Saturday, May 4, 2024

డిక్లరేషన్‌లోని ప్రతిహామీ నెరవేరుస్తాం

తప్పక చదవండి
  • ఉచిత విద్యుత్‌కు నాందిపలికిందే కాంగ్రెస్‌
  • కౌలు రైతులకు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

హైదరాబాద్‌ : కౌలు రైతులకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాబోయే రోజుల్లో వరంగల్‌ రైతు డిక్లరేషన్‌( సాక్షిగా ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్‌ పార్టీ నెరవేరుస్తుందని రాసిన లేఖలో భరోసా ఇచ్చారు. రైతులకు ఉచిత విద్యుత్‌ ఇవ్వాలన్న ఆలోచనకు నాంది పలికిందే కాంగ్రెస్‌ అని గుర్తు చేశారు. పావలా వడ్డీకే రుణాలు, పంట బీమా, రైతు బీమా, ఇందిర జలప్రభ, రాయితీ విత్తనం, పెట్టుబడి రాయితీ, పంటకు మద్ధతు ధర, ధాన్యం కొనుగోలు కోసం ఐకేపీ కేంద్రాల ఏర్పాటు వంటి సమగ్ర రైతు అనుకూల నిర్ణయాలతో వ్యవసాయాన్ని అభివృద్ధి చేసింది తమ పార్టీనేనని స్పష్టం చేశారు. వ్యవసాయం చేసి కూడా ప్రతి ఏటా కౌలు కట్టేందుకు అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి కోసం మరింత అప్పు చేయాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. పంట పండినా, పండకపోయినా కౌలు చెల్లించడం తప్పనిసరని.. దీంతో పాటు గిట్టుబాటు ధర దక్కక కుదేలవుతున్నారన్నారు. కౌలు చెల్లించి, అప్పోసప్పో చేసి సాగులోకి దిగినా భవిష్యత్‌పై బెంగ.. గుండెల మీద కుంపటిలాగా సెగపుట్టిస్తూనే ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ ప్రణాళిక లోపం, విధానరాహిత్యం వల్ల తెలంగాణలో వ్యవసాయ రంగం పరిస్థితి దయనీయంగా తయారైందని ఆరోపించారు. సాగుకు పూర్వవైభవం తేవడానికి నడుం కట్టాల్సిన అవసరం ఉన్నదని.. పరిస్థితులు విశ్లేషించి సాగు చేసే ప్రతి ఒక్కరికి భరోసా కల్పించేందుకు కాంగ్రెస్‌ రైతు డిక్లరేషన్‌కు రూపకల్పన చేసిందన్నారు. గతేడాది మేలో రాహుల్‌గాంధీ సమక్షంలో వరంగల్‌ రైతు డిక్లరేషన్‌ ప్రకటించిందని గుర్తు చేశారు. ఇందిరమ్మ రైతు భరోసా పథకం తెచ్చి భూమి కలిగిన రైతులు, కౌలు రైతులకు ప్రతి ఎకరాకు ఏటా రూ.15 వేలు పెట్టుబడి సాయం చేస్తామని హామీ ఇచ్చిన విషయం గుర్తు చేశారు. అన్ని పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేసే విధంగా హామీ ఇచ్చారని, మెరుగైన పంటల బీమా పథకం తెచ్చి.. ప్రకృతి విపత్తుల వల్లనో లేదా మరో కారణంగా పంట నష్టం జరిగితే శరవేగంగా నష్టం అంచనా వేయించి పరిహారం అందేలా చూస్తామని లేఖలో ప్రస్తావించారు. రైతుల పట్ల మాకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమేవరంగల్‌ డిక్లరేషన్‌ నని.. కర్షకులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గాలికి వదిలేశాయని ఆరోపించారు. రాబోయే వంద రోజుల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. రైతుల తలరాతను మారుస్తుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో రైతు రాజ్యస్థాపనే కాంగ్రెస్‌ లక్ష్యమని స్పష్టం చేశారు. రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన ప్రతి మాట అమలు చేసి తీరుతాం.. రైతులెవ్వరూ ఆధైర్యపడొద్దని స్పష్టం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు