Wednesday, May 15, 2024

గెలుపు ఏకపక్షమే..!

తప్పక చదవండి
  • రాజేష్‌రెడ్డి విజయం లాంఛనం
  • కందనూలులో హస్తం హవా
  • కలిసొస్తున్న కాంగ్రెస్‌ గాలి
  • కూచుకుళ్ల వైపు మొగ్గుతున్న ప్రజానీకం

కందనూలులో కాంగ్రెస్‌ విజయం ఏకపక్షంగా కనిపిస్తోంది. ఎంఎల్‌సీ కూచుకుళ్ల దామోదర్‌ రెడ్డి తనయుడు, కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్‌ రాజేష్‌ రెడ్డి గెలుపు లాంఛనంగా మారగా, మెజార్టీ దిశగా ప్రచార పర్వం సాగుతున్నట్లుగా స్పష్టమౌతోంది. దీంతో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత హస్తం జెండా ఎగిరే పరిస్థితులు ఉన్నట్లుగా తెలుస్తోంది. కందనూలులో కాంగ్రెస్‌ గెలుపు ఏకపక్షం…? అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్‌ రాజేష్‌ రెడ్డి గెలుపు దిశగా ప్రచారం జోరుగా సాగుతోంది. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న ఎంఎల్‌సీ కూచుకుళ్ల దామోదర్‌ రెడ్డి వెనకుండి తనయుడి గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌లో వెన్నుపోటు ద్రోహాలతో ఓటమి పాలైన దామోదర్‌ రెడ్డి ఈసారి పక్కా వ్యూహంతో ఎన్నికల వ్యూహం రచిస్తున్నారు. దీంతో తెలకపల్లి మండలంలో పలువురు ముఖ్య నాయకులు కాంగ్రెస్‌లో చేరడంతో కాంగ్రెస్‌ మెజార్టీ సాధించే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక బిజినేపల్లి, నాగర్‌కర్నూల్‌ మున్సిపాల్టీ, రూరల్‌లోనూ కాంగ్రెస్‌కు మంచి బలం కలిగింది. తాడూరు, తిమ్మాజిపేటలోనూ వీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పోటాపోటీగా ఉన్నాయి. ఇటీవల నిర్వహించిన కాంగ్రెస్‌, రాజేష్‌ రెడ్డి నిర్వహించిన సర్వేల్లో ఇదే స్పష్టమైనట్లుగా తెలిసింది. కాగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వ్యతిరేకత, నియోజకవర్గంలో జరిగిన నల్లమట్టి, ఇసుక, రియల్‌ మాఫియాలు, అభివృద్ధి పేరుతో అక్రమాలు జరిగాన్న ఆరోపణలు కాంగ్రెస్‌కు కలిసి వస్తున్నాయి. ఈ అంశాలు స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్థన్‌ రెడ్డికి ప్రతికూలంగా మారాయి. నియోజకవర్గంలో ఒక్క పెద్దముద్దునూరులో కేవలం 80ఇండ్లు తప్ప ఎక్కడా డబుల్‌ బెడ్రూం ఇండ్లు ఇవ్వలేదు. దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు, గృహలక్ష్మి పథకాలు ఊరికి ఒక్కరికి కూడా దక్కలేదు. దీనికితోడుగా స్థానికంగా బీఆర్‌ఎస్‌ నాయకుల తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిరది. ఎమ్మెల్యే మర్రి మాట తీరు కూడా క్యాడర్‌లో అసంతృప్తికి చోటిచ్చింది. ఇందులో భాగంగానే తాజాగా తెలకపల్లి ఎంపీపీ మధు, పలువురు ముఖ్య నాయకులు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు.

ఈ క్రమంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కూచుకుళ్ల కుటుంబానికి సౌమ్యులు, నిజాయితీపరులనే అంశాలు సానుకూలంగా మారాయి. ఒక్క ఛాన్స్‌ పేరిట ప్రజలు కూచుకళ్ల వైపు మొగ్గు చూపుతారన్న చర్చ జరుగుతోంది. జనసేన పోటీలో ఉన్న ప్రధాన పోటీ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్యే నెలకొంది. ఇటీవల పోస్టల్‌ బ్యాలెట్‌లో 90శాతం ఓట్లు కాంగ్రెస్‌కే పడ్డాయనే మాటలు కాంగ్రెస్‌లో ఉత్తేజం కలిగిస్తున్నాయి. ఇక కాంగ్రెస్‌ ఆరు అంశాలతో కూడిన మేనిఫెస్టో ప్రజలను ఆకట్టుకుంది. గడప గడపకు కాంగ్రెస్‌ పేరిట ప్రజల్లోకి వెళ్లే క్రమంలో రాజేష్‌ రెడ్డికి (గ్రామాల నుంచి ఊహించని స్పందన వస్తోంది. వందలాది మంది స్వాగతిస్తూ రాజేష్‌ రెడ్డిని గెలిపిస్తామంటూ హామీ ఇస్తున్నారు. దీనికితోడుగా బిజినేపల్లిలో నిర్వహించిన విజయశంఖారావం సభ విజయవంతమైంది. సీఎం కేసీఆర్‌ నిర్వహించిన సభకు మించి దాదాపుగా 50వేల మంది తరలిరావడంతో నియోజకవర్గ కాంగ్రెస్‌లో గెలుపు వాతావరణం ఏర్పడిరది. గ్రామాలు, పట్టణంలో ఎక్కడ చూసినా రాజేష్‌ రెడ్డి గెలుపు ఖాయమనే ప్రచారమే జరుగుతోంది. కాగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ గెలుపు తథ్యమనే సంకేతాలు నియోజకవర్గంలోనూ కాంగ్రెస్‌కు కలిసి వస్తున్నాయి. తటస్థ ఓటర్లు సైతం కాంగ్రెస్‌ వైపు మొగ్గుచూపే పరిస్థితులు ఏర్పడ్డాయి. మొత్తం మీద కందనూలులో ముప్పై ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌ జెండా ఎగరబోతోందని ఆ పార్టీ శ్రేణులు ముందే సంబురాలు చేసుకుంటున్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు