Saturday, May 4, 2024

మా భూములు మాకే కావాలి..

తప్పక చదవండి
  • కొండకల్‌-మొకిలా బిలాదాఖలా భూముల్లో
  • బడాబాబులకో న్యాయం… రైతులకో న్యాయమా….
  • రియాల్టర్లు మధ్యవర్తులు తమను పూర్తిగా మోసం చేశారు
  • ప్రాణం పోయినా భూమిని వదిలేది లేదు
  • న్యాయం జరిగే వరకూ పోరాడుతాం.. రైతుల ఆవేదన

శంకర్‌ పల్లి : రంగారెడ్డి జిల్లా శంకర్‌ పల్లి మండలం కొండకల్‌-మోకీల గ్రామాల మధ్య సర్వే నెంబర్‌ లేని ప్రభుత్వ బిలాదాఖల భూమి 117.16 ఎకరాల ల్యాండ్‌ ఉంది. అయితే ఈ భూమికి సంబంధించి ఎలాంటి సర్వే నెంబర్‌ లేకపోయినప్పటికీ కొందరు రైతులు ఈ ల్యాండ్‌ ను చాన్నాళ్లుగా సాగు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే 2004లో పరిగిలో జరిగిన బహిరంగ సభలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి చేతుల మీదుగా సాగుదారులకు లావాణి పట్టాలను కూడా అప్పటి సర్కార్‌ అందజేయడం జరిగింది. ఇందుకోసం అప్పటి ప్రభుత్వం ఈ బిలాదాఖల భూమికి సర్వే నెంబర్‌ 555ను కేటాయించి పట్టాలను అందజేసింది. అయితే ఇంత వరకు బాగానే ఉన్న..సర్కార్‌ పట్టాలు ఇచ్చినప్పటికీ రెవెన్యూ అధికారులు మాత్రం సదరు సాగు/పట్టాదారుల వివరాలను మాత్రం రికార్డులకు నమోదు చేయకపోవడం గమనార్హం. అసైన్డ్‌,పహనీ రికార్డుల్లో ఆ భూమి బిలాదాఖలా భూమిగానే కొనసాగుతూ..వచ్చింది
మా భూములు మాకే కావాలి… రైతులు
రైతులు మా భూములు మాకే కావాలని తిరగబడ్డారు. తమ భూములు తమకే చెందాలని కొండకల్‌ గ్రామానికి చెందిన రైతులు బిలా దాఖలా భూముల్లో బుధవారం ట్రాక్టర్‌ లతో దున్నించారు. బిలా దాఖలా భూములను ప్రభుత్వం గుంజుకుంటుందని, అందులో నుంచి 100 పీట్ల రోడ్డు పోతుందంటూ ఉపసర్పంచ్‌ తనయుడు భూపాల్‌ తమను భయభ్రాంతులకు గురిచేసి కల్లబోల్లి కబుర్లతో మాయ మాటలు చెప్పి మోసగించారని రైతులు వాపోయారు. సుమారు ఎకరానికి రూ.25 కోట్ల విలువచేసే భూమిని కాజేసి తమకు తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు ఇవ్వడానికని ఆరు నెలల సమయం పెట్టి తమను ఒప్పించి వినాయక డెవలపర్స్‌ పేరిట భూములు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని వాపోయారు. వారిని నమ్మి రిజిస్ట్రేషన్‌ చేస్తే తమకు డబ్బులు ఇవ్వకపోగా, సాగు చేసుకుంటున్న భూమి ని కోల్పోవాల్సి వచ్చిందని అన్నారు. ఓ రైతుకు 39 గుంటల భూమి ఉండగా అతనికి డబ్బులతో పాటుగా 1210 గజాలు రిజిస్ట్రేషన్‌ చేసి ఇచ్చారని తెలిపారు. అందరి రైతులకు సమన్యాయం జరగలేదని పేర్కొన్నారు. 60- 70 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న తమ భూమి తమకే కావాలని రైతులు డిమాండ్‌ చేశారు. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూమిని తమ పేరిట పట్టా చేయాలని ఎన్నో సంవత్సరాలు కలెక్టరేట్‌ కు వెళ్లినా న్యాయం జరగలేదని గుర్తు చేశారు. బడా రియాల్టర్లకు మాత్రం రిజిస్ట్రేషన్‌ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా సీసీఎల్‌ఏ కార్యాలయంలో స్లాట్‌ బుకింగ్‌ చేసి అడ్డగోలుగా తహసీల్దార్‌ కార్యాలయంలో ఎలా రిజిస్ట్రేషన్లు చేస్తారని వారు ప్రశ్నించారు. బిలా దాఖలా రైతులకు ప్రభుత్వం వెంటనే పట్టాలు చేసి న్యాయం చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు