Saturday, May 4, 2024

ప్రజాసేవ చేయాలనుకునే నాయకులకు టీడీపీ వేదిక కానుంది

తప్పక చదవండి
  • యువతకు,మహిళలకు,బీసీలకు టీడీపీ గతంలో ఎన్నో అవకాశాలిచ్చింది
  • అందుకే కాసాని జ్ఞానేశ్వర్ గారు టీటీడీపీ భాద్యతలు స్వీకరించారు
  • అధికారం ఏ ఒక్కరిది కాదు,స్పష్టమైన విధానాలతో వెళితే ప్రజలు ఆదరిస్తారు..
  • మాకు అధికారం మీద యావలేదు .అధికారం లేనప్పుడు సహాయం చేశాం
  • ప్రజలు అవకాశమిచ్చి పాలకులుగా అధికారం ఇస్తే మరింతగా ప్రజా సేవ చేస్తాం
  • టీడీపీ క్రమశిక్షణతో కూడిన పార్టీ ,ఈ సారి ప్రజలు ఆదరిస్తారనే నమ్మకముంది.
  • తెలుగుదేశం జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ తో ఆదాబ్ చిట్ చాట్
    ఆదాబ్ :- నమస్కారం కాసాని వీరేష్ ముదిరాజ్ గారు
    వీరేష్ :- నమస్కారం
    ఆదాబ్ : ఆదాబ్ హైదరాబాద్ పత్రికకు మీ విలువయిన సమయాన్ని ఇచ్చినందుకు ముందుగా మీకు మా పత్రిక తరఫున కృతఙ్ఞతలు తెలుపుతున్నాం సర్ … !
    వీరేష్ :-థాంక్స్
    ఆదాబ్ :- వీరేష్ గారు మీ గురించి చెబుతారా.(పుట్టిన ఊరు,విద్యాబ్యాసం, ప్రొఫెషినల్ ) విషయాల గురించి మాతో పంచుకుంటారా ..?
    వీరేష్ :- నా స్కూల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ లో పూర్తయ్యింది. కాలేజీ ఎడ్యుకేషన్ అబ్రోడ్ లో పూర్తి చేశాను.మాస్టర్స్ కంప్లీట్ అయ్యింది, జర్నలిజం,ఎల్ ఎల్ బి కూడా పూర్తి చేశాను..
    ఆదాబ్ :-మీరు రాజకీయాల్లో రావడానికి ప్రధాన కారణం ఏమిటి.
    వీరేష్ :- మా కుటుంబం మొత్తం రాజకీయాల్లోనే ఉన్నాము, గొప్ప పదవులు చేపట్టకపోయిన అడిగినవారికి లేదనకుండా సహాయం చేస్తూ వచ్చాం,సేవ చెయ్యడం ఇష్టంగా చేస్తున్నాం, కష్టం వచ్చిందని మా దగ్గరికి వచ్చిన వారికి లేదనకుండా సహాయం చేస్తూ వస్తున్నాం,
    ఆదాబ్ :- రాజకీయాల్లో ఎవ్వరు మీకు రోల్ మోడల్
    వీరేష్ :- నిజం చెప్పాలంటే నా తల్లిదండ్రులు నా రోల్ మోడల్, ఆకలి ఉన్న వారికి అన్నంపెట్టే సంస్కారం వాళ్ళ నుంచే నేర్చుకున్న.కృతజ్ఞత ప్రత్యుపకారం ఆశించకుండా సహాయం చేయడం నా తల్లిదండ్రులే అలవాటు చేశారు.
    ఆదాబ్ :- ఎన్టీఆర్,చంద్రబాబు,జ్ఞానేశ్వర్ నుంచి మీరు ఎం నేర్చుకోలేదా.
    వీరేష్ :-స్వర్గీయ ఎన్టీఆర్ గారు చాలా ఉన్నత భావాలు కలిగిఉన్న గొప్ప వ్యక్తి .. ఆయన జీవితం ఎందరికో ఆదర్శం,కమిట్మెంట్ ఇవ్వడం అనేది ఆయన నుంచే నేర్చుకున్న,మాట ఇవ్వడం చాల తేలిక మాట ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం చాలా కష్టం స్వర్గీయ ఎన్టీఆర్ గారు ఒక క్రమశిక్షణతో కూడిన జీవితం గడిపారు. క్రమశిక్షణతో ఎలా జీవించాలన్నది అయన నుంచే నేర్చుకున్న,చంద్రబాబు గారు ఒక విజన్ ఉన్నగొప్ప నాయకుడు.. 10 ఏండ్ల తరువాత ప్రపంచం ఎం ఆలోచిస్తుందో ఇప్పుడే అది అలోచించి అమలు చేయగలిగిన సత్తా ఉన్న నాయకుడు,పార్టీని పార్టీ నాయకులను క్రమశిక్షణలో ఉంచారు,ఆయన అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నఏనాడూ కేసులు ఎదుర్కొనలేదు,వారు యువతకు కంప్యూటర్ ని పరిచయం చేశారు,ఐటీ హబ్ ని క్రియేట్ చేశారు,దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో తెలుగువారు ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డారంటే అది చంద్రబాబు గారి ఘనతగా గట్టిగా చెప్పగలను. జ్ఞానేశ్వర్ గారు బీసీ కమ్యూనిటీలో బలమైన నేత, ముదిరాజ్ కమ్యూనిటీ కోసం వారి సంక్షేమం కోసం వారి హక్కుల కోసం గళం విప్పి పోరాడిన,పారాడుతున్న గొప్ప నాయకుడు.. వీరి గురించి సమాజానికి కొత్తగా చెప్పేది ఏంలేదు.. వీరు ఒక విజన్ తో పనిచేస్తున్నారు.. వీరు నాకే కాదు కొన్ని లక్షలాది మందికి స్ఫూర్తి దాతలు.
    ఆదాబ్ :-మీకు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు బాగా తెలుసు..మీకు అధికార , ప్రతిపక్ష పార్టీలతో.. వారి అధినాయకులతో మీకు చక్కటి సంబంధాలు ఉన్నాయని తెలిసింది. స్థానికంగాకూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ,తెలంగాణ బీసీ కమ్యూనీటిలో మీ కుటుంబం గురించి తెలియని వాళ్లంటూ ఎవ్వరు లేరు. అలాంటి మీరు జ్ఞానేశ్వర్ గారు ఎందుకు టీడీపీ జెండాను ఎత్తుకున్నారు..
    వీరేష్:- టీడీపీకి తెలంగాణ రాష్ట్రంలో బలమైన కార్యకర్తల నిర్మాణం ఉంది. కొందరు నాయకులు టీడీపీ పార్టీలో ఎదిగి వేరొక పార్టీలో చేరి టీడీపీని,టీడీపీ నాయకులను విమర్శిస్తున్నారు.సరే అది వారి విజ్ఞతకే వదిలివేస్తున్న .. జ్ఞానేశ్వర్ గారు బీసీ లకు రాజ్యాధికారం రావాలని పోరాడుతున్నారు, ఇప్పుడు రాజకీయాలు డబ్బు రంగు పులుముకున్నాయి,పేద, మధ్యతరగతి ప్రజలు రాజకీయంగా ఎదగాలంటే అవకాశాలు సన్నగిల్లాయి, అందుకే కాసాని జ్ఞానేశ్వర్ గారు ప్రజాసేవ చేయాలనుకునే నాయకులకు ఓ చక్కటి వేదికను సిద్ధం చేయాలనే సంకల్పంతో టీడీపీ భాద్యతలు చేపట్టడం జరిగింది. గతంలో టీడీపీ యువతకు,మహిళలకు బీసీ లకు పెద్దపీట వేసింది,అందుకే ఆ నమ్మకంతోనే టీడీపీ పార్టీలో చేరాం.
    ఆదాబ్ :- తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి.
    వీరేష్ :- గతంలో కంటే ఇప్పుడు టీడీపీ పరిస్థితులు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా బాగా మెరుగుపడ్డాయి..నిజానికి టీడీపీ వైఫల్యాలతో ఏనాడూ ఓడిపోలేదు .. ప్రజలు కొత్తవారికి అవకాశం ఇచ్చే నేపథ్యంలో అధికారానికి దూరం మయ్యింది. ప్రజలు రెండు తెలుగురాష్ట్రాల్లో ఇప్పుడున్న అధికార పార్టీల దూరాగతాలను గమనిస్తూనే ఉన్నారు.. ఏ గ్రామానికి వెళ్లిన టీడీపీ నాయకులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మేము అధికారానికి మాత్రమే దూరంగా ఉన్నాం ప్రజలకు కాదు.. 1982లో ఆ మహానేత స్వర్గీయ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. స్వల్పకాలంలోనే అప్పటికే బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని అనగదొక్కి రాజ్యాధికారాన్ని సొంతం చేసుకున్నారు. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ నాటి నుంచి నేటి వరకు సమాజానికి నిస్వార్ధంగా సేవ చేస్తూ వస్తుంది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో గాని ఎన్నికల సమయంలో టిడిపి ముందుగా ప్రకటించిన మేనిఫెస్టో అంశాలన్నిటిని నూటికి నూరు శాతం టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసింది. గతంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన ప్రస్తుతం భారత రాష్ట్రసమితి పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అన్నింటిని ముందుగానే టిడిపి అమలు చేసింది. సంక్షేమ కార్యక్రమాల రూపకల్పన తెలుగుదేశం తోటే ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ అంపశయ్య మీద లేదు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో ఇంకా చెరగని ముద్ర వేసుకుంది. ప్రత్యేక తెలంగాణ విడిపోయిన సమయంలో కూడా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఓటింగ్ ఎక్కడ చెదిరిపోలేదు. గత కొన్ని నెలల క్రితం ఖమ్మంలో చంద్రబాబు నాయుడు గారు , జ్ఞానేశ్వర్ గారు ఏర్పాటుచేసిన బహిరంగ సభకు ప్రజలు ఏ విధంగా పాల్గొన్నారో అందరికీ తెలిసిన విషయమే.
    ఆదాబ్ :- ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి, తెలంగాణలో భారత రాష్ట్ర సమితి పార్టీలు బలంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రజలు తెలుగుదేశాన్ని ఆదరిస్తారా.
    వీరేష్ :-ఆంధ్రప్రదేశ్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై ప్రజలు పూర్తిస్థాయిలో వ్యతిరేకంగా ఉన్నారు.. . అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ పరిపాలనపై ప్రజలు ఛీదరించుకుంటున్నారు.తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పరిపాలన జరిగిన క్రమంలో ఆర్థిక అసమానతలు లేకుండా ప్రజలందరికీ మౌలిక వసతులు కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వం సమయంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదు ప్రధానంగా లక్షల కోట్ల ఆర్దిక భారం పడనివ్వలేదు. ఇరు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో అక్రమాలు, దోపిడి తారా స్థాయికి చేరిపోయాయి. ప్రధానంగా కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతూనే ఉంది. ఎక్కడా కూడా నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం పర్సంటేజీల రూపంలో లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకోవడం రాష్ట్రాల్లో సహజంగా మారింది. ప్రశ్నించే వ్యక్తులపై వ్యవస్థపై దాడులు చేయడం అక్రమ కేసులు బనాయించడం ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం ఈ ప్రభుత్వాలకు అలవాటైపోయింది. ఇటువంటి తరుణంలో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గం వైపు ఆలోచిస్తున్నారు.ఆ మార్గం టీడీపీ కావాలని మేము కోరుకుంటున్నాం ..
    ఆదాబ్ :- తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఎలా ఉంది…ఆంధ్రప్రదేశ్ లో ఈ సారి అధికారం వస్తుందా..
    వీరేష్ :-తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.పార్టీని వీడిన నాయకులంతా స్వంత గూటికి వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితికి పూర్తిగా అనుకూల పవనాలు ఉన్న సమయంలోనే ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, అశ్వరావుపేట నియోజకవర్గాలను టీడీపీ కైవసం చేసుకుంది..
    పేదలకు పట్టెడన్నం పెట్టిన నాడే దేశానికి నిజమైన స్వాతంత్రం అన్న ఎన్టీఆర్ భావన ను చంద్రబాబు నాయుడు గారు అమలు చేశారు. పేదలకు మెరుగైన ఆరోగ్యకరమైన జీవన సౌకర్యాలను విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించి పేదరికం నుండి వారికి విముక్తి కల్పించారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే ఒకే ఒక్క సారి అధికారం ఇవ్వండి అంటూ గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కోలుకోలేని విధంగా అప్పుల వూబిలో నెట్టారు. జగన్ పరిపాలనపై ప్రజలు ఏమంటున్నారో ప్రచురణ మాధ్యమాల్లో చూస్తూనే ఉన్నాం ..
    ఆదాబ్ :-లోకేష్ యువగళం పాదయాత్ర పార్టీకి ఎంతవరకు లబ్ది చేకూర్చుతుంది, స్పందన ఎలా ఉంది…
    వీరేష్ :-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువనేత నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర పార్టీకి పూర్తిస్థాయిలో దోహదపడుతుంది. అధికార మధం తో ప్రశ్నించిన వ్యక్తులపై అక్రమ కేసులు బనాయించి దాడులకు పురుగల్పి రాక్షస ఆనందం పొందుతున్న వైసీపీ నాయకులు పెడుతున్న బాధలు భరించలేక వేలాదిమంది లోకేష్ పాదయాత్రలో వారి గోడు వెళ్ళబుచ్చుకునే ఉంటున్నారు. లోకేష్ ఆంధ్ర రాష్ట్రంలో చేపట్టిన పాదయాత్ర సూపర్ సక్సెస్ గా చెప్పుకోవచ్చు .. పార్టీ పూర్వ వైభవానికి దోహదపడుతుందన్నడంలో సందేహం లేదు.
    ఆదాబ్ :- పవన్ కళ్యాణ్ తో దోస్తీ మీకు కలిసివస్తుందా .. . బిజెపితో మీ పొత్తు ఎలా ఉండబోతుంది.
    తెలుగుదేశం పార్టీ విధి విధానాలు మ్యానిఫెస్టో ప్రజలందరికీ తెలిసిందే. రానున్న ఎన్నికల్లో అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ రెండు ప్రభుత్వాలను ఇంటికి పంపించేందుకు మేము ముందు వరుసలో నిలబడ్డాం . ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు బట్టి… స్థానిక అవసరాలను బట్టి పవన్ కళ్యాణ్ తో పొత్తు ఉంటుందా ఉండదా అనే విషయాన్ని పార్టీ పెద్దల సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీతో కూడా ఏ మేరకు పొత్తు అవసరమో అనే విషయంపై కూడా పార్టీ అందరూ కలిసి ప్రజల అవసరాల మేరకు నిర్ణయం తీసుకుంటాం.
    ఆదాబ్ :-తెలంగాణ రాజకీయాలలో ప్రస్తుతం టిడిపి పాత్ర ఎలా ఉండబోతుంది..
    వీరేష్:- కేసీఆర్,జగన్ ప్రభుత్వాల తీరుతో ప్రజలు ఎంత క్షోభకు గురవుతున్నారో నిత్యం మనం చూస్తూనే ఉన్నా… నాటి నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీపై ఏ ఒక్క చెడు ముద్ర పడలేదు. నూటికి నూరు శాతం ప్రజల కోసమే తపిస్తూ ప్రజలే దేవుళ్ళుగా స్మరిస్తూ సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది. ఖమ్మంలో టీడీపీ నిర్వహించిన సభ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీ గ్రాఫ్ ఎవరు ఊహించని విధంగా పెరిగిపోయింది. ఈ ఉమ్మడి రాష్ట్రంలో అధికారం చేపడుతామన్న ధీమాకు అప్పుడే వచ్చాము .
    ఆదాబ్ :-తెలంగాణలో ఒంటరీగానా, లేదా ఎవరితోనైనా కలిసి పోటీ చేసే అవకాశముందా…
    వీరేష్ :-ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ అభ్యర్ధులను బరిలోకిదింపడానికి సిద్ధంగా ఉంది. ఇక పొత్తులపై అధిష్టానం నాయకుల,కార్యకర్తల సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటుంది.మా సిద్ధాంతాలు నచ్చి మాతోపాటు కలిసి వస్తామంటే పోత్తులకు సిద్ధమే. దానికంటే ముందు అవినీతి అక్రమాలలో కూరుకుపోయిన కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దిదించే ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోలేము..
    ఆదాబ్ :-మీ విలువయిన సమయాన్ని మాకు కేటాయించనందుకు ధన్యవాదములు.
    వీరేష్ :- కృతఙ్ఞతలు ..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు