Tuesday, September 10, 2024
spot_img

కరెంటు కయ్యం

తప్పక చదవండి
  • రేవంత్‌ వ్యాఖ్యలపై భగ్గుమన్న బీఆర్‌ఎస్‌
  • వరుసగా రెండోరోజూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
  • పలుచోట్ల రేవంత్‌ దిష్టిబొమ్మలు దగ్ధం
  • విద్యుత్‌ సౌధ వద్ద ధర్నాలో పాల్గొన్న కవిత
  • రైతులంటే కాంగ్రెస్‌కు కడుపు మంటని విమర్శలు

హైదరాబాద్‌ : వ్యవసాయానికి 3 గంటల కరెంట్‌ సరిపోతుందని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై రైతులు, బీఆర్‌ఎస్‌ శ్రేణులు భగ్గుమన్నారు. బీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఇస్తున్న ఉచిత కరెంట్‌కు ఉరి వేస్తారా? అంటూ మండిపడ్డారు. రేవంత్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజు ఆందోళనలు చేపట్టారు. ఊరూరా రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ దిష్టిబొమ్మలు దహనం చేశారు. రేవంత్‌ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ విద్యుత్‌ సౌధ వద్ద నిర్వహించిన ధర్నాలో బీఆర్‌ఎస్‌ శ్రేణులతో కలిసి ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తదితరులు పాల్గొని నిరసన తెలియజేశారు. రేవంత్‌ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. మహబూబ్‌నగర్‌ తెలంగాణ చౌరస్తాలో నిర్వహించిన నిరసనల్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొన్నారు. బోయిన్‌పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో రేవంత్‌ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. రైతులంటే కాంగ్రెస్‌ పార్టీకి ఎందుకంత కడుపు మంట అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రైతులకు మూడు గంటల కరెంట్‌ చాలన్న రేవంత్‌ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్‌పై రేవంత్‌ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ శ్రేణులు నిరసన తెలుపుతున్నాయి. ఈ క్రమంలోనే విద్యుత్‌ సౌధ వద్ద నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. రోడ్డుపై బైఠాయించి ఆమె నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. రేవంత్‌ రెడ్డి క్షమాపణలు చెప్పేదాకా గ్రామాల్లో తిరగనీయొద్దని పిలుపునిచ్చారు. 60 ఏండ్ల పాటు కాంగ్రెస్‌ పాలనలో రైతులు ఇబ్బందులు పడ్డారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత రైతు సంక్షేమ విధానాలతో దేశానికే ఆదర్శంగా మారామని తెలిపారు. ’ దేశంలో రైతుబంధు ఎక్కడా లేదు?కేసీఆర్‌ అమలు చేస్తున్న రైతుబంధును నకల్‌ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వ్యవసాయం పండగ అవ్వాలంటే నీళ్లు, మంచి విత్తనాలు ఎరువులు ఉండాలి. పంట కొనే ప్రభుత్వాలు ఉండాలి. అన్నింటికీ మించి నాణ్యమైన విద్యుత్‌ ఉండాలి. తెలంగాణలో 27.5 లక్షల మంది రైతులు బోరుబావుల మీదనే ఆధారపడ్డారు. మిషన్‌ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టుతో నీటిమట్టం పెంచుకున్నాం కాబట్టి బోర్లన్నీ నిండుగా నీళ్లు పోస్తున్నాయి. ఆ బోర్లకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం. కాబట్టి ఎప్పుడంటే అప్పుడు రైతులు బటన్‌ నొక్కి నీళ్లు పారిస్తున్నారు.’ అని పేర్కొన్నారు. ఆ మధ్య రాహుల్‌ గాంధీ వచ్చినప్పుడు రైతు డిక్లరేషన్‌ అని చేసి వెళ్లారని.. కానీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి చెప్పిన విధానాలు చూస్తుంటే కాంగ్రెస్‌ రైతు డిక్లరేషన్‌ బోగస్‌ అని తెలుస్తోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఎందుకని రేవంత్‌ రెడ్డి అంటడు? పరిశ్రమలకు ఇవ్వొద్దనే ధైర్యం ఉందా అని కవిత ప్రశ్నించారు. పరిశ్రమలు, వ్యాపారవేత్తలకు కరెంట్‌ వద్దని మాట్లాడే దమ్ముందా అని నిలదీశారు. రేవంత్‌ రెడ్డి రైతులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల్లో రేవంత్‌రెడ్డి ఉన్నారని.. ఆ రెండు పార్టీలు కూడా రైతులకు సరైన విద్యుత్‌ ఇవ్వలేదని గుర్తుచేశారు. వాళ్ల పాలనలో కరెంట్‌ లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. రైతులకు 24 గంటల కరెంట్‌ ఇస్తుంటే కాంగ్రెస్‌ నాయకులకు ఎందుకంత కండ్ల మంట అని మండిపడ్డారు. మూడు పూటల అన్నం పెట్టే రైతులకు మూడు గంటలే కరెంట్‌ ఇవ్వాలన్న రేవంత్‌ రెడ్డిని ఊరు పొలిమేర వరకు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. రేవంత్‌ రెడ్డి క్షమాపణ చెప్పేదాకా కాంగ్రెస్‌ నాయకులను గ్రామాల్లో తిరగనివ్వద్దని సూచించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు