Saturday, May 18, 2024

కొచ్చి కన్వెన్షన్ సెంటర్ లో బాంబు పేలుళ్లు

తప్పక చదవండి
  • వరుసగా మూడుచోట్ల పేలుడు.. ఒకరు మృతి
  • 40 మందికి పైగా క్షతగాత్రులు
  • ఆ సమయంలో 2 వేల మంది ఉన్నారన్న పోలీసులు

కేరళ : కేరళలోని కొచ్చి నగరాన్ని పేలుళ్లు వణికించాయి. సిటీలోని క్రిస్టియన్ కన్వెన్షన్ సెంటర్ లో మూడు చోట్ల బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి.. ఉదయం 9.30 గంటలకు తొలి పేలుడు సంభవించగా.. కొద్ది వ్యవధిలోనే రెండు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. కలమసేరి కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. మరో 35 మంది గాయపడ్డారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వీరికి ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది. క్షతగాత్రుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. పేలుళ్ల తర్వాత కన్వెన్షన్ సెంటర్‌లో మంటలు చెలరేగాయి. పేలుళ్ల సమయానికి కన్వెన్షన్ సెంటర్‌లో 2 వేల మందికిపైగా ఉన్నట్టు తెలుస్తోంది. అటు, ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. క్రిస్టియన్ ప్రార్థనా మందిరాన్ని టార్గెట్ చేసుకుని.. బాంబు పేలుళ్లకు పాల్పడటంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ఇందులో ఉగ్రవాదం కోణం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గాజాపై ఇజ్రాయేల్ దాడులను వ్యతిరేకిస్తూ కేరళలో నిర్వహించిన ర్యాలీలో హమాస్ మాజీ కమాండర్ విర్చువల్‌గా పాల్గొనడం.. అది జరిగిన కొద్ది గంటల్లోనే క్రైస్తవుల ప్రార్థనా మందిరంలో పేలుళ్లు చోటుచేసుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ ర్యాలీకి.. ఈ పేలుళ్లకు సంబంధం ఉందా? అనే కోణంలోనూ విచారణ చేపట్టారు. ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో క్రైస్తవులు ప్రార్ధన కోసం కలమసేరిలోని జమ్రా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌కు వచ్చారు. ఈ సమయంలో పేలుళ్లు చోటుచేసుకున్నాయి. పేలుళ్లలో గాయపడిన బాధితులను చికిత్స కోసం కలమసేరి ఆస్పత్రిలో చేర్పించారు. పెద్ద సంఖ్యలో బాధితుల చేరడంతో వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి కేరళ ప్రభుత్వం సెలవులు రద్దుచేసింది. సెలవులో ఉన్నవారు తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించింది. కొట్టాయం మెడికల్ కాలేజీ నుంచి కాలిన గాయాలకు చికిత్స చేసే వైద్య బృందాన్ని వెంటనే కలమస్సేరి మెడికల్ కాలేజీకి చేరుకోవాలని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఆదేశాలు జారీ చేశారు.

సీఎం విజయన్ తో మాట్లాడిన అమిత్ షా
ఈ పేలుడు ఘటన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేరళ సీఎం పినరయి విజయన్ తో మాట్లాడారు. పేలుడు ఘటన, అనంతర పరిస్థితులపై సమీక్ష చేశారు. ఘటన వివరాలను సీఎం విజయన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలియజేశారు. పేలుడు ఘటన నేపథ్యంలో ఎన్ఐఏ, ఎన్ ఎస్ జీ బృందాలను కేంద్రం కేరళకు పంపింది. ఐఈడీ పదార్థాలను టిఫిన్ బాక్సులో కూర్చి పేలుళ్లకు పాల్పడినట్టు గుర్తించారు.

- Advertisement -

బాంబు అమర్చింది నేనే..!
కన్వెన్షన్ సెంటర్లో బాంబు పేలుళ్లకు తానే బాధ్యుడినని పేర్కొంటూ త్రిశూర్కు చెందిన ఓ వ్యక్తి పోలీసుల ముందు లొంగిపోయాడు. కలమస్సేరీలో బాంబు అమర్చింది తానేనని చెప్పినట్లు సమాచారం. దీంతో అతడిని పోలీసులు పూర్తిస్థాయిలో విచారిస్తున్నారు. ఆ బాంబు పేలుళ్లకు ఇతడికి నిజంగా సంబంధం ఉందా..? అన్న విషయంపై పోలీసులు ఇంకా ఓ నిర్ధారణకు రాలేదని తెలుస్తోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు