- టీఎస్ఎస్పీడీసీఎల్ లో డీఈల ఇష్టారాజ్యం
- 2016-20 వరకు కొనసాగిన పెన్సింగ్ పనులు
- సుమారు 20 డివిజన్లలో జరిగిన వర్క్స్
- స్క్వేర్ ఫీట్ పనులు తక్కువ.. నొక్కేసింది ఎక్కువే
- నచ్చిన గుత్దేదార్లకే ఓపెన్ టెండర్ల అప్పగింత
- డీఈ, గుత్తేదార్లు కలిసి అడ్డగోలుగా దోపిడి
- పాత సీఎండీ రఘుమారెడ్డికి వాటాలు..!
- రాష్ట్ర సర్కార్ సమగ్ర దర్యాప్తు జరిపిస్తే అవినీతి అనకొండల బండారం బయటపడే ఛాన్స్
దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)లో భారీ కుంభకోణం బయటపడింది. అందుకు సంబంధించిన వివరాలు ఆదాబ్ చేతికొచ్చాయి. పాత సీఎండీ రఘుమారెడ్డి, అతని అవినీతి శిష్యగణం కాసుల కోసం రూ.వేల కోట్ల స్కాం చేసేశారు. బీఆర్ఎస్ సర్కార్ హయంలో మమ్ములను అడిగేవారేవ్వర న్నట్లు ఆయా డివిజన్ల పరిధిల్లోని కొందరు డీఈలు ఇష్టారాజ్యంగా వ్యవహరించి కోట్లు దండుకున్నారు. నవ్విపోదుగాక నాకేంటి సిగ్గన్నట్లు టెండర్ లో కోడ్ చేసిన ప్రకారం కాకుండా ఇష్టారీతిన చేసిన పనులకు..బిల్లులు అప్రూవల్ చేసేశారు.
2016-2020 వార్షిక బడ్జెట్లలో టీఎస్ఎస్పీడీసీఎల్ లోని సుమారు 20 డివిజన్ల పరిధిలో ట్రాన్స్ ఫార్మర్ల చుట్టు కంచె వేసేందుకు సంబంధిత డీఈలు ఓపెన్ టెండర్ల ద్వారా గుత్తేదార్లను బిడ్డింగ్స్ కు ఆహ్వానించారు. ఈ బిడ్డింగ్స్ లోని నిబంధనల ప్రకారం ట్రాన్స్ ఫార్మర్ల చుట్టూ 5 ఫీట్ల పొడగు,4 ఫీట్ల వెడల్పుతో ఇనుప కంచె వేయాల్సి ఉంటుంది. డీటీఆర్ (ట్రాన్స్ ఫార్మర్) చుట్టు మొత్తం 120 ఫీట్లతో పెన్సింగ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలి. ఇనుప కంచె తప్పకుండా 7 ఫీట్లు ఉండేలా గుత్తేదారు చూసుకోవాలి. పెన్సింగ్ చుట్టు ఇనుప ముళ్లతో కూడిన వైర్ ఏర్పాటు చేయాలి. కంచె చుట్టు మొత్తం 8 ఇనుప రాడ్స్ ను పోస్టులుగా ఏర్పాటు చేసి.. వాటి కింద కాంక్రిట్ నిర్మాణాలు చేయాల్సి ఉంటుంది. పెన్సింగ్ పూర్తైన తర్వాత దానికి ఒక గేట్ ను కూడా పెట్టాలి.
అయితేే ఇంతవరకు బాగానే ఉన్నపెన్సింగ్ నిర్మాణ పనుల్లో అనేక గోల్ మాల్ పనులు జరగడం గమనార్హం. గుత్తేదారు ఎస్టిమేషన్ కు గ్రౌండ్ లో పనులకు అస్సలు సంబంధం లేకపోవడం విస్మయం కల్గిస్తోంది. చేసిన పనులకు ఇచ్చిన బిల్లులకు కూడా అస్సలు పోలిక లేకపోవడం గమ్మత్తుగా ఉంది. ఎస్టిమేషన్స్ ప్రకారం పనులు జరగకున్నా.. సంబంధిత బిల్లులను ఆయా డివిజన్లలోని డీఈలు పాస్ చేయడం బాధాకరం. నిబంధనల ప్రకారం ఫీట్ కు ఏరియాను బట్టి ఎస్టిమేషన్ లెక్కలు కట్టారు. మామూలుగా అయితే ట్రాన్స్ ఫార్మర్ల చుట్టు 120 ఫీట్లకు మించి పెన్సింగ్ వేయాల్సి పనిలేదు. కానీ,అనేక చోట్ల 600 ఫీట్ల కంచె వేసినట్లు ఎస్టిమేషన్ వేసి బిల్లులు పాస్ కావడం గమనార్హం. మరికొన్ని చోట్ల స్క్వేర్ ఫీట్ కు రూపాయి చెల్లించాల్సిన చోట అంతకు 14 రెట్ల అధిక మొత్తాన్ని చెల్లించారు. ఇంకొన్ని చోట్లనైతే తన అనుయాయులకే డీఈలు డీటీఆర్ కంచె టెండర్లు అప్పగించడం విశేషం.
మచ్చుకుకొన్ని ఉదాహరణలు..
మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ శివంపేట్ ఏఈ లిమిట్స్ లో రెండు ట్రాన్స్ ఫార్మర్ల చుట్టు ఇనుప పెన్సింగ్ వేయడం జరిగింది. ఇందుకు సంబంధించిన ఎస్టిమేషన్ ను 20/03/2018 నాడు వేశారు. అయితే ఎస్టిమేషన్ లోనే లోపాలుండడం గమనార్హం. వాస్తవానికి నిబంధనల ప్రకారం డీటీఆర్ చుట్టు 100 నుంచి 120 మీటర్లకు మించి ఇనుప కంచె వేయరాదు. కానీ, ఇక్కడ అదనంగా 14 రెట్లు పెన్సింగ్ వేసినట్లు చూపించుకున్నారు. ఇక్కడ స్వ్కేర్ ఫీట్ కు రూ.56ను ఎస్టిమేషన్ లో కోడ్ చేశారు. అంటే ఈ చొప్పున అదనంగా 14 రెట్ల మేర కంచె వేసినట్లు చూపించినందున గుత్తేదార్, విద్యుత్ అధికారులు కలిసి ఎంత మొత్తం మింగేశారో ఇట్టే అర్థమవుతోంది. అలాగే హుస్నాాబాద్ డివిజన్ పరిధిలోని మరో రెండు ట్రాన్స్ ఫార్మర్ల చుట్టు వేసిన పెన్సింగ్ ను పరిశీలించగా.. అడ్గగోలు అవినీతి జరిగినట్లు అర్థమవుతోంది. ఇక్కడ ప్రతీ స్క్వేర్ ఫీటుకు ఇనుప కంచె వేసేందుకు రూ.284లుగా నిర్ణయించారు.
అదే శివంపేట ఏఈ పరిధిలోని ట్రాన్స్ ఫార్మర్స్ కు మాత్రం ప్రతీ స్క్వేర్ ఫీటుకు రూ.56 నిర్ణయించారు. కానీ, ఇక్కడ మాత్రం అదే కంచెను రూ.284కు వేసినట్లు నిర్ణయించడం గమ్మత్తుగా ఉంది. అంటే శివంపేట్ లో క్వాంటిటీ పెంచి డబ్బులు దండుకోగా.. ఇక్కడ మాత్రం ఫీట్ చొప్పున వేసే కంచెకు రేట్ పెంచేసి పైసల్ మింగేశారు. ఇక వికారాబాద్ జిల్లా దోమలో మాత్రం క్వాంటిటీని తగ్గించినప్పటికీ.. స్వ్కేర్ ఫీట్ కు వేసే రేట్ ను మాత్రం అమాంతం పెంచేశారు. ఇక్కడ ఒక్క ఫీటు కంచె వేసేందుకు రూ.384 అయినట్లు చూపించడం గమనార్హం. అంటే శివంపేట్, హుస్నాబాద్ లలో జరిగిన కంచె పనుల కన్న అధిక మొత్తం రేట్ ను ఇక్కడ సంబంధిత డీఈ చెల్లించారన్న మాట. మొత్తంగా తక్కువ రేట్ ఉన్న చోట అధిక క్వాంటిటిని.. ఎక్కువ రేట్ కోడ్ చేసిన దగ్గర తక్కవ క్వాంటిటీని మెయింటెన్ చేసి నిబంధనలకు పాతరేసి సుమారు 20 డివిజన్ల పరిధుల్లో ఆయా డీఈ, విద్యుత్ అధికారులు కోట్లాది రూపాయాలను దిగమింగినట్లు అర్థమవుతోంది.
అంతేకాక డీటీఆర్ లకు ఇనుప కంచెలు వేసే పనులను సంబంధిత డీఈలు తమ తాబేదార్లకే గుత్తేదార్ వర్క్స్ ను అప్పగించుకొని జరిగిన అవినీతి వల్ల వచ్చిన సోమ్మును పప్పు-బెల్లం వలె పంచేసుకున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని చక్కదిద్దాల్సిన బీఆర్ఎస్ సర్కార్ లో దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థకు సీఎండీగా ఉన్న రఘుమారెడ్డి డీఈలతోని పర్సేంటేజీలు మాట్లాడుకొని అందికాడికి దండుకున్నట్లు తెలుస్తోంది. అందువల్ల ప్రస్తుత ప్రభుత్వం ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపితే వేల కోట్ల విలువైన ప్రజా ధనాన్ని అవినీతి అధికారుల నుంచి రికవరీ చేసేందుకు అవకాశం దొరికే ఛాన్సెస్ కనిపిస్్తతున్నాయి.