Wednesday, May 15, 2024

పోలియోరహిత ప్రపంచాన్ని నిర్మించలేమా..!

తప్పక చదవండి
  • 24 అక్టోబర్‌ “ప్రపంచ పోలియో నిర్మూలన దినం” సందర్బంగా..

ఒక రకమైన‌ వైరస్‌ కారణంగా ఐదేండ్ల లోపు పిల్లలకు పోలియో లేదా పోలియోమైలిటిస్‌ వ్యాధి సోకుతుంది. పోలియో సోకిన పిల్లల్లో నాడీ వ్యవస్థ శాశ్వతంగా దెబ్బతిని, కండరాలు బిగుసుకుపోయి కదల్లేని దుస్థితిలో జీవితకాల పక్షవాత సమస్య ఉత్పన్నమై నడవలేని నిస్సహాయ స్థితి ఏర్పడుతుంది. ఎలాంటి చికిత్స అందుబాటులో లేని ఈ వ్యాధికి చిన్నతనంలో పోలియో చుక్కల టీకా మందే శరణ్యం అయ్యింది. పోలియో జబ్బు ఒకటి, రెండేళ్ళ పిల్లలకు అధికంగా వస్తుంది. కాలుషిత నీరు త్రాగడం, కాళ్ళూ చేతులు కదకపోవడం, మలం మీద వాలిన ఈగలు తిరిగి ఆహారపదార్థాల మీద వాలడం, రోగి దగ్గినపుడు లేదా తుమ్మినపుడు ఇతరులకు వ్యాపించడం, అపరిశుభ్ర ఆహారం తినడం వల్ల పోలియో వైరస్‌ సంక్రమిస్తుంది. అపరిశుభ్రమైన వాతావరణంలో పెరిగిన పిల్లల్లో రోగనిరోధకశక్తి బలపడే అవకాశాలు తక్కువగా ఉండడంతో పోలియో సోకే సంభావ్యత అధికంగా ఉంటుంది.

పోలియో వ్యాధి లక్షణాలు :
పోలియో సంక్రమించిన 95 శాతం రోగుల్లో వ్యాధి లక్షణాలు కనిపించవు. కొన్ని కేసుల్లో వైరస్‌ తీవ్రతను బట్టి విరోచనాలు, కడుపు నొప్పి, జ్వరం, గొంతు నొప్పి, తల నొప్పి, కండరాల నొప్పి, నడుం నొప్పి, చర్మంపై దద్దుర్లు, కండరాలు బిగుసుకు పోవడం, నీరసం, పక్షవాతం, శ్వాస ఇబ్బంది లాంటి వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. పోలియో తీవ్రత పెరిగితే కోమాలోకి వెళ్ళడం, చివరకు మరణం కూడా సంభవించవచ్చు.

- Advertisement -

పోలియో నివారణ మార్గాలు :
పిల్లలకు మలమూత్రాల విసర్జన పట్ల శిక్షణ ఇవ్వడం, పోలియో టీకాలను వైద్యుల సూచనల మేరకు బాల్యంలోనే ఇప్పించడం, ఈగలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం, నీరు కలుషితం కాకుండా చూసుకోవడం, వ్యాధినిరోధకశక్తి పెంచుకోవడం, పరిసరాల పరిశుభ్రత పాటించడం, పోషకాహారం ఇవ్వడం లాంటి నివారణ చర్యలతో పోలియో వ్యాప్తిని కట్టడి చేయవచ్చు.

పోలియో టీకా ఆవిష్కరణ :
పోలియో వైరస్‌కు విరుగుడుగా జోనాస్‌ సాల్క్, ఆల్బర్ట్ సబిన్‌లు టీకా రూపొందించారు. ప్రపంచ ఆరోగ్య చరిత్రకు సవాళు విసిరిన మసూచి వ్యాధి నిర్మూలన తరువాత పోలియో అంతానికి తగు ముందు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతున్నది. నేటికి పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్‌, నైజీరియా లాంటి దేశాల్లో పోలియో వ్యాధి ఉండటం విచారకరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిరంతర కృషితో పోలియో రహిత ప్రపంచం నిర్మించేందుకు పటిష్ట అడుగులు పడుతున్నాయి. 1988లో ప్రపంచవ్యాప్తంగా 3.5 లక్షల పోలియో కేసులు గుర్తించబడినవి.

పల్స్ పోలియో ఇమ్యునైజేషన్‌ ప్రోగ్రామ్ :
భారత ప్రభుత్వం 1995లో ‘పల్స్ పోలియో ఇమ్యునైజేషన్‌ ప్రోగ్రామ్‌’ను ప్రారంభించింది. పోలియో వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించే కృషిలో భాగంగా ప్రతియోటా 24 అక్టోబర్‌ రోజున “ప్రపంచ పోలియో నిర్మూలన దినం” పాటించడం ఆనవాయితీగా వస్తున్నది. అధిక జనాభా, నిరక్షరాస్యత, పేదరికం లాంటి సమస్యల నేపథ్యంలో భారత్‌లో పోలియో నిర్మూలన కష్టమని భావించారు. దీనికి తోడుగా 2009లో ప్రపంచ పోలియో కేసుల్లో 60 శాతం వరకు ఇండియాలోనే బయట పడ్డాయి. ప్రభుత్వ పట్టుదలతో 2011 తరువాత పోలియో కేసులు రిపోర్ట్ కాలేదు. ఈ ప్రయత్నాల ఫలంగా 2014లోనే ప్రభుత్వ చొరవతో పాటు డబ్ల్యూహెచ్‌ఓ – రోటరీ ఇంటర్నేషనల్‌ – యూనిసెఫ్‌ల సహకారంతో ఇండియా పోలియోరహిత దేశమని అధికారిక ప్రకటన వెలువడింది. 2020లో విశ్వవ్యాప్తంగా పోలియో టైప్‌-3 నిర్మూలించబడిందని ప్రకటించడం కూడా జరిగింది.

ప్రపంచ పోలియో నిర్మూలన దినం సందర్భంగా ప్రభుత్వ ప్రచారాలు, మీడియాలలో ప్రసంగాలు, రోటరీ లయన్‌ సభ్యుల అవగాహనా ర్యాలీలు, విద్యాలయాల్లో పోలియో సంబంధ పోటీలు, పోలియో టీకాల ఆవశ్యకత వివరణలు, పోలియోరహిత సమాజ స్థాపనకు ప్రజల్లో చైతన్య కార్యక్రమాలు లాంటివి పెద్ద ఎత్తున చేపడుతున్నారు. పోలియో నిర్మూలన యజ్ఞంలో ప్రతి ఒక్క పౌరుడు సైనికుడి వలె జాగ్రత్తలు తీసుకుంటూ, పసి పిల్లలకు సకాలంలో పోలియో టీకాలు ఇప్పించడం మరిచి పోరాదు. పోలియో వ్యాధికి చికిత్స లేదు, టీకాలు వేయిస్తూ నిర్మూలించడమే ఏకైక మార్గమని ప్రజల్లో అవగాహన కల్పిద్దాం. భయంకర పోలియో వైరస్‌ను ప్రపంచం నుంచి తరిమేద్దాం.

  • డా: బుర్ర మధుసూదన్ రెడ్డి.. 9949700037
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు