Sunday, May 19, 2024

తెలుగు నేలపై నడయాడిన మహాత్ముడు

తప్పక చదవండి

తెల్లవారి జాతి దురహంకారాలు గాంధీజీ సత్యాగ్రహ సిద్దాంతానికి పునాదులయితే, ఆంధ్రుల ఆదరాభిమానాలుగాంధీజీగారికి ఎడ తెగని అభిమానాలుగా మిగిలిపోయాయి. దక్షిణాఫ్రికాలో మొదలు పెట్టిన సత్యాగ్రహ దీక్షకు మద్దతు తెలిపినవారిలో ఎక్కువమంది దక్షిణ భారతీయులే, అందులోనూ తమిళులు, తెలుగు వారు కూడా. అందువలనే 1894 నుండి గాంధీజీ గారికి తమిళులు అన్నా, తెలుగు వారు అన్నా ఆదరాభిమానాలు అధికం. 1896 లో మద్రాసు నందు గల పచ్చయప్ప కళాశాలలోని సభాస్థలిలో జరిగిన సభలో ఆంధ్రులు అశేషంగా పాల్గొని దక్షిణాఫ్రికా లో భారతీయులు అనుభవిస్తున్న బాధలన్నింటికి పరిష్కారమార్గాలు కనుగొనే సత్తా ఒక్క గాంధీకి మాత్రమే కలదు అని ఏకగ్రీవంగా తీర్మానించారు.గోఖలే మహాశయుని మరణం తర్వాత ఆయన కార్యకలాపాలను కొనసాగించడం గాంధీ పర్యటనల ముఖ్య ఉద్దేశ్యం. 1915 మే నెలలో గాంధీ సతీసమేతంగా నెల్లూరు లోని పురమందిరంలో మద్రాసు రాష్ట్రీయ సభను నిర్వహించి విధ్యార్థులతో, పుర ప్రముఖులతో కలసి విందులో పాల్గొన్నారు. తెలుగులో ప్రహ్లాద అను నాటకమును చూసి, తిరిగి మద్రాస్‌ చేరుకొన్నారు. 1919 మార్చి నెలలో రౌలత్‌ చట్టాన్ని వ్యతిరకిస్తూ జరిగిన సభలో పాల్గొని బొంబాయి తిరుగు ప్రయాణంలో మార్చి 31 వతేదీన విజయవాడ లోని శ్రీ రామమోహన్‌ గ్రంధాలయ ఆవరణంలోని సభలో పాల్గొని సత్యాగ్రహ పద్దతులు, సత్యాగ్రహ తత్వంను గూర్చి ప్రబోధించారు. దీనికిఅయ్యదేవర కాళేశ్వరరావు అనువాదకుడిగా వ్యవహరిచారు. మహాత్మాగాంధీ మాటలు ఋషివాక్కులై ప్రజల హృదయాలలో నాటుకొని పోయాయి. నాటి హైదరాబాద్‌ సంస్థానంలో ఏప్రియల్‌ 1 వ తేదీనశ్రీమతి సరోజినీ నాయుడు ఇంటిలో ఆతిధ్యం స్వీకరించి సికింద్రాబాద్‌ మరియు హైదరాబాద్‌లలో ఉపన్యసించి బొంబాయి చేరుకొన్నారు. గాంధీజీ సత్యాగ్రహ విధానాలను అనుసరి స్తూ ప్రజలు ఆంధ్ర దేశం అం తటా రౌలత్‌ చట్టానికి వ్యతిరేకంగా సత్యాగ్రహ దీక్షలు చేబట్టారు. ఖిలాపత్‌ ఉద్యమమును సమర్థిస్తూ, ఆంగ్లేయులు ఆసియా ఖండం లోని తురుష్క దేశంలోని ముస్లింలకు చేసిన నమ్మకద్రోహానికి నిరసనగా, భారతదేశంనకు స్వరాజ్య సాధనే మార్గంగా సహాయ నిరాకరణోధ్యమానికి మద్దతు కూడగట్టడం కొరకు మౌలానా షౌకత్‌ అలీతో కలసి 1920 ఆగష్టు 23 వ తేదీన విజయవాడ లోని రహదారి బంగాళా జమ్మి చెట్టు ఆవరణలో సభ జరిగినది. ఈ సభకు ఆంధ్రాలోని అనేక మంది నాయకులు హాజరు అయ్యారు,తర్వాత ఆగష్టు 24 వ తేదీన సికింద్రాబాద్రైల్వే స్టేషన్‌లో కొంతసేపు ఆగి గాంధీజీని చూడటానికి వచ్చిన సుమారు నాలుగు వేల మంది ప్రజలను ఉద్దేశించి ప్రసంగించి బొంబాయికి బయలుదేరారు. 1921 మార్చి31, ఏప్రియల్‌1వ తేదీన విజయవాడలో జరుగు అఖిల భారత కాంగ్రెస్‌ సంఘ సమావే శమునకు హాజరగుటకు గాంధీ అనేక పట్టణాలలో ప్రసంగిస్తూ వచ్చారు. విజయనగరం, రాజమండ్రి, అనకాపల్లి, లో స్వరాజ్య నిధికి విరాళాలు సేకరిస్తూ, ప్రజలనుంచి విజ్ఞాపనలను స్వీకరిస్తూ విజయవాడ చేరుకొన్నారు. తెలంగాణ నుంచి మాడపాటి హనుమంతరావు సరోజినీ నాయుడు మొదలగు వారుఈ సమావేశానికి హాజరుఅయ్యారు. ఏప్రియల్‌ 2వ తేదీన కాకినాడలోని మున్సిపల్‌ కార్మికులతో, దేవదాసీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఏప్రియల్‌ 4 వతేదీ మచిలీపట్నం లోని ఆంధ్ర జాతీయ కళాశాలలో విడిది చేశారు. అక్కడ ఆరోజు గాంధీ గారు మౌన వ్రతం లో వున్నందున ప్రసం గించలేదు. అయితే బందరులో విధ్యార్థులను ఉద్దేశించి ప్రసంగిం చారు. గుడివాడ, చీరాల మీదుగా నెల్లూరు కు చేరుకొనెను. ఏప్రియల్‌ 7వ తేదీన నెల్లూరు కు సమీపంలోని పల్లిపాడు దగ్గర తిక్కవరపు రామిరెడ్డి ఆధ్వర్యంలో గాంధీ సత్యాగ్రహఆశ్రమమును ప్రారంభించి మద్రాస్‌ చేరెను. సెప్టంబర్‌ 14 న కలకత్తా నుండి విశాఖపట్టణం నకు రైలు లో మహమ్మద్‌ ఆలీతో బయలుదేరి విశాఖపట్నం లో స్టేషన్‌ బయట ప్రసంగిస్తుం డగా మౌలానా గారిమీద నేరారోపణతో అరెస్టు చేశారు. ప్రజలను శాంతపరచి గాంధీ మద్రాస్‌ చేరుకొనిహిందూ ముస్లిం ఐక్యత కొరకు ప్రజలు ఇంకా కృషి చేయవలెనని ప్రతినబూనారు. గాంధీ సెప్టంబర్‌ 28 వ తేదీన తిరుపతి, రేణిగుంట, రాజంపేట, తాడిపత్రి, కడప, కర్నూల్‌ పట్టణాలలో ప్రసంగిస్తూ అనేక చోట్ల సన్మానపత్రాలను స్వీకరిస్తూ బళ్ళారి చేరెను. చాలా సంవత్సరాల తర్వాత తిరిగి గాంధీ తెలుగు నేలపై నడయాడుటకు, విస్తృతంగా ఖాదీ ప్రచారమును చేయుటకు హైదరాబాద్‌ నుండి శ్రీకారం చుట్టిరి. హైదరాబాద్‌ లోనిసరోజినీదేవి నివాసంలో బస చేసి, గౌలిగూడెం లోని వివేకవర్ధిని థియేటర్‌లో సభను నిర్వహించి ప్రజలకు ఖాదీ ఆవశ్యకతను వివరించి విరాళాలను స్వీకరించారు. హైదరాబాద్‌ నుండి నందిగామ, నూజివీడు, విజయవాడ, గుడివాడ, దివిసీమ, మచిలీపట్నం, గుంటూరు, తెనాలి, పరిసర గ్రామాల్లో సంచరించి ప్రజలను చైతన్య పరుస్తూ గోదావరి జిల్లాలమీదుగా విజయనగరం చేరెను. తర్వాత తిరుగు ప్రయాణంలో రాజమండ్రి మీదుగా నెల్లూ రుకు చేరుకొని, కావలి, నాయుడుపేట, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, కదిరి, అనంతపురం, కర్నూల్‌, గుంతకల్‌ మీదుగా బొంబాయి చేరుకొనెను. తర్వాత 1933, 1934 వ సవత్సరంలలో తెలంగాణ,కోస్తా, రాయలసీమ ప్రాంతాలలో పర్యటించి ప్రజలను స్వాతంత్య్ర ఉద్యమంనకు సమాయత్తం చేసెను. ప్రజలంతా గాంధీజీ దర్శనం కొరకు ఆయన ఉపన్యాసాలను వినుటకు ఎంతో ఉత్సాహం చూపిరి. గాంధీ రాకను తెలుగు వారు ఒక వేడుకలా భావించి గాంధీ అడుగుజాడలలో నడిచి కార్యోన్ముఖులై స్వాతంత్య్ర సాధనకు పాటుబడిరి. తెలుగువారి అంకుఠిత దీక్ష, సేవాగుణం, పోరాట పటిమ యావత్‌ భారతానికి ఆదర్శప్రాయమైనది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు