Friday, May 17, 2024

అంతర్జాతీయ చిత్రకళా రంగంలో తెలుగు సంతకం ఎస్వీ

తప్పక చదవండి

డాక్టర్‌ ఎస్వీ రామారావు పరిచయం అక్కరలేని ప్రపంచ ప్రఖ్యాత నైరూప్య చిత్రకారుడు. ఆధునిక చిత్రకళలో అంతర్జాతీయ ఖ్యాతి గడిరచిన మన తెలుగువాడు. నైరూప్య చిత్రకళలో సంపూర్ణ త్వాన్ని సాధించారు. నవ్యచిత్రకారుడే కాకుండా, కళా విమర్శ కుడు, వ్యాస రచయిత, కవిత్వంలో కూడా చేయితిరిగిన దిట్ట ఎస్వీ. తైలవర్ణంలో ఆయన గీసిన అద్వితీయమైన చిత్రాలు ఓ సంచలనం.రంగులు, ఆ రంగుల గీతల భాష తెలిసిన మేథావి. దానికితోడు పుస్తక పఠనంతో మేథోశక్తిని పొందారు. తత్వశా స్త్రాన్ని అధ్యయనం చేశారు. వివిధ సంస్కృతులను ఆకళింపు చేసుకున్నారు. వీటన్నిటి మేళవింపుతో రూపొందించినందునే ఎస్వీ చిత్రాలు ప్రపంచాన్ని ఆకర్షించాయి. ఆయన మద్రాస్‌ లో ఉన్న సమయంలో భారతి, మురళి,ఆంధ్రమహిళ, ఆంధ్రపత్రిక వంటి పత్రికలకు చిత్రకళతోపాటు వివిధ అంశాలపై వ్యాసాలు రాసేవారు. ఎస్వీ రామారావు 1936లో కృష్ణా జిల్లా గుడివాడలో శిరందాసు గంగయ్య, లక్ష్మయ్యలకు జన్మించారు.ఆయన పూర్తి పేరు శిరందాసు వెంకట రామారావు.12 ఏళ్ల వయసులోనే ఆయనకు చిత్రకళపై ఆసక్తి పెరిగింది. దానికి తోడు ఆ వయసులోనే ఆయనకు గుడివాడలోనే ప్రముఖ చిత్రకారుడు కె.వేణుగోపాల్‌ గురువుగా దొరికారు. ఆయన ప్రోత్సాహంతో చిత్రకళలో మెళకువలు తెలుసుకున్నారు. చిత్రాలు గీయడం పట్ల ఆసక్తిని పెంచుకున్న ఎస్వీని చూసి తండ్రి ఆందోళన చెందారు. తండ్రి కోరికమేరకు 1954లో బీకాం పూర్తి చేశారు. చరిత్రపై ఆసక్తితో బీఏ డిగ్రీ పూర్తిచేశారు. 1955 నాటికి చిత్రకళలో నాలుగు డిప్లొమాలు సంపాదించారు. కలకత్తాలోని శాంతినికేతన్‌ లో శిక్షణ పొందాలనుకున్నారు గానీ, అది సాధ్యంకాలేదు. చిత్రకళపట్ల కుమారుని ఆసక్తిని గమనించిన ఆయన తండ్రి గంగయ్య చివరకు మద్రాస్‌ లోని ఓ సినిమా సంస్థలో అసిస్టెంట్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌ గా చేర్పించారు. సినిమా ఆర్ట్‌ డైరెక్టర్‌ మాధవపెద్ది గోఖలే సలహాతో 6 ఏళ్ల గవర్నమెంట్‌ డిపార్ట్‌ మెంట్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ కోర్సు ఎంట్రన్స్‌ రాశారు. ఆ పరీక్షలో ఎస్వీ ప్రతిభను గుర్తించిన ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ అతనిని నేరుగా మూడవ సంవత్సరంలోకి ప్రవేశం కల్పించారు. అదే ఆయన జీవితంలో ఓ పెద్ద మలుపు. అక్కడ ఆయన నిష్ణాతులైనవారి వద్ద వివిధ రీతుల చిత్రకళలలో మెళకువలు నేర్చుకున్నారు. వాటర్‌ , ఆయిల్‌, టెంపేరా కలర్స్‌ లో చిత్రాలు గీసేవారు.పెద్దలతో పోటీపడిమరీ బొమ్మలు గీయడం మొదలుపెట్టారు. జాతీయ స్థాయి పోటీలలో విజేతగా నిలిచారు. దేశంలో చాలా మ్యూజియంలవారు ఎస్వీ చిత్రాలను కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. అప్పట్లో సాహిత్యంలో, చిత్రకళలో పెన్‌ నేమ్‌ వాడటం ఫ్యాషన్‌ గా ఉండేది. ఆ ప్రభావంతో ఎస్వీ కూడా ‘ఆర్యదేవ’ పేరుతో చిత్రాలు గీసేవారు. ఆయన భారత్‌ లో ఉన్నంత కాలం ఆ పేరుతోనే చిత్రీకరించారు. మద్రాస్‌ మ్యూజియం, కేరళ మ్యూజియం, ఢల్లీిలోని నేషనల్‌ గ్యాలరీ ఆఫ్‌ మోడరన్‌ ఆర్ట్‌, హైదరాబాద్‌లోని సాలార్‌ జంగ్‌ మ్యూజియంలలో ఆయన చిత్రాలు ఆర్యదేవ పేరుతోనే ఉన్నాయి. కామన్‌ వెల్త్‌ దేశాల చిత్రకారులతో పోటీపడి కామన్‌ వెల్త్‌ ఫెలోషిప్‌ సాధించారు. అన్ని దేశాలకు కలిపి ఇచ్చే ఒకే ఒక ఫెలోషిప్‌ పొంది ఆధునిక చిత్రకళను అధ్యయనం చేయడానికి 1962లో ఎస్వీ రామారావు లండన్‌ వెళ్లారు. అక్కడ లండన్‌ యూనివర్సిటీకి చెందిన స్లేడ్‌ స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ లో 1965లో కోర్సు పూర్తి చేశారు. లితోగ్రఫీ ఆర్ట్‌ లో ఎస్వీ దిట్ట. అందులో కొత్తపుంతలు తొక్కారు. లితోగ్రఫీ ఆర్ట్‌ లో మాస్టర్‌ గా లండన్‌ లో పేరుగడిరచారు. 1965లో లితోగ్రఫీ ఆఫ్‌ ద ఇయర్‌ గా నిలిచారు. ఎస్వీని ‘గాడ్‌ గివెన్‌ కలరిస్ట్‌’ అని విమర్శకులు కొనియాడారు. అప్పుడే ఆయన చిత్రకళను ప్రశంసిస్తూ లండన్‌ టైమ్స్‌ కూడా రాసింది. లండన్‌ వెళ్లినప్పటి నుంచి ఆయన తన పేరుతోనే చిత్రాలు గీయడం మొదలుపెట్టారు. ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారులు పికాసో, డాలి వంటి వారి చిత్రాల సరసన ఎస్వీ రామారావు చిత్రాలకు స్థానం లభించింది. 1965లో కామన్‌ వెల్త్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ లో‘ఈ ఏడాది మేటి చిత్రకారుడు’ వంటి అంతర్జాతీయ అవార్డులు, 2001లో పద్మశ్రీ వంటి జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత అనేక దేశాలలో పర్యటించారు. తన చిత్రకళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఆయన వెయ్యికి పైగా చిత్రాలు గీశారు. ఒక చిత్రాన్ని ఒకేసారి గీస్తారు. ఒకేసారి అమ్ముతారు. దానిని ప్రింట్లు తీసి అమ్మరు. అదే ఆయన ప్రత్యేకత. 50 ఏళ్లుగా అమెరికాలోని చికాగోలో ఉంటున్నారు. కుటుంబం అమెరికాలో ఉంటున్నప్పటికీ ఆయన తరచూ భారత్‌ వస్తుంటారు. ఢల్లీి, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలలో ఉంటుంటారు. ఒక్కోసారి ఎక్కువ కాలం ఇక్కడే ఉండి చిత్రాలు గీస్తుంటారు. 2008 నుంచి 2015 వరకు ఢల్లీిలోనే ఉండి, అనేక బొమ్మలు గీశారు. ఢల్లీి, ముంబై, చెన్నై, కోల్‌ కతా తదితర నగరాలలో తన చిత్రకళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలోని సూర్య భగవానుడంటే ఆయనకు నమ్మకం ఎక్కువ. భారత్‌ వచ్చిన ప్రతిసారీ అక్కడకు వెళ్లి వస్తుంటారు. మొదట అమెరికాలోని ఒహాయో రాష్ట్రం సిన్సనాటిలో యూనివర్సిటీ ఆఫ్‌ సిన్స నాటిలో టీచింగ్‌ అసిస్టెంట్‌ గా పని చేశారు. కెంటకీ రాష్ట్రం బౌలింగ్‌ గ్రీన్‌ లోని వెస్ట్రన్‌ కెంటకీ యూనివర్సిటీలో ఫ్రొఫెసర్‌ ఆఫ్‌ ఆర్ట్‌ గా చేసి పదవీవిరమణ చేశారు. పుస్తకాలు చదవడానికి అలవాటుపడిన ఆయన చిత్రకారుడైనా లైబ్రరీ సైన్స్‌ పై మక్కువతో టెన్నెసీ రాష్ట్రం నేషవిల్‌ సిటీలోని వేండర్‌ బిల్ట్‌ యూనివర్సిటీలో లైబ్రరీ సైన్స్‌ లో మాస్టర్‌ డిగ్రీ పూర్తి చేశారు. 1980 నుంచి చికాగోలోనే ఉంటున్నారు. రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం 5 నిమిషాలు మాత్రమే అపాయింట్‌ మెంట్‌ ఇచ్చి, ఆయనతో ఆ కొద్ది సమయం మాట్లాడిన తర్వాత ఆ రోజంతా తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని ఆయనతోనే గడిపారు. రాష్ట్రపతి భవన్‌ ను తనే దగ్గరుండి చూపించారు. అంతేకాకుండా పార్లమెంట్‌ లో ఆయన గురించి రాష్ట్రపతి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అది ఎస్వీకి దక్కిన గొప్పగౌరవం. అన్ని శాస్త్రాలకంటే సాహిత్యం ద్వారానే మనిషి సంపూర్ణుడవుతాడని ఎస్వీ రామారావు చెప్పారు. తెలియనిది తెలుసుకుంటూ, తనకు ఇష్టమైన రీతిలో రంగులను ఉపయోగిస్తానన్నారు. నవ్యచిత్రకళ విశ్వజనీనం అని, ఈ చిత్రకళలో రూపానికంటే రంగుకే ప్రాధాన్యం అని వివరించారు. చిత్ర విచిత్రమైన రంగుల ఇంద్రజాలం ద్వారా విశిష్ట కాంతులను సృష్టించటం అందులోని విలక్షణత. నవ్య చిత్రకళ వాస్తవ వాదానికి చెందదని, సహజరూపాన్ని బ్రద్దలుకొట్టి అందులోని ప్రాథమిక రూపాన్ని విశ్లేషణ పద్దతిలో చిత్రించటమే ఇందులోని ప్రధాన లక్షణం అని ఎస్వీ రామారావు చెబుతారు. చిత్రకళ ద్వారా తెలుగు ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేసిన ఎస్వీ రామారావును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ జీవితసాఫల్య పురస్కారం-2023కు ఎంపిక చేసింది. నవంబరు 1న విజయవాడలో ఆయనకు ఈ అవార్డు అందజేస్తారు.
– శిరందాసు నాగార్జున, 9440222914

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు