- మేడారంలో 9కి.మీ మేర ట్రాఫిక్ జామ్
- ఇబ్బందులు ఎదుర్కుంటున్న భక్తులు
- వచ్చే నెల 21వ తేది నుండి జాతర మొదలు
- ఏర్పాట్లు ముమ్మరం చేసిన తెలంగాణ ప్రభుత్వం
- కోటికి పైగా భక్తులు వస్తారని ప్రభుత్వం అంచాన..
ములుగు జిల్లా మేడారానికి భక్తులు పోటెత్తారు. ములుగు జిల్లాలోని మేడారంలో కోలువైన ఆదివాసుల ఆరాధ్యదైవం సమ్మక్క, సారలమ్మల మహా జాతర త్వరలో జరగనుంది. ఈ క్రమంలో ముందస్తుగానే అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు మేడారం చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం కావడంతో భక్తుల తాకిడి ఒక్కసారిగి పెరిగిపోయింది. ముఖ్యంగా వరుసగా సెలవులు రావడంతో సుదూరప్రాంతాల నుంచి భక్తులు మేడారం చేరుకున్నారు. దీంతో ఆదివారం మధ్యహ్న నుంచి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో జంపన్న వాగు నుంచి చింతల్ ఎక్స్ రోడ్ వరకు దాదాపు 9 కిలోమీటర్లు మేర వాహనాలు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుని పోయాయి.దీంతో ప్రజలు, వాహనదారులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అటు… మేడారం జాతర పనులు ఈ నెల 31 లోగా పూర్తి కావాలని డెడ్‌లైన్ విధించింది ప్రభుత్వం. ఇప్పటికే 300 సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్‌ను ఏర్పాటు చేశారు. అధికారులు ఎంతవరకు సమాయత్తం అవుతున్నారో తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో మంత్రి సీతక్క పర్యటించారు. ఇదిలా ఉంటే, మేడారం పరిసరాల్లో భారీగా తాగునీటి కొరత ఉందంటున్నారు భక్తులు. దీంతో జాతర పూర్తిస్థాయిలో మొదలైతే పరిస్థితి ఇంకెలా ఉంటుందో అని ఆందోళన చెందుతున్నారు. అధికార యంత్రాంగం దృష్టి సారించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మేడారం జాతర దక్షిణ భారతదేశంలో జరిగే మహాకుంభమేళగా గుర్తింపు పొందింది. పూర్తిగా అటవి ప్రాంతంలో కొలువుదీరిన సమ్మక్క, సారలమ్మల జాతరను అట్టహాసంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా మంత్రులు, సీతక్క, కొండా సురేఖ దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను ఈ నెల 30 వరకు పూర్తి చేయాలని ప్రభుత్వం కాంట్రాక్టర్లకు డెడ్ లైన్ విధించింది. ఈ నెల 21 నుంచి జాతర ప్రారంభం కానుంది. 21 ప్రారంభమైన నాలుగు రోజుల పాటు సాగే ఈ జాతరకు ఈ సారి కోటికి పైగా భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తుంది.