- బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారం అడ్డుబెట్టుకొని అందినకాడికి దోచుకునుడే
- కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు నైజం ఇదేనా?
- కల్వకుంట్ల కన్నారావుపై పలు పోలీస్ స్టేషన్ లలో భూకబ్జా కేసులు
- ఆదిభట్లలో రెండు ఎకరాలు కబ్జాకు యత్నం
- ఆదిభట్ల పిఎస్ లో కల్వకుంట్ల కన్నారావుపై పలు సెక్షన్ లపై కేసు
- కన్నారావు కోసం గాలిస్తున్న పోలీసులు
గతంలో వున్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన ఆడిందే ఆట పాడిందే పాట. ప్రభుత్వ పెద్దలే మనవాళ్ళు. ఇక మనకేం అడ్డు. గత బీఆర్ఎస్ హయాంలో ఇలా సాగింది కల్వకుంట్ల తేజేశ్వర్ రావు అలియాస్ కన్నారావు వ్యవహారం. ఆయన కన్ను బడితే ఆ భూమి కబ్జానే. అధికారం మనదే ఇక దానిని అడ్డుబెట్టుకొని అందినకాడికి దోచుకునుడే అనేది ఆయన నైజం అని పలు పోలీస్ స్టేషన్ లలో ఆయనపై నమోదు అయిన భూకబ్జా కేసులు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. గత గవర్నమెంట్ హయాంలో చోటుచేసుకున్న అక్రమాలపై ఫోకస్ పెంచింది. అక్రమాలకు పాల్పడితే చర్యలకు వెనకడుగు వేసేదే లేదంటుంది.
ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అబ్దుల్లాపూర్ మండలం మన్నెగూడ వద్ద వేద కన్వెన్షన్ హాల్ ఎదురుగా ఉన్న సర్వే నెంబర్ 32 లో రెండు ఎకరాల ప్రైవేట్ భూమిని కబ్జా చేశారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల తేజేశ్వర్ రావు అలియాస్ కన్నారావుపై కేసు నమోదు అయ్యింది. ఓఎస్ఆర్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ శ్రీనివాస్ మార్చి 3వ తేదీన రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని ఆధిభట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కల్వకుంట్ల తేజేశ్వరరావు అలియాస్ కన్నారావు ఈ నెల 3వ తేదీ ఉదయం 7 గంటల సమీపంలో 150 మంది దుండగులు, జేసీపీ తో వచ్చి రెండు ఎకరాల పొలంలో ఫెన్సింగ్ తొలగించి,భూమి చుట్టూ ఉన్న బ్లూ షీట్స్ కు నిప్పు పెట్టి హద్దు రాళ్ళు పాతారు. భూమి చుట్టూ ఉన్న ఫ్రీ కాస్ట్ వాల్స్ ను కూల్చివేసి, అందులో ఉన్న గుడిసెకు నిప్పు పెట్టి కాల్చారు.
దీంతో 307, 447, 427, 436, 148, 149,506 ఐపిసి సెక్షన్స్ కింద జక్కిడి సురేందర్, జక్కిడి హరినాథ్, శివ, కల్వకుంట్ల కన్నారావు, డానియల్ తో పాటు దాదాపు 38మంది బీఆర్ఎస్ నాయకులపై పలు కేసులు నమోదు చేసిన సమాచారం ఆలస్యంగా వెలుగు చూసింది. జేసీబీ డ్రైవర్, ఓనర్ తో పాటు 5గురు రిమాండ్ చేసినట్లు, కన్నారావుతో పాటు జక్కిడి సురేందర్, జక్కిడి హరినాథ్ తదితరులు పరారీలో ఉన్నారు. వారి కోసం ఇబ్రహీంపట్నం ఏసీపీ కె.పి.వి రాజు ఆధ్వర్యంలో 12 మందితో 3 బృందాలు అన్వేషిస్తున్నట్లు, కన్నారావు బెంగుళూరులో ఉన్నట్లు సిగ్నల్స్ ఆధారంగా గుర్తించినట్లు సమాచారం. ధరణి పేరుతో కోట్ల విలువ చేసే భూములు బీఆర్ఎస్ నేతలు మింగేశారని, భూ కబ్జాలకు పాల్పడ్డారని ఇప్పటికే తూర్పూరబడుతోంది అధికార కాంగ్రెస్. ఈ తరుణంలో బీఆర్ఎస్ నేతలు ఇలా అక్రమాలకు పాల్పడటం, వారిపై కేసులు నమోదు కావడం సర్వత్రా చర్చనీయాంశమౌతుంది. దీనిపై పోలీసులు మరింత విస్తృతంగా చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. గత ప్రభుత్వ నాయకుల అండతో ఇస్టారీతిగా భూకబ్జాలకు పాల్పడిన కల్వకుంట్ల కన్నారావుకు ఇక కష్టాలు మొదలైనట్లే కనిపిస్తున్నాయి.
గతంలో మంత్రి తలసాని మనిషికి వార్నింగ్ అంటూ సోషల్ మీడియాలో వైరల్…
గతంలో అప్పటి బిఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మనిషికి ఒక విషయంలో ఫోన్ చేసి వార్నింగ్ యిచ్చాడంటూ సోషల్ మీడియాలో కన్నారావు వాయిస్ అంటూ వైరల్ అయిన సంఘటన కూడా వెలుగులోకి వచ్చింది.నార్సింగ్ ప్రాంతంలో కూడా గతంలో ఆరోపణలు వచ్చాయి. మేడ్చల్ జిల్లాలో కూడా భూ కబ్జా ఆరోపణలు వున్నాయి. గతంలో అనేక పోలీస్ స్టేషన్ లలో కన్నారావుపై ఫిర్యాదులు అనేకం వున్నాయి. కానీ అధికారం లో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉండటంతో అతను ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది. చూడాలి మరి కన్నారావు లాంటి భూ కబ్జా దారులపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు ఏవిధంగా వుంటాయో.