Saturday, July 27, 2024

భారమైన కేజీబీవీ సిబ్బంది బ్రతుకులు

తప్పక చదవండి
  • శ్రమ దోపిడీకి గురవుతున్న బోధనేతర సిబ్బంది
  • విద్యార్థినిలకు రక్షణ కల్పించడంలో వారిదే కీలకపాత్ర
  • వారానికి సెలవు కూడా లేని దుర్భర పరిస్థితులు
  • ఆర్టీసీ తరహాలో కేజీబీవీ సిబ్బందికి న్యాయం చేయాలి
    : పీిఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి వై. గీత
    వికారాబాద్‌ : బాలికల విద్య అభివృద్ధి, బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యంగా 2014లో ( కేంద్ర ప్రభుత్వం 60 శాతం , రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులతో) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో దేశవ్యాప్తంగా 5935 కేజీబీవీలు ప్రారంభించింది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో 475 కేజీబీవీలు కొనసాగుతున్నాయి. ఇందులో దాదాపు 7వేల మంది బోధనేతర సిబ్బంది పని చేస్తున్నారు. కేవలం మహిళా సిబ్బందిచే నడపబడుతున్నటువంటి కేజీబీవీలు నేడు బాల్యవివాహాలను నిర్మూలించి, బాలికల విద్య అభివృద్ధిలో దూసుకు పోతున్నప్పటికీ ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది యొక్క సమస్యలు వర్ణనాతీతంగా ఉన్నాయి.మండల కేంద్రానికి రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో ఎలాంటి రవాణా సౌకర్యం లేకుండా కేజీబీవీలు కొనసాగుతున్నాయి. ఇక్కడ విద్యార్థులకు సేవలు అందించడానికి రెండు రకాల సిబ్బంది పని చేస్తున్నారు. ఒకటి బోధన, రెండవది బోధ నేతర సిబ్బంది. ఈ మొత్తం సిబ్బంది కూడా కాంట్రాక్టు ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్నది మహిళా సిబ్బందే.
    శ్రమ దోపిడికి గురవుతున్న బోధ నేతర సిబ్బంది… ఇందులో బోధ నేతర సిబ్బంది మాత్రం ముమ్మాటికి శ్రమదోపిడికి గురవుతున్న పరిస్థితి కొనసాగుతుంది. వారాంతపు సెలవులు నోచుకోక ఎలాంటి పండుగ సెలవులు అమలు కాకుండా వెట్టి చాకిరి చేస్తున్నారు. కుక్సు, హెల్పర్స్‌ ,స్వీపర్‌ ,స్కావెంజరు, అటెండర్‌, డే అండ్‌ నైట్‌ వాచ్‌ ఉమెన్‌ మరియు ఏఎన్‌ఎం, క్రాఫ్ట్‌ , కంప్యూటర్‌, అకౌంటెంట్‌ ఉన్నారు. వీళ్లు అందిస్తున్న సేవలకు వీరు చేస్తున్న గొడ్డు చాకిరికి ప్రభుత్వాలు ఇచ్చే వేతనానికి అస్సలు పొంతనే లేదు.నాన్‌ టీచింగ్‌ వర్కర్స్‌ చేస్తున్న సేవలను,అదనపు పని భారాన్ని పెంచుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా కార్మికుల పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్నాయి.
    విద్యార్థినిలకు రక్షణ కల్పించడంలో కీలక పాత్ర… ఒక్క హాస్టల్లో రెండు మూడు వందల నుండి నాలుగు ఐదు వందల మంది వరకు విద్యార్థినీ లు కేజీబీవీ లల్లో చదువుకుంటున్నారు. ఇంతమంది బాలికలకు మహిళ వాచ్‌ ఉమెన్‌ ఉండి ప్రాణాలను పణంగా పెట్టి విద్యార్థినీలకు రక్షణ కల్పిస్తున్నారు. ఏదైనా అత్యవసరమైతే ఎలాంటి రవాణా సౌకర్యం ఉండదు. అనుకోని సంఘటనలు జరిగితే బోధ నేతర సిబ్బంది బలవుతున్నారు. సిసి కెమెరాలు నామమాత్రంగా ఉంటాయి. స్టోర్‌ ( కూరగాయలు, బుక్స్‌, బెడ్‌ షీట్స్‌ ) వచ్చినప్పుడు ఎంత బరువు ఉన్నా మహిళలే స్టోర్‌ రూమ్‌ కు మార్చాలి. కొన్ని సందర్భాల్లో గ్యాస్‌, పప్పు కుక్కర్‌ పేలినప్పుడు కార్మికులు గాయాలపాలైతే వారికి ఎలాంటి ఆరోగ్య భద్రత లేదు. పూరి ,చపాతి ఉన్న రోజుల్లో సిబ్బంది రెక్కలు ముక్క లు అవుతున్న పరిస్థితి ఉంది. స్వీపర్‌, స్కావెంజర్స్‌ రోజుకు రెండుసార్లు శుభ్రపరిచి విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండటం చేత పనితో విసిగిపోయి కడుపుకు అన్నం తినలేక పోతున్నారు. అటెండర్స్‌ పిల్లల కన్నా టీచర్ల కే ఎక్కువగా సేవలు చేయాల్సి వస్తుంది. టీచర్స్‌ అందరి టిఫిన్‌ బాక్సులు కడగాలని జాబ్‌ చాట్‌లో లేకపోయినా బలవంతంగా వారిచే టీచర్స్‌ టిఫిన్‌ బాక్సు లు కడిగించుకుంటున్నారు. వారానికి ఒకరోజు సెలవు తీసుకుం దామన్నా ఆదివారం రోజు కూడా బలవంతంగా డ్యూ టీలు చేయి స్తున్నారు. హాస్టల్‌ గ్రౌండ్‌ ఎక్కువగా ఉండడం చేత పెద్ద పెద్ద చెట్ల నుండి కుప్పలు కుప్పలుగా చెత్త చెదారం,గడ్డి పెరిగినప్పుడు వాటిని ఊడ్చి,శుభ్రం చేసిన కూలీలకు అయ్యే ఖర్చును కార్మికుల జీతాల నుండి వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.
    టిఏ,డిఏలు కూడా ఇవ్వని ప్రభుత్వం…. ఆఫీస్‌ పని మీద వెళ్లాల్సి వచ్చినప్పుడు కనీసం టి ఏ, డి ఏ లు కూడా ఇవ్వని పరిస్థితులు చాలా హాస్టల్లో కొనసాగుతూ ఉంది. అకౌంటెంట్స్‌ 13 రకాల రికార్డ్స్‌ మెయింటైన్‌ చేయాలి. కేజీబీవీ పని మీద ఎంఈఓ ,డిఈఓ ఆఫీసులకు తరచుగా వెళ్లాల్సి వస్తుంది. సొంతంగా ఖర్చులు పెట్టుకొని పోవాలి. టి ఏ, డి ఏ లు ఇవ్వడం లేదు. ఏఎన్‌ఎం లకు మూడు నైట్‌ డ్యూటీ లతో సగం జీవితం ఇక్కడే గడిచిపోతుంది. సెలవు పెట్టుకుని వెళ్లినప్పటికి, ఏదైనా అత్యవసరమైతే ఎక్కడున్నా వెంటనే పరిగెత్తుకు రావాల్సిందే.క్రాఫ్ట్‌ , కంప్యూటర్‌ లను పార్టు టైం అని చెపుతూనే వీరిచే పూర్తి కాలం పని చేయించుకుంటున్న పరిస్థితి ఉంది. వీరి వేతనం మాత్రం 7800 మాత్రమే. హాస్టల్లో సిగ్నల్‌ లేకపోతే ఇంటికి పోయిన తర్వాత కూడా జాబ్‌ వర్క్‌ చూసుకోవాల్సి వస్తుంది. ఇంకా అదనంగా (ఏఎన్‌ఎం, క్రాఫ్ట్‌ ,కంప్యూటర్‌ ,అకౌంటెంట్‌) అదనంగా లీజర్‌ పిరియడ్స్‌ కూడా చూసుకోవాలి.
    వారానికి ఒక సెలవు కూడా లేని దుర్భర పరిస్థితి…
    బాలికల విద్య అభివృద్ధి కోసం ఇంత చేస్తున్న బోధ నేతర సిబ్బందికి వారానికి ఒక సెలవు కూడా అమలు కాకపోవడం చాలా బాధాకరం. ఇంతే కాదు వీరికి పండుగలు, చావులు, పెళ్లిళ్లు పేరంటాలు ఉన్నప్పుడు సెలవు తీసుకోవడానికి యుద్ధం చేయాల్సి వస్తుంది. కనీసం పండగలు, సమ్మర్‌ హాలిడేస్‌ కూడా వీరికి అమలు కావు. రొటేషన్‌ బేస్‌ లో సెలవు రోజులలో కూడా వీళ్లు ఉద్యోగం చేయాల్సిందే. ఎనిమిది గంటలు పని చేయాలని చట్టం ఉన్నప్పటికీ వీరిచే 12 గంటలకు పైగానే పని చేయించుకుంటున్నారు. ఖాళీ అయిన పోస్టులు భర్తీ చేయకుండా ఉన్న సిబ్బందితోనే ఇబ్బంది పెట్టి పని చేపిస్తున్నారు. వయసు పైబడి పని చేయలేని స్థితిలో ఉన్నవారికి ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం లేదు. కేజీబీవీలో పని చేస్తూ మరణించిన వారికి మట్టి ఖర్చులకు కూడా ప్రభుత్వం ఆదుకోలేనటువంటి పరిస్థితి. వారికి వచ్చే జీతంలో దాదాపు మూడు వేలు రవాణా ఖర్చులకే పోతుంది. అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ శ్రమ కోర్చి కష్టం చేస్తున్న మహిళ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకొని న్యాయం చేయాలని కోటి ఆశలతో ఎదురుచూస్తున్న వారి జీవితాల్లో వెలుగులు నింపేలా ప్రభుత్వము ఆలోచించాలి.
    ఆర్టీసీ తరహాలో కేజీబీవీ సిబ్బందికి న్యాయం చేయాలి:- పిఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి వై. గీత
    ఆగస్టు 3 నుండి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో కేజీబీవీ నాన్‌ టీచింగ్‌ సిబ్బంది సమస్యలు చర్చించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఆలోపు వారంతపు సెలవులతో పాటు పండుగ సెలవులను అమలు చేయాలి. వారికి ఈఎస్‌ఐ, పిఎఫ్‌ సౌకర్యం కల్పించి హెల్త్‌ కార్డులు ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగులు గా గుర్తించాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపు 7,000 మంది మహిళ కార్మికులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు.దశల వారీగా అనేక ఆందోళనలు చేసి నప్పటికి ప్రభుత్వాలు మొండిగా,నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదు.కెజిబివి లలో విద్యార్థులను కంటికి రెప్పలా,కన్నపిల్లల్లా చూసుకుంటున్న నాన్‌ టీచింగ్‌ మహిళా వర్కర్స్‌ జీవితాలలో వెలుగులు నిందె ప్పుడు? ప్రభుత్వం ముఖ్యంగా, కేజీబివి లలో నాన్‌ టీచింగ్‌ మహిళా వర్కర్‌ లు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల,క్రమబద్దీకరణ జరగక, వేతనాలు పెరగక,పనిభారంతో అనేక అవస్థలు పడుతున్న మహిళా కార్మికుల పట్ల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గా,తోటి మహిళగా అభిమానాన్ని,ఆసరాను, ప్రేమను, మమకారాన్ని, మానవత్వాన్ని ప్రదర్శించాల్సిన, స్పందించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఫిబ్రవరి 3 నుండి అసెంబ్లీ సమావేశాల్లో నాన్‌ టీచింగ్‌ వర్కర్స్‌ కు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌ చేస్తున్నాం.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు