- కాంగ్రెస్ పగటి కలలు కంటోంది..
- బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు ఒక్కటే..
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి..
- దళిత ద్రోహి రాష్ట్ర సీఎం కేసీఆర్..
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే లిస్ట్ దండుపాళ్యం లిస్ట్..
- పెగ్గుకో పథకాన్ని ప్రవేశపెడతాడు కేసీఆర్..
- బీజేపీ జాతియ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్..
చేవెళ్ల :
కల్వకుంట్ల పీడ విరగడ కావాలని, అవినీతి, అక్రమ ప్రభుత్వం పోవాలని, ఆహాంకారపు ప్రభుత్వం కుప్పకూలాలని, నియంతృత్వపు బీఆర్ఎస్ ప్రభుత్వం పోవాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని బీజేపీ పార్టీ రాష్ట్ర అద్యక్షుడు, కేంద్ర మంత్రి జి కిషన్‌రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బుధవారం చేవెళ్లలోని సీహెచ్ఆర్ గార్డెన్‌లో మాజీ పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జితెందర్‌రెడ్డి అధ్యక్షతన, చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గ బూత్ సమ్మేళనం ఏర్పాటు చేశారు. అంతకంటే ముందు చేవెళ్ల శంకర్‌పల్లి చౌరస్తా నుంచి డప్పు కళాకారులతో షాబాద్ చౌరస్తా వరకు భారీ ర్యాలీగా వెళ్లారు. కార్యక్రమంలో భాగంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే అత్యంత అవినీతి పార్టీ, అత్యంత దోపిడి చేసిన పార్టీ, కుటుంబ పార్టీ, మజ్లీస్ పార్టీకి కొమ్ముకాస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని కిషన్‌రెడ్డి ద్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీ లాగే కాంగ్రెస్ పార్టీ కూడా అవినీతి పార్టీ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా దేశంలో 10 లక్షల కోట్ల రూపాయలు దోపిడి చేసిన పార్టీ అని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. ఇలాంటి మోస పూరితమైన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తానని పగటి కలలు కంటోందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ఓట్ల కోసమే రైతులను మబ్యపెడుతున్నారని, రైతుల రుణమాఫీ చేస్తానని, 4 ఏళ్లుగా పెరిగిన వడ్డినే లక్షల రూపాయలు కాగా ఇప్పుడు రైతు రుణమాఫి చేస్తారని, ఇది కేవలం ఓట్ల కోసం ఆడుతున్న రైతు డ్రామా అని మండిపడ్డారు. హుజురాబాద్ ఎన్నికల్లో బీజేపీ పార్టీని ఓడించడం కోసమే దళిత బందు ప్రవేశ పెట్టారని, ఇప్పుడు కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే దళిత బందు ఇస్తున్నారని వారు అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక మాఫియాగా ఏర్పడి దళిత బందులోని 30 శాతం వాటాను వారే దోచుకుంటున్నారని విమర్శించారు. అదే విదంగా దళిత బందు రాని ఏ ఒక్క దళితుడు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకుడదని అన్నారు.
దళిత ద్రోహి సీఎం కేసీఆర్ : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్..
దళిత ద్రోహి సీఎం కేసీఆర్.. అంబేద్కర్ జయంతికిగాని, వర్థంతికిగాని ఒక్క రోజు కూడా హాజరు కాని తెలంగాణ సీఎం కేసీఆర్ దళిత ద్రోహి అవుతాడని సీఎం కేసీఆర్‌పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండిసంజయ్ కుమార్ మండిపడ్డారు. అంబేద్కర్ పుట్టిన ప్రాంతం, చదువుకున్న ప్రాంతం, స్వర్గస్థులైన స్థలాన్ని బీజేపీ ప్రభుత్వం పంచతీర్థాలుగా అభివృద్ది చేసి, రాబోయే తరాలకు స్పూర్థి దాయకంగా చేస్తుంది.. దళిత సమాజం గురించే ఆలోచించే ఏకైక పార్టీ బీజేపీ పార్టీ అన్నారు.. ఈ రాష్ట్రంలో దళితులపై దాడులు జరిగితే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించడని మండిపడ్డారు.
పెగ్గుకో పథకం :
ఒక పెగ్గు వేసి ఇంటికో ఉద్యోగం ఇస్తానంటాడు, రెండవ పెగ్గుకు డబుల్ బెడ్రూమ్ అంటాడు, మూడవ పెగ్గుకు దళితులకు మూడెకరాల భూమి, నాలుగవ పెగ్గుకు దళిత బందు, ఐదవ పెగ్గుకు నేను ఎమీ అనలేదు అంటాడని బండి సంజయ్ విమర్శించారు.
కేసీఆర్ ఓ క్యాన్సర్ :
సీఎం కేసీఆర్ ఓ క్యాన్సర్ లాంటోడని, తెలంగాణ ప్రజలు ఎలా భరిస్తున్నారని బండి ప్రశ్నించారు.. నమ్మి ఓటు వేసినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతు కోశాడని అన్నారు. నీళ్లు, నిధులు నియామాకాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, ఎంతో మంది ఉద్యమకారులపై కేసులు ఉన్నా.. సీఎం కేసీఆర్‌పై ఒక్క కేసైనా ఉందా..? ఉద్యమ కేసు ఉందా..? అని ప్రశ్నించారు. కేసీఆర్ కూతురి కవితపై, కేటీఆర్‌పై ఒక్క లాఠీ దెబ్బైనా పడిందా..? అన్నారు..
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల లిస్ట్ ఓ దండుపాళ్యం లిస్ట్ :
బీఆర్ఎస్ పార్టీ తాజాగ విడుదల చేసిన ఎమ్మెల్యేల టికెట్ లిస్ట్‌ను బండిసంజయ్ ఆ లిస్ట్ దండుపాళ్యం లిస్ట్ అని అన్నారు. ఒక్కరు కూడా నిజాయితీ పరులు లేరని అందరూ అవినీతిపరులే అని అన్నారు. కేసీఆర్‌ని, కేసీఆర్ కుటుంబాన్ని ఈ రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టి పంపించడమే లక్ష్యమని అన్నారు.
చేవెళ్ల పొట్ట కొట్టిన కేసీఆర్ : మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కు లేదని, చేవెళ్లలోని అంబేద్కర్ ప్రాణాహిత ప్రాజెక్టు పేరును మార్చి చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్ట్‌గా పేరు మార్చాడు. కేసీఆర్ తన ఇష్టదేవుడైన కాలేశ్వరం పేరు పెట్టుకున్నాడన్నారు. ఎస్సీలకే కాదు రైతులకు కూడా చాలా ద్రోహం చేశారని ఆయన మండిపడ్డారు. చందన్‌వెల్లి, హైతాబాద్ రైతులకు ఎకరం రూ.2కోట్లు ఉన్న భూమికి రూ.10లక్షలు ఇచ్చారన్నారు. అదే విదంగా సీతారాంపూర్ గుడికి సంబందించిన భూమిని కూడా అమ్ముకుని చేవెళ్ల ప్రాంతం పొట్ట కొట్టాడని మండిపడ్డారు. అంతే కాకుండా ఎన్నిసార్లు జీవో నెం. 111ని రద్దు చేస్తారనీ, యువరాజు కేటీఆర్, యువరాణి కవిత కోసం ఈ జీవో రద్దు నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక ఎమ్మెల్యే చంద్రప్ప, బీజేపీ అధికార ప్రతినిధి విఠల్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్కా నర్సింహారెడ్డి, దళిత మోర్చా అధ్యక్షుడు బాషా, అధికార ప్రతినిధి వీరేందర్ గౌడ్, ఆర్టీ కార్మిక నాయకుడు అశ్వద్ధామ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కంజెర్ల ప్రకాష్, నర్సింహా రెడ్డి, బోసుపల్లి ప్రతాప్ రావు, సీనియర్ నాయకుడు ప్రభాకర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ శ్రీరాములు యాదవ్, జాయింట్ కన్వీనర్ రమేష్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రమేష్, సీనియర్ నాయకులు వర్రీ తులసీరామ్ విజయ్‌కుమార్, మండలాల, గ్రామాల, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.