- ప్రమాదస్థాయి దాటి ప్రవహిస్తున్న యమున
- ఢిల్లీలో తగ్గని వరద పరిస్థితి
- హిమాచల్‌ను కుదిపేసిన భారీ వర్షాలు
- పదిరోజుల్లో ఏకంగా 200శాతం అధిక వర్షపాతం
- బియాస్ ధాటికి కొట్టుకు పోయిన మనాలి రహదారి
- 2వేల మంది టూరిస్టుల రక్షణ.. హిమాచల్ సిఎం సుఖ్విందర్
న్యూఢిల్లీ : మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ఢిల్లీలో వరదలు పోటెత్తాయి. యమునా నది ప్రమాదకర స్థాయిని దాటి ఉప్పొంగి ప్రవహిస్తున్నది. యమునా నదిలో 206 మీటర్ల ప్రవాహ మట్టమే ప్రమాదకరం కాగా, ప్రస్తుతం ఆ నది 207.55 మీటర్ల స్థాయిలో పరుగులు తీస్తున్నది. గత 44 ఏళ్లలో యమునా నది ఇంత ఉధృతంగా ప్రవహించడం ఇదే తొలిసారి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఉదయం 8 గంటల సమయంలో 207.25 మీటర్లకు చేరిన యమునా నది వరద.. మధ్యాహ్నం 12 గంటలకల్లా 207.48 మీటర్ల స్థాయికి పెరిగింది. మధ్యాహ్నం 2 గంటలకు రికార్డు స్థాయిలో 207.55 కు చేరింది. 1978 తర్వాత యమునా నదికి ఇంత పెద్ద ఎత్తున వరద రావడం ఇదే తొలిసారి అని ఢిల్లీ వరద నియంత్రణ విభాగం చెబుతోంది. 1978లో యమునా నది వరద మట్టం 207.49 మీటర్ల స్థాయిని తాకింది. ఇప్పుడు ఆ రికార్డు కూడా బద్దలైంది. ఇంకా వరద ఉధృతి పెరుగుతూనే ఉండటంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఢిల్లీలో వరద పరిస్థితి, ఈ పరిస్థితిని సమర్థంగా ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన చర్యలపై వారితో చర్చించారు.
భారీ వర్షాలతో హిమాచల్‌ప్రదేశ్ అతలాకుతలం అవుతోంది. ఇటీవలి వరదలు ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. పర్యాటకులకు ఆహ్లాదాన్ని ఇచ్చే ఆ ప్రదేశం ఇప్పుడు ప్రకృతి ప్రకోపానికి కేంద్రంగా మారింది. తాజా వర్షాలతో బియాస్ నది ఉప్పొంగిపోయింది. ఉగ్రరూపం దాల్చిన ఆ నది ప్రవాహ ధాటికి అన్నీ కొట్టుకు పోయాయి. కులు, మనాలీ మధ్య ఉన్న మూడవ నెంబర్ జాతీయ రహదారి కూడా ఆనవాళ్లు లేకుండా పోయింది. జూలైలోని మొదటి 10 రోజుల్లో ఏకంగా 200 శాతం అధిక వర్షపాతం నమోదయ్యింది. ఇంతటి భారీ స్థాయిలో వర్షం ఉందంటేనే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకో వచ్చు. హిమాచల్‌ప్రదేశ్‌లో జూలై 1 నుంచి 11 మధ్య 249.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక్కడ సాధారణ వర్షపాతం 76.6 మిల్లీ మీటర్లుగా ఉంటుంది. దీంతో సాధారణం కన్నా 226 శాతం అధిక వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. అత్యధికంగా కిన్నౌర్ జిల్లాలో 500 శాతం వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత సోలన్‌లో 426 శాతం, సిర్మౌర్‌లో 367 శాతం, సిమ్లాలో 360 శాతం, బిలాస్‌పూర్‌లో 325 శాతం, కులులో 283 శాతం అధిక వర్షాలు పడ్డాయి. ఇక లాహౌల్, స్పితిలో 233 శాతం, చంబాలో 220 శాతం, ఉనాలో 218 శాతం, హమీర్‌పూర్‌లో 171 శాతం, మండిలో 130 శాతం, కాంగ్రాలో 75 శాతం వర్షపాతం నమోదైంది. వరుసగా 3 రోజులు దంచికొట్టిన వానలు మంగళవారం మాత్రం కాస్త శాంతించాయి. మంగళవారం అక్కడక్కడ తేలికపాటి వర్షాలే కురిశాయి. అలాగే ఉష్ణోగ్రతలు కూడా పెరిగాయి. ఉనా ప్రాంతంలో అత్యధికంగా 34.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గిరిజన ప్రాంతాలు, మరికొన్ని చోట్ల మినహా.. మిగతా అన్ని చోట్ల పగలు సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే శుక్ర, శనివారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని స్థానిక వాతారణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో ’ఎల్లో’ అలర్ట్‌ను కూడా జారీ చేసింది. 17 వరకు హిమాచల్‌ప్రదేశ్‌లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.
2వేల మంది టూరిస్టుల రక్షణ
కులు జిల్లాలోని కాసోల్ ప్రాంతంలో చిక్కుకున్న సుమారు 2000 మంది టూరిస్టులను రక్షించారు. వాళ్లను సురక్షిత ప్రదేశానికి తరలించినట్లు హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుకు తెలిపారు. కులుమనాలీ రోడ్డును మంగళవారం సాయంత్రం తెరిచారు. ఆ రూట్లో సుమారు 2200 వాహనాలు వెళ్లినట్లు తెలిపారు. మనాలీలో ఇంకా అనేక ప్రాంతాల్లో మొబైల్ సిగ్నల్స్ అందుబాటులో లేవు. టూరిస్టులు తమ కుటుంబసభ్యులతో ఫోన్ మాట్లాడలేకపోతున్నారు. మనాలీ లెప్ట్ బ్యాంక్ రూట్లో రోడ్డును తెరిచారు. ఇక దక్షిణం వైపున ఉన్న రోడ్డు నది ప్రవాహంలో కొట్టుకుపోయింది. కాసోల్
బుంతార్ రోడ్డు వైపు కూలిన కొండచరియల్ని తొలగించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయన్నారు. టూరిస్టు ప్రాంతమైన లాహోల్‌లో చిక్కుకున్న వాహనాలను కూడా తరలించినట్లు సీఎం తెలిపారు. సుమారు 300 వెహికిల్స్ అక్కడ నుంచి వెళ్లినట్లు చెప్పారు. కొండ ప్రాంతాల్లో చిక్కుకున్న వారి సమాచారాన్ని తెలుసుకుని ఫేస్‌బుక్‌లో షేర్ చేస్తున్నట్లు ఏఎస్పీ ఆశిశ్ శర్మ తెలిపారు. ఆహారం, తాగునీరును అందిస్తున్నట్లు చెప్పారు. వరదల వల్ల చిక్కుకుపోయిన టూరిస్టులకు హోటళ్లు, టూరిజయం యూనిట్లు ఉచిత సదుపాయాలు కల్పిస్తున్నాయి. చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఆరు హెలికాప్టర్లు రంగంలోకి దిగినట్లు సీఎం తెలిపారు. వరదల వల్ల రాష్టాన్రికి దాదాపు 4 వేల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు.