Sunday, April 28, 2024

పొత్తు పొడిచేనా..?

తప్పక చదవండి
  • జనసేనానితో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ల భేటీ..
  • అన్ని అవకాశాలను చర్చించిన నేతలు..
  • పవన్ కళ్యాణ్ కార్యాలయంలో జరిగిన మీటింగ్..
  • సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్న సమావేశం..

హైదరాబాద్‌ : అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో తెలంగాణ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ పార్టీలన్నీ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ప్రధాన పార్టీలతోపాటు.. తెలంగాణ సమరంలో పోటీచేసేందుకు పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలోని జనసేన కూడా సిద్ధమవుతోంది. 32 స్థానాల్లో పోటీచేయనున్నట్లు తెలంగాణ జనసేన నేతలు ప్రకటించారు. ఈ క్రమంలో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా దూసుకెళ్తున్న బీజేపీ.. ఏపీలోని మిత్ర పార్టీ జనసేనను కలుపుకుని.. ఎన్నికల సంగ్రామంలో తలపడేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేయడంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. అభ్యర్థుల ప్రకటనకు ముందు తెలంగాణలో జనసేనతో ఉమ్మడి పోటీ గురించి బీజేపీ నేతలు బుధవారం ఆపార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ తో చర్చలు జరిపారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసే అవకాశాలపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ తో.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జీ కిషన్‌ రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, ఎంపీ డా. కె.లక్ష్మణ్‌ చర్చలు జరిపారు. హైదరాబాద్‌ లోని పవన్‌ కళ్యాణ్‌ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఇప్పటికే జనసేన ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీగా కొనసాగుతున్న విషయం విదితమే. ఇందులో భాగంగా తెలంగాణ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడంపై ప్రధానంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా జనసేన నాయకుల మనోగతాన్ని పవన్‌ కళ్యాణ్‌ బీజేపీ నేతలకు వివరించారు. 2014లో ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేశామని, బీజేపీ అగ్ర నాయకుల కోరిక మేరకు హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల నుంచి విరమించుకుని బీజేపీ అభ్యర్థుల విజయానికి కృషి చేశామని వివరించారు. ఇప్పుడు కనీసం 30 స్థానాల్లో అయినా పోటీ చేయకపోతే కార్యకర్తల స్థైర్యం దెబ్బ తింటుందని తెలంగాణ జనసేన నాయకులు చెబుతున్న విషయాన్ని కిషన్‌ రెడ్డి, లక్ష్మణ్‌ కు పవన్‌ కల్యాణ్‌ ఈ సందర్భంగా తెలియచేశారు. ఉమ్మడిగా పోటీ చేసే విషయమై ఒకటి రెండు రోజులలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కలిసి పోటీచేస్తే.. ఎవరెన్ని స్థానాల్లో పోటీచేస్తారు..? జనసేనకు బీజేపీ ఎన్ని సీట్లు కేటాయిస్తుంది..? పొత్తుపై జనసేన అధినేత నిర్ణయం ఎలా ఉండనుంది.. అనే విషయాలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ గా మారింది.

కాగా ఆంధ్రప్రదేశ్‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వాన్ని గ‌ద్దె దించుతామ‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌దేప‌దే ప్రకటనలు చేస్తున్నారు.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు దానికి త‌గ్గట్లుగా వ్యూహ ర‌చ‌న చేస్తూ ముందుకు వెళ్తున్నారు.. చంద్రబాబు అరెస్టు అనంతరం.. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందని.. దాని ప్రకారమే ముందుకు వెళ్తామని కూడా ప్రకటించారు. అయితే, ఏపీతోపాటు తెలంగాణ ఎన్నిక‌ల్లో కూడా పోటీ చేయాల‌ని నిర్ణయించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. జ‌న‌సేన‌కు ఆద‌ర‌ణ ఎక్కువ‌గా ఉన్న స్థానాల‌పై గురిపెట్టారు. జ‌న‌సేన పార్టీ ఆవిర్భావం త‌ర్వాత రెండు రాష్ట్రాలకు క‌మిటీలను ప్రకటించారు. ఇంత‌వ‌ర‌కూ తెలంగాణ‌లో జ‌న‌సేన పార్టీ త‌ర‌పున ప్రజా స‌మ‌స్యల‌పై ఏదొక కార్యక్రమం చేస్తూ జ‌న‌సేన ముందుకు వెళ్తుంది.. ఇప్పటివరకు కొన్ని జిల్లాల్లో పూర్తి స్థాయిలో క‌మిటీలను నియమించిన జనసేన రాబోయే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో పోటీ ద్వారా జ‌న‌సేన ప్రజ‌ల్లోకి వెళ్లే ఆలోచ‌న‌లో ఉంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు