Monday, May 6, 2024

వసూళ్ల రాంబాబు!

తప్పక చదవండి

(వసూళ్లే మెయిన్ టార్గెట్ గా విధులు నిర్వహిస్తున్న జిహెచ్ఎంసి కో-ఆర్డినేటర్ రాంబాబు)

  • దొంగ థంబ్ ఇంప్రెషన్ తో.. జీతాలు కాజేస్తున్న వైనం !
  • ప్రతీ నెల ఎస్ఎఫ్ఏలకు టార్గెట్లు
  • మామూళ్లు ఇస్తేనే ఉద్యోగాలకు భద్రత.. లేకుంటే నౌకర్ల ఊడబికుడే
  • గోషామహల్ సర్కిల్-14 శానిటేషన్ విభాగంలో కో-ఆర్టినేటర్ రాంబాబు అరాచకాలు పట్టించుకోని బల్దియా ఉన్నతాధికారులు

హైదరాబాద్ :
చేసేది ఔట్ సోర్సింగ్ ఉద్యోగం అయితేనేం ఉన్నతాధికారులు, సంబంధిత ఆఫీసర్లను మ్యానేజ్ చేసుకొని సర్కిల్ పరిధిలో కింగ్ మేకర్ లా చక్రం తిప్పేస్తున్నాడు. ఏ మాత్రం సిగ్గూ ఏగ్గూ లేకుండా సపాయి కర్మచారి కార్మికుల పొట్టకొడుతూ ప్రతీ నెల రూ.లక్షల రూపాయాలను వెనకేసుకుంటుండు. వచ్చిన దాంట్తో ఉన్నతాధికారులకు వారి వాటాను వారికి ముట్టజెబుతూ.. తనపై ఎలాంటి ఫిర్యాదులు వెళ్లినా చర్యలు తీసుకోకుండా జాగ్రత్త పడుతుండు. కలో గంజో కల్గిన కాడికి తాగి కష్టపడి పనిచేసే జీహెచ్ఎంసీ గోషామహల్ సర్కిల్-14 పరిధిలోని సపాయి కార్మికుల, శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ ల పాలిట శాపంగా మారిన ఈ అవినీతి ఔట్ సోర్సింగ్ తిమింగంపై ఆదాబ్ ప్రత్యేక కథనం.

- Advertisement -

జీహెచ్ఎంసీ గోషామహల్ సర్కిల్-14 పరిధిలో మొత్తం 812 మంది సపాయి కర్మచారి కార్మికులు పనిచేస్తున్నారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిన శానిటేషన్ విభాగం ద్వారా నియమిస్తుంటారు. ఈ నియమించబడ్డ కార్మికులు సర్కిల్ పరిధిలోని పారిశుద్ద్య పనులను నిర్వర్తించాల్సి ఉంటుంది. 21 మంది కార్మికులకు ఒక ఎస్ఎఫ్ఏ ఇంఛార్జ్ గా ఉంటారు. ఇలా గోషామహల్ సర్కిల్ శానిటేషన్ లిమిట్స్ లో 44 శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్లు విధులు నిర్వహిస్తున్నారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిన ఎంపికైన శానిటేషన్ పారిశుద్ధ్య కార్మికులకు ఈఎస్ఐ, ఈపీఎఫ్ కటింగ్ అయిన అనంతరం రూ.14500వేలు ఇస్తుండగా..వారిని మానిటరింగ్ చేస్తున్న ఎస్ఎఫ్ఏలకు ఈఎస్ఐ, ఈపీఎఫ్ పోను రూ.16వేలు వేతనంగా అందుతోందనే సమాచారం.

కింగ్ మేకర్ గా మారిన కో-ఆర్డినేటర్
ఇక శానిటేషన్ విభాగంలోని సపాయి కార్మికులను మానిటరింగ్ చేసే ఎస్ఎఫ్ఏలను చూసుకునే బాధ్యత సర్కిళ్ల పరిధిలో కో-ఆర్డినేటర్ కు ఉంటుంది. గోషామహల్ సర్కిల్-14 లిమిట్స్ లో రాంబాబు అనే వ్యక్తి ప్రస్తుతం కో-ఆర్టినేటర్ గా పనిచేస్తున్నారు. అయితే రాంబాబు నియామకం జరిగింది ఔట్ సోర్సింగ్ పద్ధతినే అయినా.. సర్కిల్ -14లో ఈ సారు చెప్పిందే వేద మంత్రంగా నడుస్తోంది. రాంబాబు వసూళ్ల రాజాగా మారిపోయారు. మొత్తం గోషామహల్ సర్కిల్ పరిధిలో 812 సపాయి కార్మికులు పనిచేస్తుండగా.. అందులో అనేకమైన అవకతవకలకు పాల్పడినట్లు తెలుస్తోంది. సర్కిల్ లిమిట్స్ లో మొత్తం 44 ఎస్ఎఫ్ఏలు ఉండగా.. వారికి స్పష్టమైన టార్గెట్లు విధిస్తున్నారు. ప్రతీ శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ నెల నెల ఎంతో కొంత రాంబాబుకు ముట్టజెప్పాల్సిందే. లేకపోతే ఉన్నతాధికారులతో మాట్లాడి వారి ఉద్యోగాల నుండి తొలగించేస్తున్నాడు.

దొంగ థంబ్ ఇంప్రెషన్స్ తో జీతాలు కాజేస్తున్న వైనం
అవినీతి సంపాదనకు రుచి మరిగిన కో-ఆర్డినేటర్ రాంబాబు పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన ఎస్ఎఫ్ఏల ద్వారా దొంగ థంబ్ ఇంప్రెషన్స్ క్రియేట్ చేసి ప్రతీ నెల జీతాలు కాజేస్తున్నట్లు సమాచారం. ప్రతీ ఎస్ఏఫ్ఏ పరిధిలో కనీసం మూడు గ్రూపులు కలిపి 21 మంది కార్మికులు పనిచేస్తుంటారు. అంతేకాకుండా అధిక మొత్తంలో డబ్బులు కావాలని రాంబాబు పలుమార్లు ఎస్ఎఫ్ఏల వద్ద గల అటెండెన్స్ మిషన్ లాక్కొని వారిని ఇబ్బందులకు గురి చేసినా సందర్భాలూ ఎన్నో ఉన్నాయి. తాను చెప్పిన విధంగా వినని వారిని గ్రూప్ ల నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. రాంబాబు ఒత్తిడి వల్ల కొంతమంది ఎస్ఎఫ్ఏ లు చట్ట వ్యతిరేక పని చేసి ఉద్యోగాలను కోల్పోయారు. రాంబాబు ఒత్తిడికి గురైన వాళ్ళల్లో వెంకట్ రెడ్డి, సత్యనారాయణ, నర్సింగ్ రావు, నాగరాజు, సాయినాథ్, విజయ్ కుమార్, వెంకటేశ్వరరావు, సురేష్ యాదవ్ ఉపాధిని కోల్పోయారు. ఈ విధంగా గోషామహల్ సర్కిల్ రాంబాబు అరాచకాన్ని సృష్టిస్తుంటే ప్రేక్షక పాత్రలో అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఉండడం అత్యంత బాధాకరమైన విషయం. రాంబాబు టార్చర్ భరించలేక శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్లు ఆరోగ్యం బాగా లేకుండా, లాంగ్ లీవ్ లో ఉన్న కార్మికుల అటెండెన్స్ ను నకిలీ ఫింగర్ ప్రింట్లతో హాజరు వేసి, ఆ వచ్చిన జీతాన్ని కార్మికులకు కొంత… మిగతాది కో-ఆర్డినేటర్ రాంబాబుకు చెల్లించిన సిచ్యుయేషన్స్ చాలానే ఉన్నాయి.

అటు ఎస్ఎఫ్ఏ లు కూడా రాంబాబు ఒత్తిళ్లను తట్టుకోలేకనే తాము చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని వారు వాపోతున్నారు. ఇటీవల సునీల్ అనే ఉద్యోగిని రూ.లక్ష డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అతను అడిగిన డబ్బులను సకాలంలో ఇవ్వకపోవడంతో సునీల్ దగ్గరి నుంచి అటెండెన్స్ మిషన్ లాక్కున్నట్లు సమాచారం. దీంతో విధిలేని పరిస్థితుల్లో సునీల్ కో-ఆర్డినేటర్ రాంబాబుకు రూ.30 వేలు చెల్లించి మళ్లీ మిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే గోషామహల్ సర్కిల్-14 శానిటేషన్ విభాగంలో ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఇంత పెద్ద కింగ్ మేకర్ గా మారి అవినీతికి పాల్పడుతున్న, ఉన్నతాధికారులు, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ పట్టించుకోకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఇంతే కాకుండా ట్రేడ్ లైసెన్స్ జారీ చేయడంలోనూ అక్రమ బుద్ధిని ప్రదర్శించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని బహిరంగంగానే గోషామహల్ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సర్కిల్ లోని స్వచ్ఛ ఆటోల ద్వారా చెత్తను సేకరించి ఎస్ బీ ఐ బ్యాంక్, స్కూప్స్ ఐస్ క్రీమ్, మమత హోటల్ వివిధ షాపింగ్ మాల్ ల నుండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు కూడా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ విధంగా గోషామహల్ సర్కిల్ లో అనేక చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు ప్రోత్సహిస్తూ వసూళ్లలో కింగ్ మేకర్ గా మారిన రాంబాబు పై అధికారులు చర్యలు తీసుకుంటారా లేదా వేచి చూద్దాం. రాంబాబు చేసే మరిన్ని అక్రమాలు పూర్తి ఆధారాలతో మీ ముందు తేనుంది ఆదాబ్ హైదరాబాద్ .మా అక్షరం అవినీతి పై అస్త్రం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు