- వీరముష్టి కాలనీలో ప్రభుత్వ భూమి కబ్జా..
- ఎఫ్‌టీఎల్ లో నిర్మాణాలు.. ఛరీష్ ఫౌండేషన్ ల్యాండ్ స్వాహా..
- రూ. 5 లక్షలు తీసుకొని ఇంటి నెంబర్ అలార్ట్
- మేడిపల్లిలోని సర్వే నెం. 101, 102 ప్రభుత్వ స్థలం కబ్జా…
- ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న పీర్జాదిగూడ మున్సిపల్ పాలకులు
- కోట్ల రూపాయలు వెచ్చించి వీధి మార్కెట్ల నిర్మాణం, చెరువుల సుందరీకరణ
- మూడు సంవత్సరాలు దాటినా లబ్దిదారులకు కేటాంచకుండా కాలయాపన..
- పలు కారణాలు చెప్పి కట్టిన మార్కెట్ కూల్చివేతలు..
మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ లో పలు ప్రాంతాలలో ముందు చూపు లేకుండా కేవలం కమీషన్ల కోసమే మేయర్ జక్కా వెంకట్ రెడ్డి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. మేడిపల్లి మున్సిపాలిటీలోని వీరముష్టి కాలనీలో ప్రభుత్వ స్థలం, సర్వే నెం. 101, 102 సర్కారి స్థలాన్నికబ్జాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.. అదే విధంగా సాయి ప్రియ సీలింగ్ కు రూ. 5 లక్షలు తీసుకొని ఇంటి నెంబర్ కేటాయించినట్లు కూడా బహిరంగ విమర్శలు కూడా ఉన్నాయి. ఇకపోతే మున్సిపల్ పరిధిలో పలు ప్రాంతాలలో మూడు సంవత్సరాల క్రితం ఒక్కో వీధి కూరగాయల మార్కెట్ కు దాదాపు రూ. 20 లక్షలకు పైగా వెచ్చించి నిర్మాణాలు చేపట్టగా అవి ఈరోజు అసాంఘిక కార్యకలపాకు అడ్డాగా మారిపోయాయి. ఇప్పటివరకు ఆ షాపులకు టెండర్లు లేక ఎవరికీ కేటాయించనందున మున్సిపల్ కు మూడు సంవత్సరాలనుండి ఆదాయం రాక పోయింది. ఈ మధ్యనే 15 వార్డులో నిర్మించిన స్ట్రీట్ వెండర్ కూల్చివేయడంతో కాంగ్రెస్ నాయకులు పెద్దఎత్తున నిరసన చేపట్టారు. కమీషనర్ కార్యాలయంలో కమీషనర్ కు, పాలక వర్గానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసారు.
ప్రతీ స్ట్రీట్ వెండర్ కు లక్షల రూపాయల ప్రజాదనాన్ని ఖర్చుపెట్టి నిర్మించగా కనీసం అది ప్రజలకు ఉపయోగపడక ముందే కూల్చి వేయడం దుర్మార్గపు చర్య అన్నారు. వాళ్ల సొంత ప్రయోజనాల కోసం స్ట్రీట్ వెండర్స్ వెనకాల ఉన్న ప్రభుత్వ స్థలము మీద కన్నేసి కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని అమ్ముకుంటున్న బడా నేతలని ఘాటుగా విమర్శించారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే కేవలం వీళ్లు వీళ్ళ స్వలాభాల కోసం తప్ప ప్రజల కోసం చేసిందేమి లేదని విమర్శించారు. దాదాపు నాలుగు సంవత్సరాలలో వీళ్లు చేసిన పని అంతా శూన్యమే.
ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ముందుగా కాలనీలలో దోమల మందు కొట్టాలని, డ్రైనేజీలు, రోడ్లతో సమస్యలతో జనం చాలా ఇబ్బంది పడుతున్నారు. ముందు వాటిపై దృష్టి సారించాలన్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పూర్తిగా దోపిడీ మాయమైపోయిందని కమిషనర్ కి ఫిర్యాదు చేశారు. పీర్జాదిగూడలో ఉన్న పలు సమస్యలైన మున్సిపాలిటీలో ఉన్న టాక్స్ లు, కుక్కల నియంత్రణ, దోమల నివారణ, రోడ్ల మరమ్మత్తులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇవే కాకుండా చెరువుల సుందరీకరణ, హరితహారం స్మశానం వాటికకలలో అవినీతి అక్రమాలను అతి త్వరలో ఆదాబ్ హైదరాబాద్ వరుస కథనాలు తీసుకురానుంది.. మా అక్షరం అవినీతిపై అస్త్రం..