Thursday, September 12, 2024
spot_img

పార్టీల చూపు బీసీల వైపు

తప్పక చదవండి
  • కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత మారిన రాజకీయ ముఖచిత్రం
  • బీసీలకు గాలం వేసే పనిలో అన్ని ప్రధాన పార్టీలు
  • వ్యూహ, ప్రతి వ్యూహాలతో సిద్దమవుతున్న ప్రణాళికలు
  • కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ, టీడీపీల యాక్షన్‌ ప్లాన్‌ రెడీ
  • తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే ప్రధాన లక్ష్యంగా పావులు
  • తెలంగాణలో దాదాపు 56 శాతం బీసీలు
  • గాలమేసేందుకు పథకాలు రచిస్తున్న పార్టీలు
    (వాసు, పొలిటికల్‌ కరస్పాండెంట్‌)
    హైదరాబాద్‌ : కర్నాటక ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణ కాంగ్రెస్‌లోకి ఇతర పార్టీల నేతలు చేరడం ఊపందుకుంది. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి సస్పెండైన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఆరు నెలల ఊగిసలాట అనంతరం కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు.రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని చిన్నా, చితకా నేతలు కూడా ఇపుడు కాంగ్రెస్‌ పార్టీ వైపు చూస్తున్నారు. చేరికల విషయంలో ప్రత్యేకంగా ఓ మాజీ మంత్రి స్థాయి నాయకుడిని ఇంఛార్జీగా నియమించుకున్న భారతీయ జనతా పార్టీ మాత్రం చేరికల విషయంలో వెనుకబడిరదనే చెప్పాలి. గతంలో బీజేపీ హైప్‌ చూసి ఆ పార్టీలో చేరిన నాయకులు ఇప్పుడు ఒక్కొక్కరిగా ఆ పార్టీని వీడే ఆలోచనలు చేస్తున్నట్లు కథనాలు జోరందుకున్నాయి. కొత్త చేరికలను అటుంచితే ఉన్న వారిని కాపాడుకోవడం ఇప్పుడు ఈటల రాజేందర్‌ కు పెను సవాలుగా మారింది. ఎన్నికలు ఈ ఏడాది చివరిలో జరుగుతాయన్న నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ తాము గత తొమ్మిదిన్నరేళ్ళలో చేపట్టిన పథకాలను, చేసిన అభివృద్ధిని చూపుతూ సభలు, సమావేశాలు నిర్వహింస్తుండగా .. విపక్ష కాంగ్రెస్‌, బీజేపీలు, టీటీడీపీలు మాత్రం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే కార్యక్రమాలు చేపడుతున్నాయి.
    నాయకులను కాపాడుకోవడం కమలనాథులకు తలనొప్పిగా మారింది.. :.
    ఎమ్మెల్యే రాజాసింగ్‌ బీజేపీఫై విసుగు చెందినట్లు కనిపిస్తోంది. ఇటీవల ఆయన ఆర్థిక, ఆరోగ్య మంత్రి హరీశ్‌ రావును కలువడం తీవ్ర చర్చకు దారి తీసింది. రాజాసింగ్‌ బీజేపీని వీడి బీఆర్‌ఎస్‌ లో చేరుతున్నారన్న కథనాలు వెలువడడంతో ఈ కథనాలపై స్పందించిన ఈటల రాజేందర్‌.. రాజాసింగ్‌ ఇంటికి వెళ్లి మరీ బుజ్జగించారు. ఈ సందర్భంగా రాజాసింగ్‌ను గోషామహల్‌ నియో జకవర్గాన్ని వదిలేసి.. జహీరాబాద్‌ ఎంపీగా బరిలోకి దిగాలన్న ప్రతిపాదనకు అంగీకరిస్తే సస్పెన్షన్‌ ఎత్తివేతకు తాను చొరవ తీసుకుంటానని రాజేందర్‌ చెప్పినట్లు వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుతానికి బీజేపీలోకి చేరే కొత్త నాయకులు ఎవ్వరు కనిపించడం లేదు. ఇది అటుంచి.. ఉన్న నాయకులను కాపాడుకోవడం ఇపుడు కమలనాథులకు గగనమైపోతున్న పరిస్థితి ఏర్పడిరది. ఈ క్రమంలో పార్టీలో ఊపు తెచ్చేందుకు, శ్రేణులను పోరాటానికి సమాయత్తం చేసేందుకు టీ.బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి వ్యూహరచన ప్రారంభించారు.
    రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలకు సిద్దమైన పార్టీలు :
    కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత స్తబ్ధుగా మారిన బీజేపీ శ్రేణుల్లో మొన్నటి వరంగల్‌ మోడీ సభ ఇచ్చిన కిక్కు కంటే హైదరాబాద్‌ వేదికగా కిషన్‌ రెడ్డి చేసిన పోరాటం ఎక్కువ ఉత్సాహాన్నిచ్చిందని పార్టీ శ్రేణులు చెప్పుకోవడం విశేషం. ఇదే టెంపోని కొనసాగిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలను ముమ్మరం చేయాలని కమలనాథులు భావిస్తున్నారు. ఇక అటు కాంగ్రెస్‌ నేతల్లోనూ కదనోత్సాహం రోజురోజుకూ ఇనుమడిస్తోంది. జులై 19న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఇంట్లో సమావేశమైన టీ.కాంగ్రెస్‌ నేతలు ఎన్నికల దిశగా అనుసరించాల్సిన వ్యూహాన్ని దాదాపు ఖరారు చేశారు. విడతల వారీగా, రాష్ట్ర స్థాయి కీలక నేతలు బస్సు యాత్రలు నిర్వహించాలని తీర్మానించారు. ఈలోగా పార్టీలో చేరేందుకు సిద్దమైన వారిని చేర్చుకోవడంపై దృష్టి సారించారు.
    బీసీ ఓటు బ్యాంకును కొల్లగొట్టేపనిలో టీటీడీపీ :
    కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ టీటీడీపీ బాధ్యతలు చేపట్టాక తెలంగాణాలో టీడీపీ జోరు పెరిగింది. దీంతో గ్రామాల్లో, పట్టణాల్లో ప్రధాన పార్టీలలో ప్రతినిత్యం దొరకని నాయకులంతా టీడీపీ పంచన చేరిపోయారు. ఇప్పటికిప్పుడు టీడీపీ అధికార పక్షాన్ని కట్టడి చేయలేకపోయినా.. బీసీ స్లోగన్లతో ముందుకుసాగుతున్న టీటీడీపీతో తమకు ప్రమాదం పొంచివుందని అధికారపార్టీ నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ కమ్మూనిటీలో ఒక బలమైన నేత.. ఆయన టీడీపీలో చేరిపోవడంతో ఆ కమ్యూనిటీ నాయకులపైనా ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు అయన ముదిరాజులను పెద్దఎత్తున పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. వారికీ అగ్రతాంబూలం ఇస్తామని ప్రకటిస్తున్నారు. ఇటీవల టీడీపీ జాతీయ కార్యదర్శిగా నియమితులయిన కాసాని వీరేష్‌ ముదిరాజులను ఏకం చేసేపనిలో పడ్డారు. ముదిరాజులందరూ సంఘటితమై పోరాడాలని పిలుపునిస్తున్నారు. ముదిరాజులు జనాభాలో 19 శాతం ఉన్నారని పేర్కొన్న అయన కలిసి మెలిసి ఐకమత్యముగా ఎన్నికలకు వెళితే గెలుపు నల్లేరుపై నడకలాంటిదేనని అయన చెబుతున్నారు. త్వరలో బీసీలను ఐక్యం చేసేందుకు టీడీపీ బస్సు యాత్రను చేపట్టనున్నట్లు వీరేష్‌ తెలిపారు. ఆ తరువాత రాష్ట్రంలో సంచలన మార్పులు సంభవిస్తాయని ఆయన స్పష్టం చేశారు.
    పార్లమెంటు సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన నాయకులు :
    జులై 20 పార్లమెంటు సమావేశాల ప్రారంభం సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తదితరులు ఢిల్లీ వెళ్ళారు. నెలాఖరులో ప్రియాంక పర్యటనను ఖరారు చేయడం ఇపుడు ఈ కాంగ్రెస్‌ బృందం ముందున్న తక్షణ కర్తవ్యమని గాంధీభవన్‌ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ప్రియాంక సభ ఖరారైతే పార్టీలో చేరే వారి జాబితాకు తుది రూపు ఇవ్వాలన్నది టీపీసీసీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇదంతా ఇలా కొనసాగుతుండగా ఇటు కాంగ్రెస్‌, అటు బీఆర్‌ఎస్‌ పార్టీలకు చెందిన ఓబీసీ నేతలు ప్రత్యేకంగా భేటీలు నిర్వహిస్తూ వుండడం ఆసక్తి రేపుతోంది. కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఇంట్లో కీలక నేతలంతా భేటీ అయిన సందర్భంలోనే అటు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన బీసీ నేతలు వి.హనుమంతరావు సారథ్యంలో భేటీ అయ్యారు. పార్టీలో బీసీలకు ప్రాధాన్యత మరింత పెంచాలని డిమాండ్‌ చేశారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు