Wednesday, September 11, 2024
spot_img

అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంపై విషప్రయోగం

తప్పక చదవండి
  • చికిత్స కోసం కరాచీ ఆస్పత్రిలో చేర్చినట్లు ప్రచారం
  • పాక్‌లో ముందు జాగ్రత్తగా ఇంటర్‌నెట్‌ సేవల నిలిపివేత

కరాచీ : పరారీలో ఉన్న అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం విషప్రయోగంతో పాకిస్థాన్‌లోని కరాచీ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరినట్లు సమాచారం. విషప్రయోగం కారణంగా అతన్ని ఆసుపత్రికి తరలించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని పాక్‌ అధికారికంగా ధ్రువీకరించ లేదు. సంబంధిత ఆసుపత్రిలో గట్టి నిఘా ఉంచినట్లు తెలుస్తోంది. 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి, భారత్‌ మోస్ట్‌ వాంటెడ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం చాలా సంవత్సరాలుగా పాకిస్థాన్‌లో ఉంటున్నాడు. ముంబై దాడుల్లో 250 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా వేలాది మంది గాయపడ్డారు. ఈ పేలుళ్ల ప్రణాళిక, అమలులో అతని ప్రమేయం ఉందన్న ఆరోపణలలో భారత్‌ మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్టులలో ఒకడిగా దావూద్‌ ఉన్నాడు. 2008లో 26/11 ఉగ్రదాడుల సమయంలో 10 మంది పాకిస్తానీ ఉగ్రవాదులకు దావూద్‌ ముంబైలో ఉన్న తన నెట్‌వర్క్‌ ద్వారా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సరఫరా చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. కరాచీలో దావూద్‌ ఇబ్రహీం ఉన్నాడని భారత్‌ సాక్ష్యాలను సమర్పించినప్పటికీ అతనికి తాము ఆశ్రయం ఇవ్వలేదని పాక్‌ తిరస్కరిస్తూ వస్తోంది. ముంబై పోలీసులు దావూద్‌ ఆసుపత్రిలో చేరడంపై అతని బంధువులు అలీషా పార్కర్‌ , సాజిద్‌ వాగ్లే నుంచి సమాచారాన్ని రాబట్టేందుకు యత్నిస్తున్నారు. అతను రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కరాచీలో ఉంటున్నాడని సోదరి హసీనా పార్కర్‌ కుమారుడు ఎన్‌ఐఏకి వివరించాడు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మనీలాండరింగ్‌, దోపిడీ, ఆయుధాల స్మగ్లింగ్‌ వంటి నేర కార్యకలాపాలలో పాల్గొన్నాడు. అతన్ని చంపితే 25 మిలియన్‌ డాలర్లు ఇస్తామని గతంలో భారత్‌ ప్రకటించింది. అల్‌ ఖైదా ఉగ్రవాద సంస్థతో కూడా అతనికి సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంపై విషప్రయోగానికి పాల్పడ్డారనే వార్త సోషల్‌ విూడియాలో వైరల్‌ అవుతోంది. ఆయనకు కరాచీలో విషప్రయోగం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. పాకిస్తాన్‌ సోషల్‌ విూడియాలో వైరల్‌ అవుతున్న నివేదికల ప్రకారం, అతని పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చేరారు. దావూద్‌పై విషప్రయోగం జరిగిందన్న వార్తలను అధికారికంగా ఎవరూ ఇంత వరకు ధృవీకరించలేదు. దావూద్‌ చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో కట్టుదిట్టమైన భద్రత ఉందని చెబుతున్నారు. ఆ ఆస్పత్రిలో దావూద్‌ ఒక్కడే పేషెంట్‌. ఆ ఆస్పత్రిలో పాకిస్థాన్‌ ఉన్నతాధికారులు, వారి కుటుంబ సభ్యులకు మాత్రమే చికిత్స అందిస్తుంటారు. దావూద్‌పై పాకిస్థాన్‌లో విషప్రయోగం జరిగిందన్న వార్త తర్వాత దేశంలో కలకలం రేగింది. పాకిస్థాన్‌లో ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోయాయి. సర్వర్‌ డౌన్‌ కారణంగా సేవలు నిలిచిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. దేశంలోని పలు పెద్ద నగరాలైన లాహోర్‌, కరాచీ, ఇస్లామాబాద్‌ లలో కూడా సర్వర్‌ డౌన్‌ అయింది. ఇవే కాకుండా ఎక్స్‌, ఫేస్‌ బుక్‌, ఇన్‌ స్టాగ్రామ్‌ కూడా పనిచేయడం లేదని పేర్కొన్నారు. రాత్రి 8 గంటల నుంచి ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్‌, సైబర్‌ భద్రత, డిజిటల్‌ గవర్నెన్స్‌ను పర్యవేక్షించే నెట్ల్బాక్‌ అనే సంస్థ పాకిస్తాన్‌లో సోషల్‌ విూడియా ప్లాట్‌ఫామ్‌లపై నిషేధాన్ని ధృవీకరించింది. దావూద్‌ ఇబ్రహీంపై ఎవరో విషప్రయోగం చేశారని, ఆ తర్వాత అతని ఆరోగ్యం క్షీణించిందని వార్తలు వస్తున్నాయని పాక్‌ జర్నలిస్ట్‌ ఒకరు అన్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని, కరాచీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని, ఈ వార్త కూడా సోషల్‌ విూడియాలో చక్కర్లు కొడుతోంది. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఏదో జరుగుతోందనే విషయం మాత్రం తెలుస్తోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు