Monday, April 29, 2024

శ్రీశైలంలో కుమారస్వామికి విశేష పూజలు..

తప్పక చదవండి
  • 29న మల్లిఖార్జున స్వామికి సహస్రఘటాభిషేకం!

లోక కల్యాణం కోసం షష్టి సందర్భంగా శ్రీశైలం దేవస్థానం పరిధిలో శనివారం ఉదయం శ్రీ సుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి)కి విశేష పూజలు నిర్వహించారు. ప్రతిమంగళవారం, కృతికా న‌క్షత్రం, షష్టి తిథి రోజుల్లో శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి విశేష అభిషేకం, పూజాధికాలు దేవస్థానం అర్చకులు, పండితులు నిర్వహిస్తారు. కుమార స్వామికి పూజలు జరుపడంతో లోక కల్యాణమే కాకుండా ప్రతి ఒక్కరికీ ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో ఆటుపోట్లు తొలిగి పోయి ఆయాపనులు సక్రమంగా సాగుతాయి. సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో శత్రుబాధలు, గ్రహపీడలు, దృష్టి దోషాలు తొలగుతాయి. సంతానం కోసం పూజలు చేసేవారికి సంతాన భాగ్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.ఈ అభిషేకానికి ముందుగా దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, పాడి సమృద్ధిగా ఉండాలని, జనులకు ఆయురారోగ్యాలు కలిగి, వారికి అకాల మరణాలు సంభవించకుండా చూడాలని, దేశంలో అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు జరక్కుండా ఉండాలని, జనులంతా సుఖ శాంతులతో ఉండాలంటూ అర్చక స్వాములు సంకల్పం పఠించారు. అటుపై కార్యక్రమం నిర్విఘ్నంగా సాగేందుకు మహా గణపతి పూజ చేశారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం, అర్చన తర్వాత సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణాలు చేశారు. సుబ్రహ్మణ్య స్వామిలో అభిషేకంలో స్వామి వారికి పంచామృతాలైన పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీళ్లు, వివిధ పండ్ల రసాలైన దానిమ్మ, కమల, ద్రాక్ష, అరటి ఫలాలతో అభిషేకాలు నిర్వహించారు. వివిధ పళ్ల రసాలతో అభిషేకంతో ఎంతో ఫలితంగా ఉంటుందని ఆగమశాస్త్ర పురాణాలు చెబుతున్నాయి.

సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండి రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలన్న సంకల్పంతో ఈ నెల 29న తొలి ఏకాదశి నాడు శ్రీ మల్లిఖార్జున స్వామికి సహస్రఘటాభిషేకం నిర్వహిస్తామని శ్రీశైల దేవస్థానం ప్రకటించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 27 నుంచి 29 వరకు జప పారాయణాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా రుద్ర పారాయణాలు, విరాట పర్వ పారాయణాలు, వారుణానువాక పారాయణాలు, కాఠక పారాయణాలు, పంచాక్షరీ జపం, రుష్యశ్రుంగ జపం, వరుణ జపం నిర్వహిస్తారు.

- Advertisement -

27 ఉదయం గణపతి పూజ, రుత్విగ్వరణం, పుణ్యాహవచనం, మండపారాధన, కలశ స్థాపన కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత జప పారాయణాలు ప్రారంభిస్తారు. 29 ఉదయం రుద్రహోమం కూడా నిర్వహిస్తారు. దేవస్థానం అర్చక స్వాములు, వేద పండితులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే 16 మంది రుత్వికులు ఆయా కార్యక్రమాలు చేస్తారు.

సహస్ర ఘటాభిషేకం సందర్భంగా ఈ నెల 29న అన్ని అర్జిత సేవలు కూడా నిలిపేస్తారు. సహస్రఘటాభిషేకం కోసం 28 రాత్రి దర్శనాలు ముగిసిన తర్వాత స్వామి వారి గర్భాలయ ద్వారం వద్ద తాత్కాలిక గోడ నిర్వహిస్తారు. 29 ఉదయం తొమ్మిది గంటల నుంచి 12 గంటల వరకు ఘటాభిషేకం జరిపిస్తారు. 29న సహస్రఘటాభిషేకం ప్రారంభం అయ్యే వరకు ఉదయం తొమ్మిది గంటల వరకు భక్తులకు అమ్మవారి దర్శనం మాత్రమే జరుగుతుంది. సహస్రఘటాభిషేకం వల్ల ఆ రోజంతా స్వామి వారు ఘటాభిషేక జలంలోనే ఉంటారు. 30 వేకువ జామున మంగళవాయిద్యాలకు ముందుగా ఘటాభిషేక జలం తొలగించి యథావిధిగా ఆలయ కైంకర్యాలు నిర్వహిస్తామని దేవస్థానం వెల్లడించింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు