు తెలుగు రాష్ట్రాలలోని అన్ని ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించి, ఆ వర్గాల అభివృద్ధికి, సంక్షేమానికి నిబద్ధతతో కృషి చేసిన సామాజిక ఉద్యమకారుడు ఎ.ఎల్.మల్లయ్య అని ఆయన కొనియాడారు. ప్రతి యేటా జయంతి రోజున ఉద్యమకారులను గుర్తించి పురస్కారాలు అందజేసే బాధ్యతను ఆయన పేరిట ఉన్న ట్రస్ట్ తీసుకోవడం గొప్ప విషయమని ఆయన పేర్కొన్నారు. సభలో పాల్గొన్న వివిధ సంఘాల ప్రతినిధులు, ఆయన స్నేహితులు, అభిమానులు మల్లయ్య సేవలను కొనియాడుతూ తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు